Chalo High Court
-
లాయర్ల చలో హైకోర్టు ఉద్రిక్తం
జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్న న్యాయవాదులు బృందాలుగా హైకోర్టు వద్దకు వెళ్లేందుకు యత్నం భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడంతో ఉద్రిక్తత న్యాయవాదుల నిరసన.. మదీనా వద్ద రోడ్డుపై బైఠాయింపు అటు హైకోర్టులోనూ బైఠాయించిన న్యాయవాదులు వందల మంది న్యాయవాదుల అరెస్టు.. పోలీస్స్టేషన్లకు తరలింపు ఆందోళన ఉధృతం చేస్తామని న్యాయవాద సంఘాల ప్రకటన నేటి నుంచి రోజుకో రూపంలో నిరసన ప్రదర్శనలు జూలై 1 నుంచి సమ్మె చేస్తామని న్యాయశాఖ ఉద్యోగుల నోటీసు సాక్షి, హైదరాబాద్: కింది స్థాయి న్యాయవ్యవస్థలో న్యాయాధికారులను విభజిస్తూ చేసిన ప్రాథమిక కేటాయింపులపై నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన చలో హైకోర్టు ఉద్రిక్తంగా మారింది. న్యాయవాదుల ముట్టడిని అడ్డుకునేందుకు హైకోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. హైకోర్టు వైపు వెళ్లే రహదారులపై ఆంక్షలు అమలు చేశారు. హైకోర్టు వద్దకు బృందాలుగా వస్తున్న వందలాది మంది న్యాయవాదులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. హైకోర్టు వద్దకు చేరుకున్నవారిని గేటు వద్దే నిలిపేసి అరెస్టులు చేశారు. దీంతో న్యాయవాదులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అప్పటికే హైకోర్టులోకి వెళ్లిన న్యాయవాదులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలు వద్ద బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల హై అలర్ట్! సోమవారం న్యాయవాదులు చేపట్టిన నిరసనలు, చలో హైకోర్టు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. హైకోర్టుకు వెళ్లే ప్రధానదారుల వద్ద ఆంక్షలు అమలు చేశారు. ఇటు మదీనా వద్ద, అటు సిటీ కాలేజీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఉద్యోగులను, కేసుల జాబి తాలో పేర్లున్న న్యాయవాదులను, స్వయంగా కేసులను వాదించుకునే కక్షిదారులను మాత్ర మే హైకోర్టులోకి వెళ్లేందుకు అనుమతించారు. హైకోర్టు వద్దకు బృందాలుగా వస్తున్న పలువురు లాయర్లను మదీనా వద్ద వద్దే నిలిపేశారు. దాంతో న్యాయవాదులంతా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి ఫలక్‌నుమా, కంచన్‌బాగ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. హైకోర్టులోనూ నిరసనలు.. కోర్టు పనివేళలు ప్రారంభం కావడానికి ముం దే పలువురు న్యాయవాదులు కోర్టు ప్రవేశమార్గాల వద్దకు వచ్చి విధుల బహిష్కరణకు సహకరించాలని ఆంధ్రా న్యాయవాదులను కోరా రు. ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) సహా మిగతా న్యాయమూర్తులంతా యథావిధిగా కేసుల విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ న్యాయవాదులు కోర్టు హాలులోకి వచ్చి తాము విధుల బహిష్కరణకు పిలుపునిచ్చామని, కేసుల విచారణకు హాజరుకాని న్యాయవాదుల కేసులను కొట్టివేయవద్దని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇదే తరహాలో మిగతా న్యాయమూర్తుల కోర్టులకు వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయవాదులను కోరారు. న్యాయవాద జేఏసీ నేతలతో చర్చలు వివిధ జిల్లాల నుంచి హైకోర్టుకు వస్తున్న న్యాయవాదులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఏసీజే కోర్టు హాలు ముందు బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవాదులను విడిచిపెడతామని పోలీసులు హామీ ఇవ్వడంతో అక్కడ నిరసన విరమించారు. కానీ హైకోర్టు గేటు వద్దకు చేరుకుంటున్న న్యాయవాదుల సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనిపై ఆగ్రహించిన న్యాయవాదులు ఈసారి ఏసీజే చాంబర్ ముందు బైఠాయించారు. దీంతో ఏసీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ రామసుబ్రమణ్యన్, జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లు న్యాయవాదుల జేఏసీ నాయకులు గండ్ర మోహనరావు, రాజేందర్‌రెడ్డి, సత్యంరెడ్డి, రఘునాథ్ తదితరులతో చర్చలు జరిపారు. ఈ చర్చల గురించి నిర్దిష్ట సమాచారం బయటకు రాలేదు. మరోవైపు చలో హైకోర్టు కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల పరిధిలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. పోలీసులు అరెస్టు చేసిన న్యాయవాదులను సాయంత్రం విడిచిపెట్టారు. జూలై 1 నుంచి సమ్మె: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను ఉప సంహరించుకోవాలని, లేకపోతే జూలై 1 నుంచి తెలంగాణవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో సమ్మెకు దిగుతామని న్యాయశాఖ ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు న్యాయ శాఖ ఉద్యోగులు సోమవారం హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) డి.నాగార్జునకు సమ్మె నోటీసు అందచేశారు. ఆందోళనలు ఉధృతం చేస్తాం న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను వెనక్కి తీసుకునే వరకూ ఆందోళన కొనసాగించాలని న్యాయవాదుల సంఘాలు నిర్ణయించాయి. తెలంగాణవ్యాప్తంగా కోర్టు విధుల బహిష్కరణను శనివారం వరకూ కొనసాగించాలని తీర్మానించాయి. చలో హైకోర్టు కార్యక్రమం అనంతరం పది జిల్లాల న్యాయవాద సంఘాలు, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం సమావేశమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకో రూపంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 14న కోర్టు ఆవరణల్లో టెంట్లు వేసి సామూహిక నిరాహార దీక్షలు, 15న మౌన ప్రదర్శనలు, 16న వంటావార్పు, 17న తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన న్యాయాధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆంధ్రాకు వెళ్లాలని కోరుతూ పోస్టుకార్డులు పంపనున్నారు. తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు ఈ వారాంతంలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇక వారంలో ఒక రోజు హైకోర్టు విధులను బహిష్కరిస్తామని, న్యాయవాదులకు సంఘీభావంగా రోజుకో జిల్లాకు వెళ్లి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు తెలిపారు. -
తెలంగాణ న్యాయవాదుల ఛలో హైకోర్టు
హైదరాబాద్ : హైకోర్టును విభజించడం, ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్లతో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ పిలుపు మేరకు లాయర్లు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సోమవారం ఛలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. దీంతో కోర్టు దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. కాగా హైకోర్టుకు తరలి వస్తున్న న్యాయవాదులను పోలీసులు మదీనా చౌరస్తా దగ్గరే అడ్డుకున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ కోర్టులో కేసులు ఉన్నటువంటి న్యాయవాదులను మాత్రమే లోనికి అనుమతి ఇస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు లోపలికి చేరుకున్నారు. విధులను అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. -
‘చలో హైకోర్టు’కు అనుమతి లేదు: సీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ సోమవారం నిర్వహించనున్న ‘చలో హైకోర్టు’ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడంపై నిషేధం ఉందన్నారు. నిషేధాజ్ఞలు అతిక్రమించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాల ప్రకారం ప్రాక్టిసింగ్ అడ్వకేట్లకు అనుమతిస్తామని తెలిపారు. చలో హైకోర్టు కార్యక్రమ నేపథ్యంలో అదనపు బందోబస్తు, ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
విభజన కోసం 3న ‘చలో హైకోర్టు’
తెలంగాణ లాయర్ల జేఏసీ పిలుపు 2 నుంచి 4 వరకు అన్ని కోర్టుల్లో విధుల బహిష్కరణకు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడంతోపాటు బార్ కౌన్సిల్‌ను విభజించాలంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఈనెల 3న (మంగళవారం) చలో హైకోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. సోమవారం (2వ తేదీ) నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో విధులను బహిష్కరించాలని కోరింది. 3న న్యాయవాదులంతా ఉదయం 10.30 గంటల నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాంబర్ ముందు బైఠాయించి శాంతియుతంగా ధర్నా చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే వరకూ కోర్టుల్లో ఎటువంటి నియామకాలు చేపట్టరాదని ముక్తకంఠంతో నినదించింది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, నాంపల్లి క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.కొండారెడ్డి నేతృత్వంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో శనివారం అన్ని జిల్లాలకు చెందిన న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు (బార్ అసోసియేషన్), బార్ కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా....ఉమ్మడి హైకోర్టుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హైకోర్టు, బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి విజ్ఞప్తి చేస్తారని తెలిపారు. అలాగే ప్రత్యేక హైకోర్టు, కౌన్సిల్, పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని వివరించారు. అలాగే ఏడేళ్లలోపు శిక్షలు విధించదగ్గ నేరాలు చేసిన వ్యక్తులకు పోలీస్స్టేషన్లలోనే బెయిల్ ఇచ్చేలా నేర విచారణ చట్టం (సీఆర్పీసీ)లోని సెక్షన్ 41(ఎ)కు చేసిన సవరణ వల్ల పోలీసుల్లో అవినీతి పెరిగిపోయిందని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సవరణను అడ్డంపెట్టుకొని పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్ల బెయిల్ మంజూరు చేసే అధికారం కోర్టులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజా సవరణలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ పోలీసులు బెయిల్లు మంజూరు చేయకుండా చర్యలు చేపట్టాలని డీజీపీని కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు ఎన్.రామచందర్‌రావు, సహోదర్‌రెడ్డి, అనంతసేన్‌రెడ్డి, సునీల్‌గౌడ్, లక్ష్మణ్‌కుమార్, జావెద్, జేఏసీ నేతలు గండ్ర మోహన్‌రావు, శ్రీరంగారావు, గోవర్దన్‌రెడ్డి, అనిల్, వై.రాములు, అనంతరఘు, నారాయణరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగత్పాల్రెడ్డి (సిటీ సివిల్ కోర్టు), విజయ్‌కుమార్ (నాంపల్లి కోర్టు), రాజిరెడ్డి (రంగారెడ్డి), గుడిమల్ల రవికుమార్ (వరంగల్), బిపిన్ పాటిల్ (ఆదిలాబాద్), ఆనంద్ (నల్లగొండ), ప్రతాప్‌రెడ్డి (మెదక్), విష్ణువర్ధన్‌రెడ్డి (సంగారెడ్డి), ఉపేందర్‌రెడ్డి (ఖమ్మం), మధుసూదన్‌రెడ్డి (కరీంనగర్) తదితరులు పాల్గొన్నారు. హైకోర్టును విభజించాలి జాతీయ కార్యదర్శి లక్ష్మారెడ్డి న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, హైకోర్టును విభజించనందున సమస్యలు తలెత్తుతున్నాయని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రత్యేక హైకోర్టు కోసం న్యాయవాదులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సీజేఐతో మళ్లీ మాట్లాడతా: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టును వీలైనంత త్వరగా విభజించి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేసే విషయంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ)ను కోరానని, ఈ ప్రక్రియ వేగవంతానికి మరోమారు మాట్లాడతానని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం సచివాలయంలో తనను కలిసిన తెలంగాణ న్యాయవాదుల సంఘం ప్రతినిధులకు సీఎం ఈ మేరకు హామీ ఇచ్చారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, 3న ఇందిరాపార్కులో సభ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని వారీ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. -
హైకోర్టు రణరంగం: సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ లాయర్ల దాడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు రణరంగమైంది. న్యాయదేవత సాక్షిగా, పోలీసుల సాక్షిగా సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేశారు. ఈ దాడిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏడుగురు న్యాయవాదులు గాయపడగా, వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా శుక్రవారం సీమాంధ్ర న్యాయవాదులు చేపట్టిన ‘మానవహారం’.. శాంతిర్యాలీకి అనుమతి నిరాకరణకు నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ‘చలో హైకోర్టు’ కార్యక్రమాలతో హైకోర్టు అట్టుడికింది. ఈ క్రమంలోనే మానవహారానికి సిద్ధమైన సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు న్యాయవాదులు (హైకోర్టుకు చెందిన వారు కాదు) చేయిచేసుకున్నారు. దీంతో హైకోర్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదంతా పోలీసుల సమక్షంలోనే చోటు చేసుకుంది. దాడికి దిగిన న్యాయవాదుల్లో ఐదుగురిని పోలీసులు ఆ తరువాత అరెస్ట్ చేశారు. అలాగే సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్, సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డితో సహా 25 మందికిపైగా సీమాంధ్ర న్యాయవాదులను అదుపులోకి తీసుకుని సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఏం జరిగిందంటే... రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలకు కొనసాగింపుగా హైకోర్టులోని సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం మధ్యాహ్నం సిటీ కాలేజీ నుంచి మదీనా వరకు మానవహారం నిర్వహించాలని నాలుగురోజుల కిందట నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ న్యాయవాదులు గురువారమే హైకోర్టు నుంచి మదీనా వరకు ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా తమ శాంతిర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించడానికి నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చలో హైకోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా రంగారెడ్డి, నాంపల్లి కోర్టులతోపాటు జంట నగరాల్లో వివిధ కోర్టులకు చెందిన తెలంగాణ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో శుక్రవారం ఉదయం హైకోర్టుకు చేరుకున్నారు. ముందుగానే ఇరుపక్షాల కార్యక్రమాలపై సమాచారం ఉండటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. మదీనా చౌరస్తా, సిటీ కాలేజీలతో పాటు హైకోర్టు పరిసర ప్రాంతాలు పోలీసులతో నిండిపోయాయి. ముందు నిర్ణయించుకున్న మేరకు సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు మానవహారం కార్యక్రమం నిర్వహించేందుకు బార్ కౌన్సిల్ గేటు వద్దకు చేరుకున్నారు. మాజీ అడ్వొకేట్ జనరల్ మోహన్‌రెడ్డితో పాటు దాదాపు 40 మంది సీమాంధ్ర న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అప్పటికే అక్కడకు తెలంగాణ న్యాయవాదులు వచ్చి ఉన్నారు. మోహన్‌రెడ్డితో పాటు ఓ 30 మంది న్యాయవాదులు గేటు దాటి రోడ్డుపైకి వెళ్లగా, బార్ కౌన్సిల్ వద్ద ఉన్న మిగిలిన న్యాయవాదులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న తెలంగాణ న్యాయవాదులు ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. గేటు బయట ఉన్న మోహన్‌రెడ్డి తదితరులు ఉన్న చోటికి తెలంగాణ న్యాయవాదులు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన పోలీసులు వెంటనే గేటు మూసివేసి, మోహన్‌రెడ్డి తదితరులను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో మానవహారంలో పాల్గొనడానికి వచ్చిన కొంతమంది సీమాంధ్ర న్యాయవాదులు గేటు లోపల కోర్టు ప్రాంగణంలోనే బార్ కౌన్సిల్ వద్దే ఉండిపోయారు. వారు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బయటినుంచి వచ్చిన న్యాయవాదులు అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారిపై దాడి చేశారు. దాడి.. దూషణలు... సీమాంధ్ర న్యాయవాదులు శ్రీనివాస్, బాలాజీ, విష్ణు తదితరులపై తెలంగాణ న్యాయవాదులు చేయి చేసుకున్నారు. అయ్యప్పదీక్షలో ఉన్న న్యాయవాదుల సంఘం మాజీ కార్యదర్శి జి.ఎల్.నాగేశ్వరరావును కూడా వదిలిపెట్టలేదు. మానవహారంలో పాల్గొనడానికి వచ్చిన మహిళా న్యాయవాదులను సైతం చుట్టుముట్టి, రాయడానికి వీల్లేని భాషలో దూషించారు. ఈ ఘటనను సెల్ఫోన్లో ఫోటోలు తీసిన వారిని చితకబాదారు. సెల్ఫోన్లో ఫోటోలు తీసేసేవరకు వారిని వదల్లేదు. చివరకు హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న తెలంగాణ ప్రాంత న్యాయవాదులు వచ్చి పలుమార్లు సర్దిచెప్పడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం ‘జై తెలంగాణ’ నినాదాలతో హైకోర్టు కారిడార్లలో ప్రదర్శనలు నిర్వహించారు. ఆ తరువాత భోజన విరామ సమయంలో హైకోర్టు న్యాయవాదుల క్యాంటీన్‌కు చేరుకుని అక్కడ భోజనం చేస్తున్న వెంకటేశ్వరరావు అనే న్యాయవాదిపై దాడి చేశారు. అక్కడే గిన్నెల్లో ఉన్న సాంబార్ పోసి, చితకబాదగా ఆయన పళ్లు కదిలిపోయాయి. దీంతో ఆయనను ప్రాథమిక చికిత్స కోసం హైకోర్టులోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు హైకోర్టులో దాడుల వ్యవహారంలో పోలీసుల తీరుపై మహిళా న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి చెప్పడంతో అప్పటికప్పుడు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మను సమను చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే కమిషనర్ వెళ్లి ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. మహిళా న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులకు పంపి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలా..? వద్దా..? అన్న విషయంపై ప్రధాన న్యాయమూర్తి మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. అరెస్ట్ చేసిన న్యాయవాదులందరినీ పోలీసులు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విడుదల చేశారు. పోలీసుల ప్రేక్షకపాత్ర హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులు దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పాటించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ హైకోర్టులో ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల పోటాపోటీ ప్రదర్శనల నేపథ్యంలో శుక్రవారం దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు ముందే హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసులు ఘర్షణలను, దాడులను నిరోధించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మానవహారం జరిగేముందే ఇరుపక్షాలతో మాట్లాడి వారి వారి కార్యక్రమాల సమయాన్ని మార్చడం, వేదికలను కుదించడం వంటి చర్యలేవీ పోలీసులు చేపట్టలేదు. ఇద్దరు ముగ్గురిపై దాడులు జరిగిన తరువాత పోలీసులు రంగప్రవేశం చేసి కొట్టవద్దని బ్రతిమలాడటం కనిపించింది.