జిల్లాకు 5 వేల టన్నుల యూరియా | District 5 thousand tons of urea | Sakshi
Sakshi News home page

జిల్లాకు 5 వేల టన్నుల యూరియా

Published Tue, Sep 2 2014 12:55 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

District 5 thousand tons of urea

  •      వారం రోజుల్లో రాక
  •      75 వేల హెక్టార్లలో వరి సాగు
  •      జిల్లా కలెక్టర్ యువరాజ్
  • విశాఖ రూరల్: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సాగు విస్తీర్ణం పెరుగుతోందని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువుల అదనపు కేటాయింపుల కోసం వ్యవసాయశాఖ కమిషనర్ తో మాట్లాడినట్లు చెప్పారు. ఈ వారంలో అదనంగా 5 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రానున్నట్లు వెల్లడించారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో వరి 90 వేల హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా వర్షాభావ పరిస్థితులతో మూడు రోజుల క్రితం వరకు కేవలం 50 వేల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగిందన్నారు. ప్రస్తుతం  వరి విస్తీర్ణం 75 వేల హెక్టార్లకు చేరుకుందన్నారు.
     
    ఆధార్ ఉంటేనే రేషన్

    రేషన్‌కార్డులతో ఆధార్ సీడింగ్ 77.84 శాతం పూర్తయిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 75.62 శాతం అనుసంధానం జరగగా ఏజెన్సీలో తక్కువగా ఉందన్నారు. అర్బన్‌లో 81.5 శాతం మంది ఆధార్‌కార్డులు అందించారని మరో 4.5 శాతం మంది అనుసంధానం చేసుకొనే అవకాశముందని, మిగిలిన కార్డులన్నీ బోగస్‌గా భావిస్తున్నామన్నారు.

    ఆధార్ అనుసంధానం చేసుకోని వారికి రేషన్ ఇవ్వరని చెప్పారు  పెన్షన్లు శత శాతం అనుసంధానం పూర్తయినట్లు చెప్పారు. హౌసింగ్, పట్టాదార్ పుస్తకాలకు ఆధార్ సీడింగ్‌కు ఈ నెల 15 వరకు ప్రభుత్వం గడువునిచ్చిందన్నారు. మొబైల్ ఆధార్ సెంటర్లు రాగానే గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీలో ఉన్న పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.
     
    ప్రతి గురువారం గ్రామదర్శిని


    గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామదర్శిని కార్యక్రమం చక్కని వేదికని కలెక్టర్ యువరాజ్ పేర్కొన్నారు.  జిల్లాలోని క్షేత్ర స్థాయి అధికారులతో సెట్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ గ్రామదర్శిని అమలుకు మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని కో-ఆర్డినేటింగ్ అధికారిగా నియమించామన్నారు. ప్రతి గురువారం గ్రామదర్శిని నిర్వహించాలని సూచించారు. అధికారులు గ్రామదర్శిని రోజున సంక్షేమ శాఖ వసతి గృహాల్లో రాత్రి బస చేయాలని చెప్పారు.

    ఇటీవల పట్టాదారు పాస్‌పుస్తకాల నమోదులో బోగస్ పాస్‌పుస్తకాలున్న ట్లు తెలిసిందని, వాటిని సృష్టించిన వారిపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని ఆదేశించారు. ఈనెల 5లోగా ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని సూచించారు.  జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ నరసింహారావు, డీపీవో సుధాకర్, జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి, హౌసింగ్ పీడీ ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డుమా పీడీ శ్రీరాములునాయుడు  పాల్గొన్నారు.
     
    వ్యవ‘సాయం’పై దృష్టి పెట్టండి
     
    నర్సీపట్నం టౌన్: వర్షాలు కురుస్తున్నందున వ్యవసాయ సంబంధ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ యువరాజ్ అధికారులను అదేశించారు. సోమవారం జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సెట్ కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడుడారు. రైతులకు కావలసిన ఎరువులపై అంచనా వేయాలని సూచించారు. ఆధార్ కార్డుల నమోదు వేగవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రికి హైదరాబాద్‌లో ఇచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్లకు పంపిస్తారని, వాటిపై వెంటనే నివేదికలు పంపాలని ఆదేశించారు.

    అక్టోబర్ నుంచి ప్రారంభించే ఎన్టీఆర్ సుజలస్రవంతి పథకానికి సంబంధించి ప్లాంట్ల నిర్వహణకు దేవస్థానాల వారు ముందుకు వచ్చారన్నారు. వీలైన గ్రామాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామదర్శని కార్యక్రమంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత నివ్వాలని, వసతి గృహాలలో నాణ్యమైన పౌష్టికాహారం సరఫరాను పరిశీలించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా నివారణలో అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు. సెట్ కాన్ఫరెన్స్‌లో నర్సీపట్నం నుంచి ఆర్డీవో సూర్యారావు, తహసీల్దార్ పార్వతీశ్వర రావు, వివి.రమణ, సుందరావు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement