బెయిల్ స్కాం!
⇒ నిందితులకు నకిలీ ష్యూరిటీ పత్రాలు జారీచేసే గ్యాంగ్ గుట్టురట్టు
⇒ మూడు రాష్ట్రాల్లోని కోర్టులను బురిడీ కొట్టించిన వైనం
⇒ జిల్లాలో పదిమంది దాకా ఏజెంట్లు
⇒ కీలక సూత్రధారి అనంతపురం జిల్లా వాసి
⇒ పోలీసుల అదుపులో పలువురు నిందితులు
నిప్పులాంటి చట్టంతోనే చెలగాటమాడుతూ నకిలీ జామీను పత్రాలు సృష్టించి మూడు రాష్ట్రాల్లోని కోర్టులను బురిడీ కొట్టించే ముఠా గుట్టురట్టయింది. ఎంచక్కా ఐదేళ్లుగా సాగిన ఈ వ్యాపారం ఎస్పీ చొరవతో బట్టబయలైంది. ఇందులో జిల్లాకు చెందిన పదిమంది దాకా ఏజెంట్లు.. మరికొందరు న్యాయవాదులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని అతిత్వరలో అరెస్ట్ చేసేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది.
పలమనేరు: మూడు రాష్ట్రాల కోర్టులను తప్పుదోవ పట్టించి నిందితులను నకిలీ జామీను పత్రాల ద్వారా విడుదల చేయించే ఓ భారీ గ్యాంగ్ ముఠా గుట్టురట్టయ్యింది. దీనివెనుక జిల్లావాసుల హస్తమున్నట్టు సమాచారం. వీరిని రేపోమాపో అరెస్ట్ చేసేందుకు ఎస్పీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
సంఘటన ఇలా వెలుగులోకి..
గతంలో గంగవరం సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చోరీ జరిగింది. దీనికి సంబంధించిన నిందితులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత నిందితులు కోర్టు ద్వారా బెయిల్ పొందారు. ఆపై కోర్టుకు హాజరు కాలేదు. దీంతో వారిపై వారెంట్లు జారీ అయ్యాయి. ఈ ముఠా గతంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. వారెంట్ జారీ అయిన నిందితులను పట్టుకొనే క్రమంలో పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు చిక్కాయి. నిందితులు కోర్టుకు సమర్పించిన జామీను పత్రాల్లో చాలా వరకు ఉద్యోగుల సాలరీ సర్టిఫికెట్లు ఉడడంతో వాటి ఆధారంగా ఆ ఉద్యోగులను విచారించారు. కానీ వారు తమకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. దీంతో జామీను పత్రాలు నకిలీవని గుర్తించారు.
కీలక సూత్రధారి అనంతపురం వాసే
అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కోర్టులో బెయిల్ పొందేందుకు అవసరమైన అన్ని రకాల జామీపత్రాలను నకిలీవి సృష్టించి ఇవ్వడంలో సిద్ధహస్తుడు. ఇతని ఏజెంట్లు జిల్లాతో పాటు కడప, అనంతపురంలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కోర్టుల్లో నిందితులకు అవసరమైన నకిలీ పత్రాలను అందజేస్తూ ఇప్పటిదాకా రూ.30 లక్షల దాకా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఇతని వద్ద వందల సంఖ్యలో నకిలీ సీళ్లు, ధ్రువపత్రాలకు కావాల్సిన టెక్నాలజీ ఉన్నట్లు సమాచారం. ఐదేళ్లుగా సదరు వ్యక్తి ఇదే వ్యాపారంలో మునిగితేలినట్టు స్పష్టమవుతోంది.
పోలీసుల అదుపులో పలువురు ఏజెంట్లు
నకిలీ జామీను పత్రాల స్కామ్‌కు సంబంధించి తిరుపతి, చిత్తూరు ప్రాంతాలకు చెందిన పలువురు ఏజెంట్ల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా జిల్లాలోని పలు కోర్టుల్లో 70 కేసులకు నకిలీ సర్టిఫికెట్లను అందజేసి బెయిల్ పొందినట్లు సమాచారం. వీరి ద్వారా మరింతమంది ముఖ్య వ్యక్తులు, పలువురు న్యాయవాదుల పేర్లు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బురిడీ
అంతర్రాష్ట్ర ముఠాలు, హిట్‌అండ్న్ ్రకేసులు, ఎక్సైజ్ స్మగ్లర్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులకు ఈ ముఠా బెయిల్ మంజూరు చేయించేందుకు నకిలీ సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలోని మూడు జిల్లాలతో పాటు కర్ణాటకలోని కోలార్, బెంగళూరు, తమిళనాడులోని కృష్ణగిరి, వేలూరు తదితర కోర్టుల్లోనూ ఈ గ్యాంగ్ నకిలీ పత్రాలను ఇచ్చి నిందితులకు బెయిల్ వచ్చేలా చేసినట్లు సమాచారం.
‘ఎర్ర’బెయిళ్లపై ఆరా
కొన్నాళ్లుగా జిల్లాలో వందలాది మందిపై ఎర్రచందనం అక్రమరవాణా కేసులు నమోదయ్యాయి. పలువురు కోర్టులకు సమర్పించిన బెయిల్‌పత్రాలు అసలైనవా లేక నకిలీవా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఒకవేల ఈ కేసుల బెయిళ్లలోనూ ఇలాగే జరిగిఉంటే ఇంకెంతమంది ఇరుక్కుంటారో..!
ఎస్పీ చొరవతో గుట్టురట్టు
న్యాయ వ్యవస్థనే తప్పుదోవ పట్టించిన ఈ కుంభకోణం వెనుక ఉన్న ముఠాను పట్టుకోవడంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవచూపినట్లు తెలిసింది. ఆయన ఆదేశాలతో గంగవరం పోలీసులు ఓ ప్రత్యేక బృందంగా ఏర్పడి వారం రోజులుగా పలు ప్రాంతాల్లో ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపో, మాపో జిల్లా ఎస్పీ నిందితులను అరెస్ట్ చేసి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.