ఒకటో తేదీనే 97 శాతం మందికి పింఛన్ల పంపిణీ | Distribution of pensions to 97 percent of people on 2nd July | Sakshi
Sakshi News home page

ఒకటో తేదీనే 97 శాతం మందికి పింఛన్ల పంపిణీ

Published Thu, Jul 2 2020 4:17 AM | Last Updated on Thu, Jul 2 2020 8:23 AM

Distribution of pensions to 97 percent of people on 2nd July - Sakshi

తొలి పొద్దులోనే..గుంటూరు భవానీపురానికి చెందిన రాములమ్మకు వృద్ధాప్య పింఛను అందజేస్తున్న వలంటీర్‌ కృష్ణవేణి

తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని అప్పలరాజుపేట గ్రామంలో ఓ పాకలో వుంటున్న శతాధిక వృద్ధురాలికి బుధవారం ఉదయాన్నే పింఛను సొమ్ము అందజేస్తున్న వలంటీరు సుగుణ 

సాక్షి, అమరావతి: జూలై నెల పింఛన్ల పంపిణీ తొలి రోజునే 97 శాతానికి పైగా పూర్తయింది. అవ్వాతాతలు చిన్న కష్టం కూడా పడకుండానే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే నెల తొలి రోజునే పింఛను సొమ్ములు చేతికి అందాయి. ఒకటవ తేదీ మధ్యాహ్నానికే ఈ నెల జరగాల్సిన పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను అందజేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షనర్ల చేతికి పింఛను సొమ్మును అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.68 లక్షల మంది వలంటీర్లు బుధవారం తెల్లవారు జాము నుంచే పంపిణీ మొదలు పెట్టి మధ్యాహ్నం కల్లా దాదాపు పూర్తి చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో  భాగంగా ఈసారి కూడా బయో మెట్రిక్‌ విధానంలో కాకుండా పారదర్శకత కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా పంపిణీ సమయంలో జియో ట్యాగింగ్‌తో కూడిన లబ్ధిదారుడి ఫొటో తీసుకొని వలంటీర్లు డబ్బులు అందజేశారు.  
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని అప్పలరాజుపేట గ్రామంలో ఓ పాకలో వుంటున్న శతాధిక వృద్ధురాలికి బుధవారం ఉదయాన్నే పింఛను సొమ్ము అందజేస్తున్న వలంటీరు సుగుణ  

59,03,723 మంది పింఛనుదారులకు గాను 57,32,603 మందికి బుధవారం పింఛన్ల పంపిణీ జరిగింది. మొత్తం రూ.1,389 కోట్లు లబ్ధిదారుల చేతికి చేరాయి. ఈ మేరకు 97.1 శాతం మందికి అందాయి. 

 లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలల కాలంలో వేరే ప్రాంతంలో చిక్కుకుపోయి అప్పట్లో పింఛను తీసుకోలేకపోయిన 1.70 లక్షల మంది లబ్ధిదారులకు  బకాయిలతో కలిపి బుధవారం అందజేశారు.  

జూలై నెల పెన్షన్‌ సొమ్మును అనివార్య కారణాల వల్ల ఈ నెలలో అందుకోలేక పోతే, వారికి ఆగస్టు నెలలో అందచేసే పెన్షన్‌తో కలిపి అందించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన సూచన చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ( సెర్ప్‌) అధికారులు వెల్లడించారు.  

రాష్ట్ర సరిహద్దులు దాటి  
ఆసుపత్రిలో చికిత్స కోసం ఒకరు, కూతురిని చూసేందుకు మరొకరు లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. అప్పటి నుంచి కర్నూలు జిల్లా నంద్యాలకు రావడానికి వీలు లేకుండా పోయింది. దీంతో వీరు మూడు నెలలుగా పింఛన్‌ తీసుకోలేకపోయారు. ఈ నెల కూడా తీసుకోకపోతే పింఛన్‌ రద్దవుతుందని తెలుసుకున్న వలంటీర్లు వార్డు సచివాలయ అధికారుల అనుమతితో తెలంగాణకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి.. పలువురి ప్రశంసలు అందుకున్నారు.   

యాదగిరి గుట్టకు వెళ్లి.. 
నంద్యాల ఐదో వార్డు నడిగడ్డ వీధికి చెందిన నసీమా, మహబూబ్‌బాషా దంపతుల కుమారుడు అస్లాం బాషా (10) కొన్ని నెలలుగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఇతను పుట్టుకతోనే  దివ్యాంగుడు. లాక్‌డౌన్‌ ముందు నుంచి హైదరాబాద్‌లో బాలుడికి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌ నుంచి నంద్యాలకు రాలేకపోయారు. యాదగిరిగుట్టలోని బంధువుల ఇంట్లో ఉంటూ బాలుడికి ఫిట్స్‌ వచ్చినప్పుడల్లా హైదరాబాద్‌ తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా అస్లాం బాషా పింఛన్‌ తీసుకోలేదు. ఈ నెల కూడా తీసుకోకపోతే పింఛన్‌ రద్దవుతుందన్న ఉద్దేశంతో 5వ వార్డు వలంటీర్‌ షేక్‌రెహమాన్‌ వార్డు సచివాలయ అధికారుల అనుమతితో,  వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జ్‌ సోమశేఖర్‌రెడ్డి సహకారంతో యాదగిరిగుట్టకు ద్విచక్ర వాహనంపై వెళ్లి అస్లాం బాషాకు నాలుగు నెలల పింఛన్‌ రూ.12వేలు అందజేశారు.  

హైదరాబాద్‌కు వెళ్లి పింఛన్‌   
నంద్యాల 15వ వార్డులోని సరస్వతినగర్‌కు చెందిన షేక్‌ అమర్‌బీ తన కుమార్తెను చూడటానికి లాక్‌డౌన్‌ ముందు హైదరాబాద్‌ వెళ్లారు.అక్కడి నుంచి తిరిగి రావడానికి వీలు కాలేదు. అమర్‌బీ భర్త చనిపోవడంతో వితంతు పింఛన్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో వలంటీర్లు సాయిరాం, తిరుమలేష్‌ హైదరాబాద్‌కు మోటారు సైకిల్‌పై వెళ్లి ఆమెకు నాలుగు నెలల పింఛన్‌ ఒకేసారి అందజేశారు.  
 హైదరాబాద్‌లో షేక్‌అమర్‌బీకి పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్లు 

సంతోషంగా ఉంది 
నసీమా,  అస్లాం బాషా  తల్లి 
నంద్యాల నుంచి యాదగిరి గుట్టకు వచ్చి వలంటీరు పింఛన్‌ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇంత దూరం వచ్చి పింఛన్‌ డబ్బులు ఇస్తారని అసలు అనుకోలేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చాలా బాగా పనిచేస్తున్నారు. వలంటీర్లను పెట్టడం చాలా మంచిదైంది.   

ఇంత దూరం వస్తారనుకోలేదు షేక్‌ అమర్‌బీ 
నంద్యాల పిల్లోళ్లు హైదరాబాద్‌కు వచ్చి నా పింఛన్‌ డబ్బులు ఇచ్చారు. మా వీధి పిల్లోళ్లను ఈ మధ్యనే వలంటీర్లుగా తీసుకున్నారు. వాళ్లు నాకు డబ్బులు ఇవ్వడానికి ఇంత దూరం వస్తారని అనుకోలేదు. వలంటీర్లను నియమించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement