వికటించిన మధ్యాహ్న భోజనం!
- వాంతులు చేసుకున్న విద్యార్థులు
- కంపు కొట్టిన సాంబారు
- అన్నం బయట పారబోత
చోడవరం రూరల్, న్యూస్‌లైన్: గోవాడ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. ఆదివారం మధ్యాహ్న భోజనం చేసిన కొందరు విద్యార్థులకు వాంతులకు గురయ్యారు. మరికొందరు అన్నం బయట పారబోశారు. ఇది తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. సాంబారు బాగోలేక వాంతులు అయ్యాయని, అందుకే భోజనాలను పారబోశామని విద్యార్థులు తెలిపారు.
ఈ ఉన్నత పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థులు ఉన్నారు. రోజూ మాదిరి ఆదివారం మధ్యాహ్నభోజనం తిన్న కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మళ్ల సాయి, ఎస్. శ్యామల, తదితరులు కొద్ది సేపు అస్వస్థతతో ఇబ్బంది పడ్డారు. కొందరు భోజనం మానేశారు. మరి కొందరు పళ్లాల్లోని అన్నాన్ని బయట పారబోశారు. ఇది తెలిసిన గ్రామస్తులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకున్నారు. వెంటనే మండల విద్యాశాఖాధికారి(ఎంఈఓ)కి ఫిర్యాదు చేశారు. ఆయన ఎకాయెకిన పాఠశాలకు చేరుకుని వంటలను పరిశీలించారు.
వంట షెడ్డు లేకపోవడంతో ఆరుబయట వంటలు చేస్తున్నారు. దీనికి తోడు సమీపంలోనే విద్యార్థుల మరుగుదొడ్లు ఉన్నాయి. వాటిని శుభ్రపరిచిన దాఖలాలు కనిపించడం లేదు. కాగా సాంబారులో వినియోగించిన టమాటా, ఇతర కూరల వల్ల రుచి పాడయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం మిగిలిన పప్పును సాంబారులో ఆదివారం వినియోగించారని కొందరు విద్యార్థులు ఆరోపించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులతోపాటు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు.
తాము పాత్రలను శుభ్రం చేసి వండుతున్నామని, పైన చెట్ల నుంచి ఏదైనా పడి ఉండవచ్చని నిర్వాహకులు అంటున్నారు. మాజీ సర్పంచ్ ఏడువాక లక్ష్మణకుమార్, ఏడువాక సింహాచలం ఆధ్వర్యంలో పలువురు తల్లిదండ్రులు, యువకులు ఈ విషయమై హెచ్‌ఎం, ఎంఈవోలను నిలదీశారు. సెలవులో ఉన్నందున తాను ఈ రోజు వంటలను పరిశీలించలేదని హెచ్‌ఎం రవీంద్రబాబు తెలిపారు. మళ్లీ వండి మధ్యాహ్నం మూడు గంటలకు విద్యార్థులకు భోజనం పెట్టారు.