యువపథం..నవ కదం
- వైఎస్సార్‌సీపీ కార్యాచరణ ప్రణాళిక
- జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుడివాడ
- త్వరలో పూర్తిస్థాయి కార్యవర్గం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ప్రజాకాంక్ష... కార్యకర్తల మనోభిష్టానికి అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. అందుకు తొలి అడుగుగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా యువనేత గుడివాడ అమర్‌నాథ్‌ను పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు.
విశాఖ నగర, గ్రామీణ జిల్లా పార్టీ బాధ్యతలను ఇక నుంచి అమర్‌నాథే నిర్వర్తిస్తారు. పార్టీ దీర్ఘకాలిక అవసరాలు... ప్రతిపక్షంగా ఉద్యమపథంలో సాగాల్సిన ఆవశ్యకత...యువతకు ప్రాధాన్యం అనే అంశాలను బేరీజువేసుకుని అమర్‌నాథ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. నవంబర్/ డిసెంబర్‌లలో జీవీఎంసీ ఎన్నికలు జరగుతాయని భావిస్తున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో తొలి అడుగుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిని నియమించారు. అదే విధంగా పూర్తిస్థాయి జిల్లా కార్యవర్గం, ఇతరత్రా సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు.
నాడు చెప్పిన విధంగానే...
ఎన్నికల ఫలితాలపై జూన్‌లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఆయన నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సమగ్రంగా తెలుసుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ సీనియర్లు, యువత మేలుకలయికగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపడతామని ప్రకటించారు. జిల్లా బాధ్యతలను యువ నాయకత్వానికి అప్పగించి సీనియర్ల సేవలను రాష్ట్రస్థాయిలో ఉపయోగించుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాటానికి కొత్త తరానికి జిల్లా నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్నది ఆయన ఉద్దేశం. పార్టీని సంస్థాగతంగా నిర్మించి విధానపరమైన నిర్ణయాలు, అమలు, సమన్వయ బాధ్యతలను సీనియర్లకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ అంశాలపై మరింత నిశితంగా సమీక్షించిన మీదట తాజాగా కార్యాచరణ చేపట్టారు. అందుకు యువకుడైన గుడివాడ అమర్‌నాథ్‌కు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
సంస్థాగత నిర్మాణం...పోరాట పథం : కీలక తరుణంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌పై గురుతర బాధ్యతే ఉంది. త్వరలో జిల్లా పార్టీ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని, అనుబంధ కమిటీలను కూడా ప్రకటిస్తారు. జిల్లాలో గ్రామ, మండల, పట్టణ కమిటీలను కూడా నియమించారు. అదే విధంగా రాష్ట్రస్థాయి పార్టీలో మరింత కీలక పదవులలో నియామకాలు చేపడతారు. వీలైనంత త్వరగా సంస్థాగత నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజాక్షేత్రంలోకి దూసుకువెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఎందుకంటే రైతు రుణమాఫీపై టీడీపీ మోసపూరిత వైఖరిపై వైఎస్సార్‌సీపీ త్వరలో ఉద్యమబాట పట్టనుంది.
ఇక ఇతర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తోంది. ఇక జీవీఎంసీ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. అందుకు ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంది. డివిజన్‌స్థాయి నుంచి కార్యకర్తలను, నేతలను సమన్వయపరచాలి. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాలి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ పార్టీ సంస్థాగత కార్యాచరణకు ఉపక్రమించడంపట్ల పార్టీ శ్రేణులు సానుకూలంగా స్పందించాయి. పోరుబాట పట్టాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేస్తున్నాయి.
పార్టీ పటిష్టతకు చిత్తశుద్ధితో కృషి: అమర్‌నాథ్
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా గుడివాడ అమర్‌నాథ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పార్టీని సమాయత్తపరుస్తామన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరుబాట పడతామని చెప్పారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన గురుతర బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. సీనియర్ల సలహాలు, సూచనల ప్రకారం అందరి సమన్వయంతో పార్టీ పటిష్టతకు చర్యలు చేపడతానని చెప్పారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.