ఆరోగ్య శాఖకు అవినీతి రోగం | Corruption of Health department disease | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శాఖకు అవినీతి రోగం

Published Sun, Dec 28 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

ఆరోగ్య శాఖకు అవినీతి రోగం

ఆరోగ్య శాఖకు అవినీతి రోగం

కాకినాడ క్రైం : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖను అవినీతి రోగం పట్టి పీడిస్తోంది. ఇటీవల నిర్వహించిన జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్‌ఎం) కౌన్సెలింగ్‌లో పలు అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని కోసం డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది భారీ మొత్తంలో ముడుపులు అందుకున్నారనే విమర్శలున్నాయి. ప్రతి పనికీ సొమ్ములు దండుకునే డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది విద్యార్థులను సైతం మోసగించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలోని 34 ప్రైవేటు కళాశాలల్లో సుమారు 1675 జీఎన్‌ఎం సీట్లు ఉన్నాయి. వాటిలో 60 శాతం సీట్లు ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ కోటాలో సుమారు 1005 సీట్లు కేటాయించారు. ఆ సీట్ల భర్తీకి డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తుంటారు.
 
 ఈ ఏడాది ఆయా కళాశాలల్లో ప్రవేశానికి గాను 1162 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సోషల్ వెల్ఫేర్ జేడీ, రాజమండ్రి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎంహెచ్‌ఓ కమిటీ సభ్యులుగా ఈ నెల 16, 17 తేదీల్లో వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.  ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను మాత్రం ఈ విషయంలో విద్యార్థులను మోసగించాయి. ప్రభుత్వ కోటాలో ఉచితంగా సీట్లు కేటాయించాల్సిన అభ్యర్థుల నుంచి వారు ముందుగానే సొమ్ములు దండుకున్నారు. శిక్షణ పొందాలంటే ముందుగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నమోదు కావాలని విద్యార్థులను నమ్మించారు. కౌన్సెలింగ్‌కు ఆయా ప్రైవేటు కళాశాలలు తమ వాహనాల్లోనే విద్యార్థులను కాకినాడలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి తీసుకువచ్చాయి. తమ కళాశాల పేరు చెబితే దానిని కౌన్సెలింగ్‌గా మార్చేసి మమ అనిపించారు. ఇందుకు గాను డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది ఒక్కో కళాశాల నుంచి రూ.50 వేలకు పైబడి వసూలు చేసినట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
 
 పర్యవేక్షణకు తిలోదకాలు
 ప్రైవేటు నర్సింగ్ కళాశాలలు, స్కూల్స్‌లో విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నారు. విద్యార్థులకు మాత్రం వారు కనీస వసతులు కూడా చాలా కళాశాలల్లో ఏర్పాటు చేయడం లేదు. నర్సింగ్ కళాశాలలు, స్కూల్స్‌ను డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది తరచూ పర్యవేక్షించాల్సి ఉంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత  వారిపై ఉంది. అయితే డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది మాత్రం కళాశాలల యాజమాన్యాల నుంచి ఆమ్యామ్యాలు తీసుకుని పర్యవేక్షణకు తిలోదకాలిస్తున్నారు. కనీసం వారు ఒక్క కళాశాలను కూడా తనిఖీ చేయడం లేదు. ఫలితంగా రూ.వేల ఫీజులు చెల్లించిన విద్యార్థులు సైతం అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. చదువు, ఉద్యోగం అనే తపనలో అటు తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేక సర్దుకుపోవాల్సిన పరిస్థితి దాపురించింది.
 
 అధికారులకూ ముడుపులు..?
 ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల నుంచి తీసుకున్న ముడుపుల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలోని అధికారులకు కూడా సిబ్బంది భాగం పంచుతున్నారని వైద్య వర్గాలే విమర్శిస్తున్నాయి. సిబ్బంది ఇచ్చే సొమ్ములు దండుకుంటున్న అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడంతో ప్రైవేటు కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయంటున్నారు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రైవేటు కళాశాలలను డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారులు తరచూ తనిఖీ చేసి సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆ ప్రభావం రోగులపై కూడా పడే ప్రమాదముందని అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement