ఆరోగ్య భాగ్యం  | Distribution Of YSR Aarogyasri Health Cards Has Started | Sakshi
Sakshi News home page

ఆరోగ్య భాగ్యం 

Published Sun, Jan 5 2020 10:51 AM | Last Updated on Sun, Jan 5 2020 10:51 AM

Distribution Of YSR Aarogyasri Health Cards Has Started - Sakshi

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు(ఫైల్‌)

బొబ్బిలి:  రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించింది. కొత్త మార్గ దర్శకాలతో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డుల పంపిణీ జిల్లాలో ప్రారంభమయింది. జిల్లా వ్యాప్తంగా 7,14.389 కుటుంబాలకు విడతల వారీగా ఆరోగ్యశ్రీ కార్డులను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 28లోగా ఈ పంపిణీ పూర్తి చేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథకం గత ప్రభుత్వ హయాంలోనూ ఉన్నప్పటికీనిధుల విడుదలలో కొర్రీలు వేసేది. వందల కోట్ల రూపాయలను పెండింగ్‌లో పెట్టి రోగుల సహనానికి పరీక్ష పెట్టేది. కొన్ని వ్యాధులను జాబితా నుంచి తొలగించింది. దీనివల్ల ఎంతోమంది నిరుపేదలకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.  
అదనంగా వెయ్యి వ్యాధులకు వైద్యం 
డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డు ఉన్న వారికి గతంలోలా కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే వైద్యం కాకుండా దాదాపు అన్ని రకాల వ్యాధులూ ఉచితంగా  నయం చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది గతంలో 1059 రకాల వ్యాధులకు మాత్రమే పరిమితమయిన ఈ పథకాన్ని ఇప్పుడు 2059 రకాల వ్యాధులు, రోగాలకు వర్తింపజేస్తున్నారు. ఈ పథకం ద్వారా రూ.5 లక్షల వరకూ అయ్యే శస్త్రచికిత్సను ఉచితంగా చేస్తారు. మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో రూ.10లక్షల వరకూ అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఈ చెల్లింపులు రూ.3లక్షల వరకూ ఉన్నప్పటికీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నిధులు చెల్లించకపోవడంతో రోగ గ్రస్తులు ఆస్పత్రుల మెట్లు ఎక్కి దిగడం తప్ప మరే విధమైన ప్రయోజనం పొందలేదు. ఇప్పుడు రూ. 5 లక్షల వరకూ ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు.  

కోలుకునేవరకూ ఆర్థిక సాయం.. 
రోగులకు ఉచితంగా వైద్యం, శస్త్రచికిత్సలు చేయడంతో పాటు వారు డిశ్చార్జి అయిన తరువాత కోలుకునే వరకూ విశ్రాంతి సమయంలో అయ్యే ఖర్చులను భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోగికి డాక్టర్‌ సూచించే అవసరమయిన విశ్రాంతి దినాలను బట్టి రోజుకు రూ.250లు లేదా నెలకు గరిష్టంగా రూ.5వేలను రాష్ట్ర ప్రభుత్వం రోగి అకౌంట్లో నేరుగా జమ చేస్తుంది.

అర్హతకు వెసులు బాటు 
డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తించేందుకు కుటుంబానికి 12 ఎకరాల సాగు భూమి లేదా 35 ఎకరాలలోపు పంట భూములు, బీడు భూములు కలపి ఉన్నా అర్హత పొందుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే కారున్నా ఈ పథకం వర్తిస్తుంది. వార్షికాదాయం రూ.5 లక్షలున్నా, 3వేల చదరపు అడుగుల స్థలానికి మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను కడుతున్నా అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

అన్ని ఆపరేషన్లూ ఇక ఉచితం  
గతంలో ప్యాకేజీలు ఉండేవి. ఎక్కువ మొత్తం ఖర్చయ్యే వాటికే వర్తించేవి. ఇప్పుడు వెయ్యి రూపాయల దగ్గర నుంచీ ఉచితంగా చేస్తారు. కోలుకునేందుకు కూడా డబ్బులు ఇస్తారు.  
– ఎస్‌.వి.రమణ కుమారి, డీఎంహెచ్‌ఓ  

ఆరోగ్యశ్రీ లేక మా అమ్మ చనిపోయింది 
మా అమ్మ రమణమ్మకు క్యాన్సర్‌ సోకడంతో వివిధ ఆస్పత్రులకు తిప్పాం. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని గతేడాది వైజాగ్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాం. పథకం వర్తించాలంటే వేచి చూడాలని అక్కడి వైద్యులు చెప్పారు. సెల్‌కు మెసేజ్‌ వస్తుందనీ, ఆ తరువాత ఆపరేషన్‌ చేస్తామని చెప్పారు. ఈ లోగా రూ.లక్ష వరకూ ఖర్చు చేయించారు. రెండున్నర నెలల పాటు ఆస్పత్రిలో మెసేజ్‌ కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. చివరకు నా తల్లి చనిపోయింది.  
– లెంక అప్పారావు, ఇట్లామామిడిపల్లి, రామభద్రపురం మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement