హైదరాబాద్ : హైకోర్టును విభజించడం, ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్లతో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ పిలుపు మేరకు లాయర్లు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో సోమవారం ఛలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. దీంతో కోర్టు దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు.
కాగా హైకోర్టుకు తరలి వస్తున్న న్యాయవాదులను పోలీసులు మదీనా చౌరస్తా దగ్గరే అడ్డుకున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ కోర్టులో కేసులు ఉన్నటువంటి న్యాయవాదులను మాత్రమే లోనికి అనుమతి ఇస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు లోపలికి చేరుకున్నారు. విధులను అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు.