మహబూబ్‌నగర్ కల్చరల్:దీపావళి పండుగను ఆనందంగా జరుపుకునేం దుకు ప్రజలు అంతా సిద్ధం చేసుకున్నారు. ఉద్యోగం, ఉపాధికోసం పట్టణాలకు వలస వెళ్లిన వారు సైతం సొంతూళ్లకు చేరుకున్నారు. దీంతో పల్లెలన్నీ బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. పండుగ కొనుగోళ్లతో కిరాణ, బట్టల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆనందంగా కాల్చే టపాసులు అమ్మేందుకు ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. అయితే, ఈ సారి టపాసుల ధరలు భారీగా పెరగడంతో వాటిని కొనేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మూడు రోజుల పండుగ...
దీపావళిని కొన్ని ప్రాంతాల్లో మూడురోజుల పాటు నిర్వహిస్తారు. అందులో భాగంగా త్రయోదశి నాటి రాత్రి ‘అపమృత్యు’ నివారణ కోసం దీపాలు వెలిగిస్తారు. తర్వాత రోజైన నరక చతుర్దశి రోజు ‘అలక్ష్మీ’ పరిహారానికై శరీరానికి నూనె రా సుకుని అభ్యంగన స్నానం చేస్తా రు. కొందరు ఇదే రోజు పితృ తర్పణాలు కూడా విడుస్తారు. దీపావళి నాడు దేవతా మూర్తులకు అర్చనలు నిర్వహించి పంచభక్ష్య పరమాన్నాలు, పిండివంటలు సమర్పిస్తారు. దీపావళి రోజు లక్ష్మీ పూజ, కేదారేశ్వర గౌరీ నోములు నిర్వహిస్తారు. వ్యాపారులు లక్ష్మీపూజను ఘనంగా నిర్వహిస్తారు.
పెరిగిన టపాసుల ధరలు
ఈ యేడాది టపాసుల ధరలు సామాన్యుడికి అందుబాటలో లేకుండా పోయాయి. బాణాసంచా తయారీకి వాడే భాస్వరం, గంధకం వంటి పదార్థాల ధరలు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ సారి 40శాతం దాకా ధరలు పెరిగాయి. తమిళనాడు ప్రభుత్వం బాణాసంచా తయారీ కేంద్రాలపై నిబంధనలు పటిష్టంగా అమలు చేయడంతో ఉత్పత్తి తగ్గిందని చెబుతున్నారు.
టౌన్‌హాలు, బాయ్స్
కాలేజ్ గ్రౌండ్‌లలో...
జిల్లా యంత్రాంగం నుంచి అనుమతులు ఆలస్యంగా లభించడంతో ఈ సారి మహబూబ్‌నగర్ పట్టణంలో బాణాసంచా వ్యాపారం ఆలస్యంగా ప్రారంభ మైంది. గతంలో వారం, పది రోజుల ముందుగానే టపాసుల వ్యాపారాలు మొదలయ్యేవి. స్థానిక మున్సిపల్ టౌన్‌హాలు ఆవరణలో, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంతోపాటు న్యూటౌన్ ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించటానికి మున్సిపల్ అధికారులు అనుమతినిచ్చారు. మొత్తం దాదాపు 40వరకు తాత్కాలిక విక్రయ కేంద్రాలు నెలకొల్పనున్నట్లు పట్టణ బాణాసంచా వ్యాపారుల సంఘం సభ్యులు తెలిపారు.
వెలుగు జిలుగుల దీపావళి
Published Thu, Oct 23 2014 3:49 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement