
ప్లేట్ ‘లేట్’ అవుతోంది!
నేడు చిన్న పాటి జ్వరం వచ్చినా డెంగీ అని ప్రతి పౌరునిలో భయం కలుగుతోంది...
రెండు రోజుల క్రితం ఒంగోలుకు దగ్గరగా ఉండే అల్లూరులో ఓ బాలిక డెంగీతో మృతిచెందింది. జిల్లాలో 11 మందికి డెంగీ సోకి గుంటూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిని రెండు రోజుల క్రితం డీఎంహెచ్‌వో డాక్టర్ జె.యాస్మిన్ పరిశీలించారు. ఇక యాచవర ం పీహెచ్‌సీ పరిధిలో ఇరువురికి, పశ్చిమ ప్రాంతంలో మరో ఇరువురికి డెంగీ రావడంతో కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అధికారికంగా ఇలా ఉంటే అనధికారికంగా ప్రైవేట్ వైద్యశాలలో డెంగీతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారని అంచనా.
- నాలుగేళ్ల నుంచి జిల్లాకు రాని ప్లేట్‌లెట్ మిషన్
- రిమ్స్‌లో నిర్వహించే ఎలీసా పరీక్షే దిక్కు
- రెండు రోజుల కిందట బాలిక మృతి
- ఇంకా నిద్రమత్తు వీడని వైద్య ఆరోగ్య శాఖ
ఒంగోలు సెంట్రల్ : నేడు చిన్న పాటి జ్వరం వచ్చినా డెంగీ అని ప్రతి పౌరునిలో భయం కలుగుతోంది. డెంగీ లక్షణాలు లేకున్నా, ఉన్నట్లు కొంత మంది ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్‌లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. జిల్లాకే పెద్ద దిక్కయిన రిమ్స్ వైద్యశాలలో ప్లేట్‌లెట్‌లు ఎక్కించే మిషన్‌లు లేకపోవడంతో డెంగీ బాధితులు పొరుగు జిల్లాలకు తరలుతున్నారు. గత ఏడాది 499 మలేరియా జ్వరాల కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఇప్పటికే 159 కేసులు నమోదయ్యాయి. డెంగీ అనుమానిత కేసులు గత ఏడాది 91కేసులు కాగా, ప్రస్తుతం 56 కేసులు నమోదయ్యాయి.
వీటిలో 15కు పైగా పాజిటివ్ వచ్చాయి. 96 రక్త నమూనాలు ఉంటే ఎలిసా టెస్టును రిమ్స్‌లో చేస్తారు. ఎలీసా టెస్టు కిట్ దాదాపు రూ.15 వేల దాకా ఉంటోంది. దీంతో దాదాపు కనీసం 50 రక్త నమూనాలు ఉంటేనే పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఇక్కడ డెంగీ నిర్దారణ పరీక్షలో పాజిటివ్ అని వస్తే ప్రైవేట్ వైద్యుల పంట పండినట్లే. వెంటనే ప్లేట్‌లెట్‌లు ఎక్కించాలంటూ రోగులను భయాందోళనకు గురిచేసి ఆర్థికంగా దండుకుంటున్నారు.
కొరవడిన అవగాహన
డెంగీ నివారణకు ప్రైడేను డ్రై డే గా పాటించాలన్న దిశగా ఆరోగ్యశాఖ ముందడుగు వేయడం లేదు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్‌ను వదలడం, గంబూషియా చేపలను వదిలి దోమల లార్వాలను చంపడం వంటి చర్యలు శూన్యం. సమీక్ష సమావేశాలతోనే ఆరోగ్యశాఖ కాలం వెల్లదీస్తుంది.
సీఎం ప్రకటించినా చేరని వైనం
2012 అక్టోబర్ 11న జిల్లాకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి నెల రోజుల్లో పంపిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వాలు మారతున్నాయి కానీ ప్లేట్‌లెట్ మిషన్ మాత్రం రాలేదు. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలికి గత జిల్లా కలెక్టర్ రెండుసార్లు లేఖలు రాసినా ఫలితం లేదు. వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొన లేదు
- డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, ఎండీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
వ్యాధికి ఇంతవరకూ ఎటువంటి వాక్సిన్‌ను కనుగొన లేదు. డెంగీ బారిన పడిన రోగులకు జ్వరం తగ్గడానికి వాడే పారాసిటమాల్ మాత్రమే వాడాలి. ఇష్టం వచ్చినట్లు యాంటిబయాటిక్‌లను. నొప్పి నివారణ మందులు వాడరాదు. యాంటి జెన్, యాంటీ బాడీ, ఎలీసా టెస్టు ద్వారా వ్యాధిని నిర్దారించాలి. ప్లేట్‌లెట్‌లు దాదాపు 50 వేల కంటే తగ్గి పోయినపుడు పరిస్థితి విషమం అవుతుంది. ప్లేట్‌లెట్‌లు పడిపోతే అంతర్గతంగా రక్త స్రావం జరిగే ప్రమాదం ఉంది.