సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో బుధవారం కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. సీమాంధ్ర న్యాయవాదులు మానవహారాన్ని అడ్డుకునేందుకు రంగారెడ్డి, మేడ్చల్ కోర్టుల తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వీరిని హైకోర్టు గేటు దగ్గరే పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం విడుదల చేశారు. విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర న్యాయవాదులు బుధవారం హైకోర్టు బయట మానవహారం నిర్వహించాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న రంగారెడ్డి, మేడ్చల్ కోర్టులకు చెందిన తెలంగాణ న్యాయవాదులు చలో హైకోర్టు కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు నెలకుండా మదీనా సెంటర్ నుంచి హైకోర్టు వరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు ఉన్నవారినే కోర్టులోకి అనుమతించారు. అయితే మధ్యాహ్నం సమయంలో తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు కోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో వారిని కోర్టు బయటే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, తెలంగాణ న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ న్యాయవాదుల అరెస్ట్‌పై న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదుల బృందం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ సేన్‌గుప్తాను కలిసింది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరింది. దీంతో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఇదే సమయంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు తెలంగాణ న్యాయవాదుల విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలివ్వడంతో పోలీసులు వారిని విడుదల చేశారు.
మానవహారం వాయిదా..
సీమాంధ్ర న్యాయవాదులు బుధవారం తలపెట్టిన మానవహారం కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. హైకోర్టులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేయడంతో మానవహారాన్ని వాయిదా వేస్తున్నట్లు సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ సీవీ మోహన్‌రెడ్డి ప్రకటించారు. అంతకు ముందు మోహన్‌రెడ్డితో ప్రధాన న్యాయమూర్తి చర్చలు జరిపారు. ప్రస్తుతం హైకోర్టులో పరిస్థితులు సరిగా లేవని, మానవహారం కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని , లేకుంటే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని మోహన్‌రెడ్డికి ప్రధాన న్యాయమూర్తి సూచించినట్లు సమాచారం. దీంతో మోహన్‌రెడ్డి ఇతర సీమాంధ్ర న్యాయవాదులతో చర్చించి ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తిని అగౌరవపరచడం మం చిది కాదన్న ఉద్దేశంతో, మానవ హా రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
హైకోర్టులో టెన్షన్
Published Thu, Sep 12 2013 1:08 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement