కాకినాడ సిటీ : విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన పై వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తినీ వ్యక్తం చేశారు. కాకినాడ జేఎన్‌టీయూ అల్యూమినియం ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు. మండలి చైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ అధ్యక్షతన జరిగిన అభిప్రాయ సేకరణలో వివిధ వర్గాలకు చెందిన 31 మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారంతా చార్జీల పెంపును వ్యతిరేకించారు. సరఫరా నష్టాలను తగ్గించాలని, బకాయిల వసూళ్లు చేపట్టాలని, అక్రమ విద్యుత్ వినియోగం నియంత్రించాలని, సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని సూచించారు.
అభిప్రాయ సేకరణ బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు తెలిసేలా నిర్వహించుండా గదుల్లో నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న జేఎన్‌టీయూకే గేటు వద్ద వామపక్షాలు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనపై నిరసనను తెలిపాయి. సమావేశానికి వెళ్లేందుకు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించినా భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దీనితో గేటు వద్దే బైఠాయించారు. విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిపాదనల ప్రతులను తగలబెట్టారు. సీపీఎం మహిళా ప్రతినిధులు జి.బేబీరాణి, టి.సావిత్రిలను మాత్రమే పోలీసులు లోపలికి తీసుకువచ్చారు. గదుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ప్రజలను రానీయకుండా అడ్డుకోవడంపై హాలులోకి వచ్చిన మహిళా ప్రతినిధులు నిరసనను వ్యక్తం చేశారు.
సీపీఎం నేతల వాకౌట్
హాలులో ఉన్న సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, పార్టీ నాయకుడు టి.ఎస్.ప్రకాష్ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి ప్రజాభిప్రాయ సేకరణ గదుల్లో కాక బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని కోరుతూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. దీనికి చైర్మన్ భవానీప్రసాద్ స్పందిస్తూ తాము ఎలాంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని, ఎవరైనా తమ అభిప్రాయాలు తెలియజేసే అవకాశం ఉందని అన్నారు. సమావేశానికి వచ్చేవారిని అడ్డుకోవద్దని, తక్షణం లోపలికి పంపాలని పోలీసులను ఆదేశించారు. దీనితో బయట ఆందోళన చేస్తున్న వామపక్షాల కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు హాలులోకి వచ్చి అభిప్రాయాలను తెలిపారు.
మా పరిధిలో సమస్యల్ని పరిష్కరిస్తాం..
జస్టిస్ భవానీప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ నియంత్రణ మండలి అనేది వ్యవస్థలో భాగమని, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నిర్వహించే అంశాలని అన్నారు. వారు నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడి మండలి పనిచేస్తుందన్నారు. తమ పరిధికి లోబడి ఉన్న సమస్యలన్నింటినీ సంస్థ పరిష్కరిస్తుందని, దానికి మించిన వాటిని ప్రభుత్వం లేదా సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.
చార్జీల పెంపు ప్రతిపాదనపై గత మూడు రోజులుగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ మంచి అనుభవాలను ఇచ్చిందన్నారు. సమావేశంలో ముందుగా ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఆర్.ముత్యాలరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ స్థితిగతులను, చార్జీల పెంపు ప్రతిపాదనలను వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో మండలి సభ్యులు డాక్టర్ పి.రఘు, పి.రామమోహన్, ఏపీఈపీడీసీఎల్ డెరైక్టర్లు పాల్గొన్నారు.
అసంతృప్తి, ఆగ్రహం
Published Thu, Feb 26 2015 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement