మందుల ఆయువు ముందే మూడుతోంది..
కాకినాడ క్రైం :ప్రతి ఔషధానికీ ‘ఎక్స్‌పైరీ డేట్’ (అది నిరుపయోగంగా మారే తేదీ) ఉంటుంది. ఆ తేదీలోగా నే దాన్ని వాడితేనే అది పని చేస్తుంది. అయితే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంతోప్రజలకు ఉచితంగా అందాల్సిన లక్షల విలువైన మందులు ఆ తేదీతో నిమిత్తం లేకుండానే నిరుపయోగమైపోతున్నాయి. బూజు పట్టి పనికి రాకుండా పోతున్నాయి.గర్భిణుల్లో రక్తహీనత నివారణకు ప్రభుత్వం ఉచితంగా మందులిస్తోంది. దానిలో భాగంగా ఫై సల్ఫేట్ అండ్ ఫోలిక్ యాసిడ్ సిరప్ 60 మిల్లీ లీటర్ల బాటిళ్లను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు అందజేసింది. 2013 జూలైలో తయారైన ఈ మందు 2015 జూన్ వరకు పనిచేస్తుంది. దీని ధర బయటి మార్కెట్‌లో రూ. 40 పైగా ఉంటుంది.
అలాంటి సిరప్ బండిళ్లను జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలోని కారు షెడ్లో పడేశారు. ఏడాది నుంచి అవి అక్కడే ఉన్నట్టు సిబ్బంది చెబుతున్నారు. నెలల తరబడి అక్కడే ఉండడంతో వాటికి చెదలు పట్టి పాడయ్యాయి. ఒక్కోదానిలో 100 బాటిళ్ల చొప్పున ఉండే సుమారు 50 అట్టపెట్టెలకు అలా చెదలు పట్టించారు. ఆ మందుల ధర రూ.రెండు లక్షలు పైబడి ఉంటుంది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ విధంగా వ్యవహరిస్తున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని మెడికల్ స్టోర్స్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలకు మందులు సరఫరా చేస్తుంటారు. మందులు నిల్వ చేసేందుకు గోడౌన్ లేకే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోందని సిబ్బంది పేర్కొంటున్నారు. గోడౌన్ లేనంత మాత్రాన కారు షెడ్లలో, ఆరు బయట పడేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫార్మసిస్టు ఎక్కడ...?
జిల్లాలో 109 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 23 క్లస్టర్లు, 20 అర్బన్ హెల్త్ సెంటర్లు, 805 సబ్ సెంటర్లున్నాయి. వాటికి డీఎంహెచ్‌ఓ కాార్యాలయంలోని మెడికల్ స్టోర్సు నుంచి మందులు సరఫరా చేస్తుంటారు. ఇంతవరకూ ఇక్కడ ఫార్మసిస్టు పోస్టు లేకపోవడం గమనార్హం. ఫార్మసిస్టు లేకుండా మందులు విక్రయించకూడదని బయటి మందుల షాపులను హెచ్చరించే ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పరిరక్షించే వైద్య, ఆరోగ్య శాఖకు ఫార్మసిస్టును నియమించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ఫార్మసీ సూపర్‌వైజర్ పోస్టు మాత్రమే ఉంది. అది కూడా ఏడాది నుంచి ఖాళీగా ఉంది. దీంతో విరవ పీహెచ్‌సీ ఫార్మసిస్టు ఇక్కడ వారానికి మూడు రోజులు విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా స్టోర్స్‌లో మందులు నిల్వ చేసే ప్రాథమిక సిబ్బందికి లేకపోవడంతో లక్షల విలువైన మందులు వ్యర్థమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగుచర్యలు తీసుకోవాలిన ప్రజలు, వైద్య నిపుణులు కోరుతున్నారు.