హైకోర్టు వద్ద టెన్షన్ వాతావరణం
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటన అంశం హైకోర్టును దద్దరిల్లేలా చేస్తోంది. విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర న్యాయవాదులు, దానిని అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదుల పోటాపోటీ నిరసనలతో హైకోర్టు పరిసరాలు బుధవారం అట్టుడుకుతున్నాయి. ఓ వైపు సీమాంధ్ర న్యాయవాదుల మానవ హారం, మరోవైపు తెలంగాణ న్యాయవాదులు ర్యాలీ చేపట్టేందుకు సన్నద్దం అవుతుండటంతో హైకోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైకోర్టు 6,7 గేట్ల వద్ద పోలీసులు పహరా కాస్తున్నారు.
కాగా నిరసనలు, ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అడిషనల్ సీపీ అంజన్ కుమార్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హైకోర్టు లోపల, వెలుపల ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని ఆయన స్ఫష్టం చేశారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కార్యక్రమాలు చేపడితే అరెస్ట్లు తప్పవని హెచ్చరించారు.
ఈ నేపధ్యంలో ఛలో హైకోర్టు అంటూ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధం అవుతున్న తెలంగాణ ప్రాంత న్యాయవాదులు పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.