విభజన డ్రామాలో కిరణ్ ఒక ఎపిసోడ్
నంద్యాల, : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా రాష్ట్ర విభజన కోసం సోనియాగాంధీ ఆడించిన డ్రామాలో ఒక ఎపిసోడ్ అని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు.
బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడారు. విభజన సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రిగా కిరణ్‌ను కొనసాగించడం ద్వారా అధిష్టానం లక్ష్యం నెరవేర్చుకుందన్నారు. సమైక్య రాష్ట్రం విషయంలో నాటకాన్ని ఆయన రక్తి కట్టించారన్నారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మిత్రపక్షాలుగా పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నేత మోడీ సీమాంధ్రకు మద్దతు ప్రకటిస్తుండగా.. సుష్మాస్వరాజ్, అరున్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు తెలంగాణకు మద్దతిస్తూ ద్వంద్వ నీతిని అవలంబించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాతే విభజన చేస్తామని లోక్‌సభలో బిల్లును బీజేపీ వ్యతిరేకించి ఉంటే ఆ పార్టీ విలువ రెట్టింపయ్యేదన్నారు.
చంద్రబాబు సమైక్య లేఖ ఇవ్వకుండా సీమాంధ్రను మోసగించారన్నారు. బీజేపీతో బాబు చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం కూడా విభజనకు మార్గం సుగమమం చేసిందన్నారు. ఇన్నివిధాల ద్రోహం చేసిన బాబుకు సీమాంధ్రలో పోటీ చేసేందుకు అర్హత లేదన్నారు. కాంగ్రెస్ డెరైక్షన్‌లో కిరణ్ సమైక్యవాదిగా ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తూనే విభజనకు సహకరించారన్నారు. మీడియాలో ప్రకటనలు తప్పిస్తే సమైక్య రాష్ట్ర పరిరక్షణకు ఆయన చేసిన కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే రాష్ట్ర సమైక్యతకు అలుపెరగని పోరు సాగించారని.. విభజన వాదుల దిమ్మతిరిగే సమాధానం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన కోరారు.