విడాకుల పిటిషన్పై హైకోర్టు ఉత్తర్వును కొట్టేసిన సుప్రీం | Divorce plea transfer: Supreme Court sets aside Andhra Pradesh High Court order | Sakshi
Sakshi News home page

విడాకుల పిటిషన్పై హైకోర్టు ఉత్తర్వును కొట్టేసిన సుప్రీం

Published Tue, Aug 20 2013 1:04 PM | Last Updated on Fri, Sep 28 2018 4:32 PM

Divorce plea transfer: Supreme Court sets aside Andhra Pradesh High Court order

విడాకుల పిటిషన్ విచారణను బదిలీ చేసే విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.  మహిళకు ఆర్థిక స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన విడాకుల పిటిషన్ విచారణను ఆమెకు సమీపంలో ఉండే కోర్టుకు బదలాయించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చక్కర్లేదని తెలిపింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు అన్యాయం, తెలివితక్కువదంటూ జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన మహిళ, తన భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్ విచారణను కాకినాడలోని ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేయాలని కోరారు. కానీ, ఆమె ఓ ప్రైవేటు సంస్థలో కంపెనీ సెక్రటరీగా పనిచేస్తున్నారని, తన తల్లిదండ్రుల మీద ఆధారపడిన నిరాధార మహిళ కాదని, అందువల్ల పిటిషన్ విచారణను బదిలీ చేయాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది.

అయితే, ఈ విషయంలో హైకోర్టు వైఖరిని సుప్రీం తీవ్రంగా తప్పుబట్టింది. భర్త విడాకుల పిటిషన్ దాఖలు చేయడమే కాక, తాను కోరుకున్న చోటే విచారణ జరిగేలా, అక్కడికే ఆమె వచ్చేలా చేసుకుంటున్నారని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఆ మహిళ ఉద్యోగం చేస్తూ సంపాదించుకుంటున్నందు వల్ల కాకినాడ నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేయగలదన్న కారణంతోనే హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తిరస్కరించడం తగదని, ఈ తీర్పు వల్ల కలిగే ప్రభావాలను సింగిల్ జడ్జి పూర్తిగా విస్మరించారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణను కాకినాడ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement