విభజన కోసం 3న ‘చలో హైకోర్టు’ | Division 3 for the 'Chalo High Court' | Sakshi
Sakshi News home page

విభజన కోసం 3న ‘చలో హైకోర్టు’

Published Sun, Feb 1 2015 1:55 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

విభజన కోసం 3న ‘చలో హైకోర్టు’ - Sakshi

విభజన కోసం 3న ‘చలో హైకోర్టు’

  • తెలంగాణ లాయర్ల జేఏసీ పిలుపు
  • 2 నుంచి 4 వరకు అన్ని కోర్టుల్లో విధుల బహిష్కరణకు విజ్ఞప్తి
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడంతోపాటు బార్ కౌన్సిల్‌ను విభజించాలంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఈనెల 3న (మంగళవారం) చలో హైకోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. సోమవారం (2వ తేదీ) నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో విధులను బహిష్కరించాలని కోరింది.

    3న న్యాయవాదులంతా ఉదయం 10.30 గంటల నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాంబర్ ముందు బైఠాయించి శాంతియుతంగా ధర్నా చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే వరకూ కోర్టుల్లో ఎటువంటి నియామకాలు చేపట్టరాదని ముక్తకంఠంతో నినదించింది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది.

    తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, నాంపల్లి క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.కొండారెడ్డి నేతృత్వంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో శనివారం అన్ని జిల్లాలకు చెందిన న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు (బార్ అసోసియేషన్), బార్ కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా....ఉమ్మడి హైకోర్టుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

    ప్రత్యేక హైకోర్టు, బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి విజ్ఞప్తి చేస్తారని తెలిపారు. అలాగే ప్రత్యేక హైకోర్టు, కౌన్సిల్, పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని వివరించారు. అలాగే ఏడేళ్లలోపు శిక్షలు విధించదగ్గ నేరాలు చేసిన వ్యక్తులకు పోలీస్‌స్టేషన్‌లలోనే బెయిల్ ఇచ్చేలా నేర విచారణ చట్టం (సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 41(ఎ)కు చేసిన సవరణ వల్ల పోలీసుల్లో అవినీతి పెరిగిపోయిందని ప్రతినిధులు పేర్కొన్నారు.

    ఈ సవరణను అడ్డంపెట్టుకొని పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్ల బెయిల్ మంజూరు చేసే అధికారం కోర్టులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజా సవరణలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ పోలీసులు బెయిల్‌లు మంజూరు చేయకుండా చర్యలు చేపట్టాలని డీజీపీని కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది.

    కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు ఎన్.రామచందర్‌రావు, సహోదర్‌రెడ్డి, అనంతసేన్‌రెడ్డి, సునీల్‌గౌడ్, లక్ష్మణ్‌కుమార్, జావెద్, జేఏసీ నేతలు గండ్ర మోహన్‌రావు, శ్రీరంగారావు, గోవర్దన్‌రెడ్డి, అనిల్, వై.రాములు, అనంతరఘు, నారాయణరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగత్‌పాల్‌రెడ్డి (సిటీ సివిల్ కోర్టు), విజయ్‌కుమార్ (నాంపల్లి కోర్టు), రాజిరెడ్డి (రంగారెడ్డి), గుడిమల్ల రవికుమార్ (వరంగల్), బిపిన్ పాటిల్ (ఆదిలాబాద్), ఆనంద్ (నల్లగొండ), ప్రతాప్‌రెడ్డి (మెదక్), విష్ణువర్ధన్‌రెడ్డి (సంగారెడ్డి), ఉపేందర్‌రెడ్డి (ఖమ్మం), మధుసూదన్‌రెడ్డి (కరీంనగర్) తదితరులు పాల్గొన్నారు.

    హైకోర్టును విభజించాలి జాతీయ కార్యదర్శి లక్ష్మారెడ్డి

    న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, హైకోర్టును విభజించనందున సమస్యలు తలెత్తుతున్నాయని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రత్యేక హైకోర్టు కోసం న్యాయవాదులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
     
    సీజేఐతో మళ్లీ మాట్లాడతా: సీఎం కేసీఆర్

    సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టును వీలైనంత త్వరగా విభజించి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేసే విషయంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ)ను కోరానని, ఈ ప్రక్రియ వేగవంతానికి మరోమారు మాట్లాడతానని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం సచివాలయంలో తనను కలిసిన తెలంగాణ న్యాయవాదుల సంఘం ప్రతినిధులకు సీఎం ఈ మేరకు హామీ ఇచ్చారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, 3న ఇందిరాపార్కులో సభ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని వారీ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement