![Winter Parliament Session 2023: Lok Sabha, Rajya Sabha adjourned indefinitely - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/22/LOK-POSTPON.jpg.webp?itok=5TbvuW0g)
లోక్‌సభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది. శీతాకాల సమావేశాల్లో షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే దిగువ సభ వాయిదా పడడం గమనార్హం. ఈ నెల 4న ప్రారంభమైన ఈ సెషన్‌ను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న ముగించాల్సి ఉంది. పార్లమెంట్ నూతన భవనంలో పూర్తిస్థాయిలో జరిగిన తొలి సెషన్ ఇదే. ఈసారి సభలో 74 శాతం ప్రొడక్టివిటీ నమోదైనట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. మొత్తం 18 బిల్లులను ఆమోదించినట్లు చెప్పారు.
శీతాకాల సమావేశాలు ఈసారి వాడీవేడిగా జరిగాయి. లోక్‌సభలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించడం, రంగుల గొట్టాలు ప్రయోగించడం వంటివి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. పార్లమెంట్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయడం, నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడంతో రికార్డు స్థాయిలో 146 మంది ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండయ్యారు. ప్రశ్నలకు లంచాలు కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై సస్పెన్షన్ వేటు పడింది.
Comments
Please login to add a commentAdd a comment