లాయర్ల చలో హైకోర్టు ఉద్రిక్తం | tension prevails as lawyers march for chalo high court, | Sakshi
Sakshi News home page

లాయర్ల చలో హైకోర్టు ఉద్రిక్తం

Published Tue, Jun 14 2016 2:02 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

లాయర్ల చలో హైకోర్టు ఉద్రిక్తం - Sakshi

లాయర్ల చలో హైకోర్టు ఉద్రిక్తం

  • జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్న న్యాయవాదులు
  •       బృందాలుగా హైకోర్టు వద్దకు వెళ్లేందుకు యత్నం
  •       భారీగా మోహరించిన పోలీసులు
  •       బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడంతో ఉద్రిక్తత
  •       న్యాయవాదుల నిరసన..
  •       మదీనా వద్ద రోడ్డుపై బైఠాయింపు
  •       అటు హైకోర్టులోనూ బైఠాయించిన న్యాయవాదులు
  •       వందల మంది న్యాయవాదుల అరెస్టు.. పోలీస్‌స్టేషన్లకు తరలింపు
  •       ఆందోళన ఉధృతం చేస్తామని న్యాయవాద సంఘాల ప్రకటన
  •       నేటి నుంచి రోజుకో రూపంలో నిరసన ప్రదర్శనలు
  •       జూలై 1 నుంచి సమ్మె చేస్తామని న్యాయశాఖ ఉద్యోగుల నోటీసు
  •  

     సాక్షి, హైదరాబాద్:  కింది స్థాయి న్యాయవ్యవస్థలో న్యాయాధికారులను విభజిస్తూ చేసిన ప్రాథమిక కేటాయింపులపై నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన చలో హైకోర్టు ఉద్రిక్తంగా మారింది. న్యాయవాదుల ముట్టడిని అడ్డుకునేందుకు హైకోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. హైకోర్టు వైపు వెళ్లే రహదారులపై ఆంక్షలు అమలు చేశారు. హైకోర్టు వద్దకు బృందాలుగా వస్తున్న వందలాది మంది న్యాయవాదులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. హైకోర్టు వద్దకు చేరుకున్నవారిని గేటు వద్దే నిలిపేసి అరెస్టులు చేశారు. దీంతో న్యాయవాదులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అప్పటికే హైకోర్టులోకి వెళ్లిన న్యాయవాదులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలు వద్ద బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.



    పోలీసుల హై అలర్ట్!

    సోమవారం న్యాయవాదులు చేపట్టిన నిరసనలు, చలో హైకోర్టు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. హైకోర్టుకు వెళ్లే ప్రధానదారుల వద్ద ఆంక్షలు అమలు చేశారు. ఇటు మదీనా వద్ద, అటు సిటీ కాలేజీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఉద్యోగులను, కేసుల జాబి తాలో పేర్లున్న న్యాయవాదులను, స్వయంగా కేసులను వాదించుకునే కక్షిదారులను మాత్ర మే హైకోర్టులోకి వెళ్లేందుకు అనుమతించారు. హైకోర్టు వద్దకు బృందాలుగా వస్తున్న పలువురు లాయర్లను మదీనా వద్ద వద్దే నిలిపేశారు. దాంతో న్యాయవాదులంతా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి ఫలక్‌నుమా, కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

     హైకోర్టులోనూ నిరసనలు..
    కోర్టు పనివేళలు ప్రారంభం కావడానికి ముం దే పలువురు న్యాయవాదులు కోర్టు ప్రవేశమార్గాల వద్దకు వచ్చి విధుల బహిష్కరణకు సహకరించాలని ఆంధ్రా న్యాయవాదులను కోరా రు. ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) సహా మిగతా న్యాయమూర్తులంతా యథావిధిగా కేసుల విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ న్యాయవాదులు కోర్టు హాలులోకి వచ్చి తాము విధుల బహిష్కరణకు పిలుపునిచ్చామని, కేసుల విచారణకు హాజరుకాని న్యాయవాదుల కేసులను కొట్టివేయవద్దని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇదే తరహాలో మిగతా న్యాయమూర్తుల కోర్టులకు వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయవాదులను కోరారు.

     న్యాయవాద జేఏసీ నేతలతో చర్చలు
    వివిధ జిల్లాల నుంచి హైకోర్టుకు వస్తున్న న్యాయవాదులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఏసీజే కోర్టు హాలు ముందు బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవాదులను విడిచిపెడతామని పోలీసులు హామీ ఇవ్వడంతో అక్కడ నిరసన విరమించారు. కానీ హైకోర్టు గేటు వద్దకు చేరుకుంటున్న న్యాయవాదుల సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనిపై ఆగ్రహించిన న్యాయవాదులు ఈసారి ఏసీజే చాంబర్ ముందు బైఠాయించారు. దీంతో ఏసీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ రామసుబ్రమణ్యన్, జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లు న్యాయవాదుల జేఏసీ నాయకులు గండ్ర మోహనరావు, రాజేందర్‌రెడ్డి, సత్యంరెడ్డి, రఘునాథ్ తదితరులతో చర్చలు జరిపారు. ఈ చర్చల గురించి నిర్దిష్ట సమాచారం బయటకు రాలేదు. మరోవైపు చలో హైకోర్టు కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల పరిధిలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. పోలీసులు అరెస్టు చేసిన న్యాయవాదులను సాయంత్రం విడిచిపెట్టారు.

     జూలై 1 నుంచి సమ్మె: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను ఉప సంహరించుకోవాలని, లేకపోతే జూలై 1 నుంచి తెలంగాణవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో సమ్మెకు దిగుతామని న్యాయశాఖ ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు న్యాయ శాఖ ఉద్యోగులు సోమవారం హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) డి.నాగార్జునకు సమ్మె నోటీసు అందచేశారు.

     

    ఆందోళనలు ఉధృతం చేస్తాం
    న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులను వెనక్కి తీసుకునే వరకూ ఆందోళన కొనసాగించాలని న్యాయవాదుల సంఘాలు నిర్ణయించాయి. తెలంగాణవ్యాప్తంగా కోర్టు విధుల బహిష్కరణను శనివారం వరకూ కొనసాగించాలని తీర్మానించాయి. చలో హైకోర్టు కార్యక్రమం అనంతరం పది జిల్లాల న్యాయవాద సంఘాలు, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం సమావేశమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకో రూపంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 14న కోర్టు ఆవరణల్లో టెంట్లు వేసి సామూహిక నిరాహార దీక్షలు, 15న మౌన ప్రదర్శనలు, 16న వంటావార్పు, 17న తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన న్యాయాధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆంధ్రాకు వెళ్లాలని కోరుతూ పోస్టుకార్డులు పంపనున్నారు. తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు ఈ వారాంతంలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇక వారంలో ఒక రోజు హైకోర్టు విధులను బహిష్కరిస్తామని, న్యాయవాదులకు సంఘీభావంగా రోజుకో జిల్లాకు వెళ్లి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement