దివాకర్ నాయుడుకు యావజ్జీవం | Diwakar Naidu sentenced to life term | Sakshi
Sakshi News home page

దివాకర్ నాయుడుకు యావజ్జీవం

Published Tue, Jan 13 2015 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

దివాకర్ నాయుడుకు యావజ్జీవం

దివాకర్ నాయుడుకు యావజ్జీవం

ఆదోని: ఫ్యాక్షనిస్టు, తెలుగుదేశం నాయకుడు, మాజీ జెడ్పీటీసీ కప్పట్రాల వెంకటప్ప నాయుడు హత్య కేసులో 4వ నిందితుడిగా ఉన్న కప్పట్రాల సర్పంచ్ మాదాపురం దివాకర్ నాయుడుకు యావజ్జీవ శిక్ష, రూ.మూడు వేలు జరిమానా విదిస్తూ ఆదోని రెండో జిల్లా అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుబ్రమణ్యం సోమవారం తీర్పు వెల్లడించారు. కోర్టులో జడ్జ్ తీర్పును వెల్లడిస్తుండగా బయట తీవ్ర ఉద్రిక్తత కనిపించింది.

పత్తికొండ సీఐ గంట సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు సిబ్బంది కోర్టు వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. దివాకర్ నాయుడు తల్లి రాములమ్మ, బంధువులు పెద్దఎత్తున కోర్టు వద్దకు తరలివచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో జడ్జి తీర్పు వెల్లడించగానే బోనులో ఉన్న దివాకర్‌నాయుడు ముఖంలో ఆవేదన కనిపించింది. బయట ఉన్న తల్లి రాములమ్మ గుండెలు బాదుకుంటూ విలపించింది. తీర్పు పూర్తి కాగానే దివాకర్ నాయుడును భారీ బందోబస్తు మధ్య పోలీసులు స్థానిక సబ్ జైలుకు తరలించారు. ఈ తీర్పుతో వెంకటప్పనాయుడు హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన వారి సంఖ్య 18కి చేరింది.
 
ఘటన..కేసు: 2008 మే 17న  దేవనకొండ మండలం మాచాపురం బస్సు స్టాపు వద్ద కప్పట్రాల వెంకటప్ప నాయుడుతో సహా మొత్తం 10 మంది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి దేవనకొండ పోలీసులు మొత్తం 48 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో కాంగ్రెస్ ముఖ్య నాయకులు చెరుకులపాడు నారాయణ రెడ్డి, చక్రపాణి రెడ్డి కూడా ఉన్నారు. దాదాపు ఆరేళ్లపాటు కోర్టులో విచారణ కొనసాగింది. విచారణ కొనసాగుతుండగానే నలుగురు నిందితులు మృతి చెందారు.

కోర్టులో నేరం రుజువు కావడంతో మొత్తం నిందితులలో 17 మందికి గత నెల 10వ తేదీన యావజ్జీవ శిక్ష విధిస్తూ ఆదోని జిల్లా రెండో అదనపు సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి సుబ్రమణ్యం తీర్పు చెప్పారు. తీర్పు రోజు దివాకర్ నాయుడు కోర్టుకు హాజరు కాలేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన దివాకర్‌నాయుడుపై తీర్పును న్యాయమూర్తి వాయిదా వేశారు. కాంగ్రెస్ ప్రముఖులు చెరుకులపాడు నారాయణ రెడ్డి, చక్రపాణి రెడ్డితో సహా మొత్తం 26 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
 
మగ దిక్కును కోల్పోయిన దివాకర్ కుటుంబం
ఫ్యాక్షన్ భూతం దివాకర్ నాయుడు కుటుంబంలో మగ దిక్కు లేకుండా చేసింది. దివాకర్‌నాయుడు తండ్రి రంగప్పనాయుడు గతంలో ఫ్యాక్షన్‌లో ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కప్పట్రాళ్ల హత్య కేసులో శిక్ష పడిన మొత్తం 18 మందిలో ముగ్గురు దివాకర్ నాయుడు సోదరులే. వారు మద్దిలేటి నాయుడు, యోగేష్ నాయుడు, పురుషోత్తమ నాయుడు. వీరు ఇప్పటికే సెంట్రల్ జైలుకు వెళ్లగా సోమవారం తీర్పుతో దివాకర్ నాయుడు కూడా ఇంటికి దూరం అయ్యాడు. మద్దిలేటి నాయుడు, పురుషోత్తమ నాయుడుకు మాత్రం పెళ్లిళ్లు అయ్యాయి.
 
ఎలా బతికేది?:
భర్త రంగప్ప నాయుడు ఫ్యాక్షన్‌కు బలి కావడం, నలుగురు కొడుకులు జైలు పాలు కావడంతో తల్లి రాములమ్మ కన్నీళ్ల పర్యంతమైంది. ఇద్దరు కోడళ్లతో తాను ఎలా బతుకాలంటూ బోరున విలపించింది. తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రత్యేర్థులు తమ పొలంలో ఉన్న వ్యవసాయ పంపింగ్ మోటారును ఎత్తుకు వెళ్లారని, ఇంటి వద్ద ఉన్న ట్రాక్టరును కాల్చి వేశారని, ఇక తమను బతకనిస్తారన్న నమ్మకం లేదని గుండెలవిసేలా రోదించారు. వెంకటప్పనాయుడు హత్య కేసుతో తన కొడుకులకు సంబంధం లేదని, రాజకీయాల వల్ల జైలుకెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. న్యాయం కోసం తాను హైకోర్టుకు వెళుతానని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement