హైకోర్టు రణరంగం: సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ లాయర్ల దాడి | Telangana Lawyers attack on Seemandhra Lawyer | Sakshi
Sakshi News home page

హైకోర్టు రణరంగం: సీమాంధ్ర న్యాయవాదులపై టి.లాయర్ల దాడి

Published Sat, Sep 7 2013 2:27 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

హైకోర్టు రణరంగం: సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ లాయర్ల దాడి - Sakshi

హైకోర్టు రణరంగం: సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ లాయర్ల దాడి

సాక్షి, హైదరాబాద్: 
రాష్ట్ర హైకోర్టు రణరంగమైంది. న్యాయదేవత సాక్షిగా, పోలీసుల సాక్షిగా సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేశారు. ఈ దాడిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏడుగురు న్యాయవాదులు గాయపడగా, వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా శుక్రవారం సీమాంధ్ర న్యాయవాదులు చేపట్టిన ‘మానవహారం’.. శాంతిర్యాలీకి అనుమతి నిరాకరణకు నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ‘చలో హైకోర్టు’ కార్యక్రమాలతో హైకోర్టు అట్టుడికింది. ఈ క్రమంలోనే మానవహారానికి సిద్ధమైన సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు న్యాయవాదులు (హైకోర్టుకు చెందిన వారు కాదు) చేయిచేసుకున్నారు. దీంతో హైకోర్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదంతా పోలీసుల సమక్షంలోనే చోటు చేసుకుంది. దాడికి దిగిన న్యాయవాదుల్లో ఐదుగురిని పోలీసులు ఆ తరువాత అరెస్ట్ చేశారు. అలాగే సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్, సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డితో సహా 25 మందికిపైగా సీమాంధ్ర న్యాయవాదులను అదుపులోకి తీసుకుని సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
 
 ఏం జరిగిందంటే...
 రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలకు కొనసాగింపుగా హైకోర్టులోని సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం మధ్యాహ్నం సిటీ కాలేజీ నుంచి మదీనా వరకు మానవహారం నిర్వహించాలని నాలుగురోజుల కిందట నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ న్యాయవాదులు గురువారమే హైకోర్టు నుంచి మదీనా వరకు ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా తమ శాంతిర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించడానికి నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చలో హైకోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా రంగారెడ్డి, నాంపల్లి కోర్టులతోపాటు జంట నగరాల్లో వివిధ కోర్టులకు చెందిన తెలంగాణ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో శుక్రవారం ఉదయం హైకోర్టుకు చేరుకున్నారు. ముందుగానే ఇరుపక్షాల కార్యక్రమాలపై సమాచారం ఉండటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. మదీనా చౌరస్తా, సిటీ కాలేజీలతో పాటు హైకోర్టు పరిసర ప్రాంతాలు పోలీసులతో నిండిపోయాయి. ముందు నిర్ణయించుకున్న మేరకు సీమాంధ్ర న్యాయవాదులు శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు మానవహారం కార్యక్రమం నిర్వహించేందుకు బార్ కౌన్సిల్ గేటు వద్దకు చేరుకున్నారు. 
 
 మాజీ అడ్వొకేట్ జనరల్ మోహన్‌రెడ్డితో పాటు దాదాపు 40 మంది సీమాంధ్ర న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అప్పటికే అక్కడకు తెలంగాణ న్యాయవాదులు వచ్చి ఉన్నారు. మోహన్‌రెడ్డితో పాటు ఓ 30 మంది న్యాయవాదులు గేటు దాటి రోడ్డుపైకి వెళ్లగా, బార్ కౌన్సిల్ వద్ద ఉన్న మిగిలిన న్యాయవాదులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న తెలంగాణ న్యాయవాదులు ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. గేటు బయట ఉన్న మోహన్‌రెడ్డి తదితరులు ఉన్న చోటికి తెలంగాణ న్యాయవాదులు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన పోలీసులు వెంటనే గేటు మూసివేసి, మోహన్‌రెడ్డి తదితరులను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో మానవహారంలో పాల్గొనడానికి వచ్చిన కొంతమంది సీమాంధ్ర న్యాయవాదులు గేటు లోపల కోర్టు ప్రాంగణంలోనే బార్ కౌన్సిల్ వద్దే ఉండిపోయారు. వారు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బయటినుంచి వచ్చిన న్యాయవాదులు అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారిపై దాడి చేశారు. 
 
 దాడి.. దూషణలు...
 సీమాంధ్ర న్యాయవాదులు శ్రీనివాస్, బాలాజీ, విష్ణు తదితరులపై తెలంగాణ న్యాయవాదులు చేయి చేసుకున్నారు. అయ్యప్పదీక్షలో ఉన్న న్యాయవాదుల సంఘం మాజీ కార్యదర్శి జి.ఎల్.నాగేశ్వరరావును కూడా వదిలిపెట్టలేదు. మానవహారంలో పాల్గొనడానికి వచ్చిన మహిళా న్యాయవాదులను సైతం చుట్టుముట్టి, రాయడానికి వీల్లేని భాషలో దూషించారు. ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసిన వారిని చితకబాదారు. సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసేసేవరకు వారిని వదల్లేదు. చివరకు హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న తెలంగాణ ప్రాంత న్యాయవాదులు వచ్చి పలుమార్లు సర్దిచెప్పడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం ‘జై తెలంగాణ’ నినాదాలతో హైకోర్టు కారిడార్లలో ప్రదర్శనలు నిర్వహించారు. ఆ తరువాత భోజన విరామ సమయంలో హైకోర్టు న్యాయవాదుల క్యాంటీన్‌కు చేరుకుని అక్కడ భోజనం చేస్తున్న వెంకటేశ్వరరావు అనే న్యాయవాదిపై దాడి చేశారు.  అక్కడే గిన్నెల్లో ఉన్న సాంబార్ పోసి, చితకబాదగా ఆయన పళ్లు కదిలిపోయాయి. దీంతో ఆయనను ప్రాథమిక చికిత్స కోసం హైకోర్టులోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
 
 ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు 
 హైకోర్టులో దాడుల వ్యవహారంలో పోలీసుల తీరుపై మహిళా న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి చెప్పడంతో అప్పటికప్పుడు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మను సమను చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే కమిషనర్ వెళ్లి ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. మహిళా న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులకు పంపి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలా..? వద్దా..? అన్న విషయంపై ప్రధాన న్యాయమూర్తి మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. అరెస్ట్ చేసిన న్యాయవాదులందరినీ పోలీసులు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విడుదల చేశారు.  
 
 పోలీసుల ప్రేక్షకపాత్ర
 హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులు దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పాటించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ హైకోర్టులో ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల పోటాపోటీ ప్రదర్శనల నేపథ్యంలో శుక్రవారం దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు ముందే హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసులు ఘర్షణలను, దాడులను నిరోధించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మానవహారం జరిగేముందే ఇరుపక్షాలతో మాట్లాడి వారి వారి కార్యక్రమాల సమయాన్ని మార్చడం, వేదికలను కుదించడం వంటి చర్యలేవీ పోలీసులు చేపట్టలేదు. ఇద్దరు ముగ్గురిపై దాడులు జరిగిన తరువాత పోలీసులు రంగప్రవేశం చేసి కొట్టవద్దని బ్రతిమలాడటం కనిపించింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement