
న్యాయవాదుల మధ్య ఘర్షణ, హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ - సీమాంధ్ర ప్రాంత న్యాయవాదుల పరస్పర ఘర్షణ - హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ అడ్వకేట్ జనరల్ సి.వి.మోహన్ రెడ్డి సహా అనేక మంది న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా అందరిని వ్యానులో ఎక్కించి దూరం తీసుకెళ్లారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లాయర్లు హైకోర్టు ప్రాంగణంలో నిర్మిస్తున్న మానవహారాన్ని తెలంగాణ ప్రాంత న్యాయవాదులు అడ్డుకున్నారు.
చిన్నగా మొదలైన ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. నచ్చజెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైయ్యాయి. హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని... ఎవరూ ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని మైకుల్లో పోలీసులు పదే పదే ప్రకటించినా ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కసారిగా రెండు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు గుమికూడటంతో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో పోలీసులు మోహరించి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.