పూలింగ్ !
- జిల్లాలో ల్యాండ్ పూలింగ్ విఫలం
- రెండు ప్రాజెక్టుల విషయంలో రైతులకు తీవ్ర నష్టం
- సీఎం వ్యాఖ్యలతో కలకలం
- అన్నదాతల ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాజధాని వచ్చిందని సంబరపడుతున్న రైతన్నలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న ‘పూలింగ్’ విధానం కలవరపెడుతోంది. వ్యవసాయం తప్ప మరో పని తెలియని పేద రైతులు గతంలోనూ ఈ విధానం వల్ల తీవ్రంగా నష్టపోవడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు వీజీటీఎం ఉడా, విజయవాడ నగరపాలక సంస్థలో మూడు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిగా విఫలమయ్యాయి. మరోవైపు అభివృద్ధి పేరుతో పంట భూములను స్వాధీనం చేసుకుంటే ఆహర ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది.
ఏడేళ్లుగా పెండింగ్‌లో అంబాపురం ప్రాజెక్ట్
ఉడా ఆధ్వర్యాన అంబాపురం గ్రామంలో భారీ టౌన్‌షిప్ నిర్వహించాలని 2007లో నిర్ణయించారు. ఈ మేరకు పూలింగ్ పేరుతో అభివృద్ధి చేసేందుకు గ్రామంలోని రైతుల నుంచి 360 ఎకరాల భూమిని సేకరించాలని ఉడాకు అప్పట్లో చైర్మన్‌గా ఉన్న మల్లాది విష్ణు ఆధ్వర్యాన నిర్ణయించారు. ఇందుకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో తొలుత 100 ఎకరాల భూమిని సేకరించటానికి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు.
అనంతరం మరో 45 ఎకరాల సేకరణ కోసం రెండో విడత నోటిఫికేషన్ జారీచేశారు. టౌన్‌షిప్ ఏర్పాటు చేసే ప్రాంతంలో కొన్ని ప్లాట్ల మీదుగా హైటెన్షన్ విద్యుత్ తీగలు వెళ్లడంతో వాటి యజమానులు స్థలాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఈవిధంగా సుమారు 40 ఎకరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూ సేకరణను తప్పుపడుతూ కొందరు భూ యజమానులు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2009లో టౌన్‌షిప్‌ను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా వెంటనే అంబాపురం టౌన్‌షిప్‌ను రద్దు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కానీ ఇప్పటికీ టౌన్‌షిప్ రద్దు వ్యవహారం పెండింగ్‌లోనే ఉంది.
టౌన్‌షిప్‌ను రద్దు చేసే అధికారం జిల్లా కల్టెకర్‌కు గతంలోనే ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుత ఉడా పాలకవర్గ చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి టౌన్‌షిప్‌ను రద్దు చేయాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్‌కు పంపారు. ఆ ఫైల్ కూడా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉంది. దీంతో భూములు ఇచ్చిన రైతులు ఏడేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు కనీసం వ్యవసాయం కూడా చేసుకోలేక తీవ్రంగా నష్టపోయారు.
జక్కంపూడి ప్రాజెక్టు అంతే..
నగరపాలక సంస్థ అధికారులు హౌసింగ్ ప్రాజెక్టు కోసం జక్కంపూడిలో రైతుల నుంచి 229 ఎకరాలను సేకరించారు. అభివృద్ధి చేసి 60:40 పద్ధతిలో భూములను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో 133 (60 శాతం) ఎకరాల భూమిని రైతులకు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. రైతుల నుంచి 2008లో రెవెన్యూ అధికారులు భూముల్ని సేకరించారు. భూముల అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయించారు. ఇందులో రోడ్లు, డ్రెయిన్లు, రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 65 శాతం పనులు మాత్రమే చేశారు.
ఐదు ఎకరాలకు సంబంధించి కోర్టు వివాదం తలెత్తడంతో అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగిందనేది అధికారుల వాదన. కార్పొరేషన్ వాటాగా వచ్చిన 96 ఎకరాల భూముల్లో భవన నిర్మాణాలు చేపట్టారు. ఇళ్ల కేటాయింపులు చేశారు. కుంటిసాకులతో రైతుల భూముల్ని అభివృద్ధి చేయలేదు. రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇటీవలే లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించారు. రైతుల భూములు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మరో ఏడాది పట్టే అవకాశం ఉంది.
ఆహార ఉత్పత్తికి విఘాతం!
కృష్ణా, గోదావరి జిల్లాలు ఆహార ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నాయి. దేశంలో ఈ మూడు జిల్లాల నుంచి పండించే పంటలు ఒక శాతం ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ భూమి 10 లక్షల ఎకరాలు పైనే ఉంది. ఇందులో వరి 6.34 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. పత్తి 1.40 లక్షల ఎకరాల్లో, మామిడి, ఇతర పండ్లతోటలు 2లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. కొబ్బరి, చెరకు, మిర్చి, ఉసిరి, పసుపు, కూరగాయలు వంటి పంటలను రైతులు పండిస్తున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఆహార పంటల ద్వారా సంవత్సరానికి 21,46,748 టన్నులు ఉత్పత్తి జరుగుతుంది. పత్తి 1.26 లక్షల టన్నులు జిల్లాలో ఉత్పత్తి అవుతోంది. రాజధాని పేరుతో ఆహార పంటలకు స్వస్తి పలికి పారిశ్రామిక రంగం అభివృద్ధి పేరుతో ల్యాండ్ పూలింగ్ పద్ధతిని అమలులోకి తీసుకొస్తే ఆహార ఉత్పత్తులకు కొరత ఏర్పడుతుంది. భూమినే నమ్ముకుని జీవిస్తున్న రైతులు నష్టపోయే అవకాశం ఉంది.
ఒరైజా కౌంటీకి ససేమీరా..
నున్న, రామవరప్పాడు, వెదురుపావులూరు గ్రామాలను కలుపుతూ ఒరైజా కౌంటి పేరుతో అభివృద్ధి చేయాలని ఉడా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నున్న, రామవరప్పాడు గ్రామాలకు చెందిన రైతులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
రెండు విధాలా నష్టపోయాం..
మా పొలాలు 2007లో అధికారులు తీసుకున్నారు. మాకు 40 శాతం ప్రకారం ఎకరాకు 1,800 గజాలు ఇచ్చారు. అరకొరగా రోడ్లు వేశారు. అభివృద్ధి పనులు ఇంత వరకు మొదలు పెట్టలేదు. ప్రస్తుతం మా భూములు ఎకరా రూ.1.80 కోట్ల ప్రకారం అడుగుతున్నారు. సమీపంలోని పొలాలు ఎకరా రూ.ఐదు కోట్ల వరకు పలుకుతున్నాయి. వైఎస్‌ఆర్ చనిపోయిన తరువాత మా గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. భూమిని అమ్ముకునేందుకు అవకాశం లేదు. పంటలు పండించేందుకు అవకాశం లేదు. రెండు విధాలా నష్టపోయాం. ప్రస్తుతం సీఎం ఇదే పద్ధతిలో రైతుల భూములు తీసుకోవాలని ఆలోచిస్తున్నందున వ్యతిరేకత రాకుండా చూసుకోవాలనే ఇటీవల మా ప్లాట్లుకు లాటరీ తీశారు. ఇంకా స్వాధీనం చేయలేదు.
- దాసరి సాంబయ్య, రైతు, జక్కంపూడి
పిల్లల పెళ్లిళ్లు చేయలేక..
ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా అభివృద్ధి చేస్తామంటే 250 మంది రైతులం పొలాలు ఇచ్చాము. రైతులకు కేటాయించిన పొలాల్లో రూ. 27 కోట్లతో మౌళిక వసతులు కల్పిస్తామని చెప్పారు. దారీ, డొంక లేకుండా ప్లాట్లు ఉన్నాయి. మాకు సాగుభూమిగా ఉంటే పంటలు పండించుకుని బతికేవాళ్లం. ప్రభుత్వానికి భూములు ఇవ్వడం వల్ల సాగు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కనీసం పిల్లల పెళ్లిళ్లు కూడా చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇది మమ్మల్ని మానసికంగా కుంగదీసింది. ఈ పద్ధతి మంచిది కాదు. రైతుకు అన్యాయం చేయడమే.
- బడే రమణప్రసాద్, రైతు, జక్కంపూడి