సస్పెండ్ అయ్యాక బయటికొస్తున్న విపక్ష సభ్యులు; నిరసన తెలుపుతున్న డెరెక్ ఓబ్రెయిన్
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై గురువారం ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ప్రతిపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం జరిగిన అవాంఛనీయ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో తీవ్ర అలజడి సృష్టించారు. వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని పట్టుబట్టారు. అరుపులు, కేకలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. తీవ్ర గందరగోళం నెలకొంది. ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లోక్‌సభ నుంచి 13 మంది విపక్ష ఎంపీలపై, రాజ్యసభలో ఒక ప్రతిపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం వారు సభకు హాజరు కాకూడదని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు.
లోక్‌సభలో నినాదాల హోరు
లోక్‌సభ గురువారం ఉద యం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రా రంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు శాంతించలేదు. దీంతో సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న ఐదుగురు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు.
టీఎన్ ప్రతాపన్, హిబీ ఎడెన్, జోతీమణి, రమ్య హరిదాస్, దీన్ కురియాకోస్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో ప్రహ్లాద్ జోషీ మరో తీర్మానం ప్రవేశపెట్టారు.
9 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. వీకే శ్రీకందన్, బెన్నీ బెహనన్, మొహమ్మద్ జావెద్, పీఆర్ నటరాజన్, కనిమొళి, కె.సుబ్బరాయన్, ఎస్‌ఆర్ పార్తీబన్, ఎస్.వెంకటేశన్, మాణిక్కం ఠాగూర్‌ను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతను పర్యవేక్షించే బాధ్యత లోక్‌సభ సెక్రెటేరియట్‌దేనని స్పీకర్ ఓంబిర్లా చెప్పారు. సభ వాయిదా పడిన తర్వాత పలువురు విపక్ష సభ్యులు సభలోనే ఉండి ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని సస్పెండ్ చేశారు: కాంగ్రెస్
పార్లమెంట్ ఉభయ సభల నుంచి గురువారం మొత్తం 14 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విపక్ష ఎంపీలను కాదు, దేశ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం నుంచి సమాధానం కోరినందుకు ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం, భయానక చర్య అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం హత్య చేసిందని, పార్లమెంట్‌ను రబ్బర్ స్టాంప్ స్థాయికి దిగజార్చిందని దుయ్యబట్టారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆగంతకులు పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు కారణమైన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు.
ఎగువ సభలో తీవ్ర అలజడి
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశాయి. ఈ రోజు మిగతా కార్యకలాపాలను పక్కనపెట్టి, కేవలం భద్రతా వైఫల్యంపైనే సభలో చర్చ చేపట్టాలని పలువురు ఎంపీలు గురువారం ఉదయం 28 నోటీసులు ఇచ్చారు. వీటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తేలి్చచెప్పారు.
సభకు సహకరించాలని కోరారు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తుండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చైర్మన్ వేదిక ముందుకు చేరుకొని, గాల్లోకి చేతులు విసురుతూ గట్టిగా అరిచారు. ఆయన తీరుపై చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను «ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
డెరెక్ ఓబ్రెయిన్‌ను సభ నుంచి సస్పెండ్ చేయడానికి రూల్ 256 కింద తీర్మానం ప్రవేశపెట్టడానికి బీజేపీ పక్షనేత పీయూష్ గోయల్‌కు అనుమతి ఇచ్చారు. పీయూష్ గోయల్ తీర్మానం ప్రవేశపెట్టడం, మూజువాణి ఓటుతో అమోదం పొందడం, డెరెక్ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు వేయడం వెంటనే జరిగిపోయాయి. ఆయనను ఈ సెషన్‌లో మిగిలిన కాలమంతా స్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు.
సస్పెండ్ అయినప్పటికీ బయటకు వెళ్లకుండా సభలోనే కూర్చున్న డెరెక్ ఓబ్రెయిన్‌పై ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. నియమ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. అయినా ఓబ్రెయిన్ వినిపించుకోలేదు. రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ చెప్పారు. ఇదిలా ఉండగా, సభ నుంచి సస్పెండ్‌చేసినా బయటకు వెళ్లకుండా నిబంధనలను ఉల్లంఘించిన డెరెక్ ఓబ్రెయిన్ తీరుపై విచారణ జరపాలని సభా హక్కుల కమిటీకి జగదీప్ ధన్‌ఖడ్ సిఫార్సు చేశారు.
సభలో లేకున్నా సస్పెన్షన్
లోక్‌సభలో రెండో విడతలో సస్పెండైన విపక్ష ఎంపీల్లో తమిళనాడుకు చెందిన ఎస్‌ఆర్ పార్తీబన్ పేరు కూడా ఉంది. వాస్తవానికి ఆయన గురువారం సభకు రాలేదని, చెన్నైలో ఉన్నారని ప్రతిపక్ష సభ్యులు చెప్పారు. సభలో లేని ఎంపీని సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. పొరపాటు జరిగిందని అంగీకరించారు. ఆయన పేరును తొలగిస్తున్నట్లు చెప్పారు. పార్తీబన్‌పై సస్పెన్షన్ వేటును స్పీకర్ ఉపసంహరించినట్లు తెలిపారు. గురువారం లోక్‌సభ నుంచి మొత్తం 13 మందిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. బుధవారం నాటి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment