న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎంపీల నడుమ శుక్రవారం కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రాజ్యసభ నుంచి సస్పెండైన 12 మంది ఎంపీలతోపాటు పలువురు విపక్ష సభ్యులు ఐదు రోజులుగా గాంధీజీ విగ్రహం వద్ద బైఠాయించి, నిరసన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బీజేపీ ఎంపీలు కూడా పోటీగా ప్లకార్డులు చేతబూని అక్కడికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎంపీలు కొద్దిసేపటి తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉన్న అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీగా వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు.
గాంధీజీ విగ్రహం వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. బీజేపీ సభ్యుల తీరుపై విపక్ష ఎంపీలు సభాపతులకు ఫిర్యాదు చేశారు. 12 మంది ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతంలోకి అధికార పార్టీ ఎంపీలు అనుమతి లేకుండా చొరబడ్డారని రాజ్యసభలో ఆర్జేడీ సభ్యుడు మనోజ్‌ఝా ఆరోపించారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి ఇదే అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ స్పందిస్తూ.. గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలిపే హక్కు బీజేపీ సభ్యులకు కూడా ఉందన్నారు. పార్లమెంట్‌లోని సెక్యూరిటీ సిబ్బందిపై ప్రతిపక్షాల దాడిపై బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారన్నారు.
సీబీఐ, ఈడీ డైరెక్టర్ పదవీ కాలం గరిష్టంగా ఐదేళ్లు!
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ల పదవీ కాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల దాకా పొడిగించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను కేంద్రం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్(సవరణ) బిల్లును కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సభలో ప్రవేశపెట్టారు. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో ఈ బిల్లులను తీసుకొచ్చారు.
వీటిని కాంగ్రెస్ సభ్యులు శశి థరూర్, కె.సురేష్, అధిర్ రంజన్ చౌదరి, ఆర్‌ఎస్పీ సభ్యుడు ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతరాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. పదవీ కాలం పొడిగింపు అనేది సీబీఐ, ఈడీ డైరెక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి మరింత విధేయులుగా మారడానికి దోహదపడుతుంది తప్ప ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న చట్టాలు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలంపై ఎలాంటి పరిమితి విధించలేదని జితేంద్ర గుర్తుచేశారు. తాము ఐదేళ్ల పరిమితిని విధిస్తూ చట్టం తీసుకొస్తున్నామని వివరించారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు రెండేళ్ల పదవీ కాలాన్ని ఖరారు చేస్తూ వినీత్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment