సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెండ్రోజుల క్రితం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల బృందం కీసర మండలం నాగారంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని సందర్శించింది. అక్కడ లోపాలను గుర్తించిన ఆ బృందం సభ్యులు.. ఆస్పత్రి సిబ్బందిపై చిందులేశారు. ఆస్పత్రి గుర్తింపు గడువు ముగి యడం.. మిషన్ల రెన్యూవల్ గడువు కూడా పూర్తి కావడంతో హడావుడి చేశారు. వసూళ్ల పర్వానికి తెరలేపారు. చివరకు ఉద్యోగ సంఘం నేత ఒకరు రంగప్రవేశం చేయడంతో సీన్ కాస్త రివర్సయ్యింది.
ఇలా వసూలు చేసి.. అలా వెనక్కి ఇచ్చి
ప్రైవేటు ఆస్పత్రిని సందర్శించిన అధికారుల బృందం గుర్తింపు గడువు ముగిసిం దని తేల్చింది. అదేవిధంగా ఆస్పత్రిలోని స్కానింగ్ మిషన్లకు సైతం రెన్యూవల్ చేయించలేదని నిర్ధారణకు వచ్చింది. దీంతో మిషన్లు సీజ్ చేస్తామంటూ హడావుడి చేయడంతో ఆస్పత్రి సిబ్బం ది ఈ విషయాన్ని ఆస్పత్రి ఎండీ (మేనేజింగ్ డెరైక్టర్)కు వివరించారు. కొంత మొత్తాన్ని అధికారులకు ఇవ్వాలంటూ ఆయన ఆదేశించడంతో.. ఆ మొత్తాన్ని అధికారికి ముట్టజెప్పారు. దాంతో అధికారుల బృందం అక్కడ్నుంచి జారుకుంది. ఆస్పత్రి ఎండీ వెంటనే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడికి ఫోనులో చెప్పడం.. ఆయన నేరుగా తనిఖీ బృందంపై ఆగ్రహించడంతో సీను కాస్త రివర్సయ్యింది. వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చేయాలని తనిఖీ బృందం నిర్ణయించి.. సమీపంలో ఉన్న పీహెచ్‌సీలోని హెల్త్ అసిస్టెంట్‌తో ఆ మొత్తాన్ని తిరిగి ఆస్పత్రికి పంపించారు. అయితే అందు లో రూ.500 తగ్గించి ఇవ్వడం కొసమెరుపు. ఇలాంటి సీన్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు కొత్తేమీ కాదు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలపై రోజూ తనిఖీల పేరుతో దాడులు చేయడం, ఆ తర్వాత వసూళ్లకు దిగడం సాధారణమైంది. తనిఖీ బృందంలో అధికారులు కాకుండా సంబంధంలేని కార్యాలయ క్లరికల్ సిబ్బంది పాల్గొనడం గమనార్హం. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, జిల్లా యంత్రాంగం సైతం దృష్టి సారించకపోవడంతో ఈ వ్యవహారం సాఫీగా సాగుతోంది.
నివేదికలకు మంగళం
వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 684 స్కానింగ్ కేంద్రాలున్నాయి. హైదరాబాద్ నగరానికి చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, అత్యాధునిక వసతులున్న ఆస్పత్రులన్నీ శివారు మండలాల్లో ఉండడంతో జిల్లాలో అత్యధికంగా స్కానింగ్ కేంద్రాలున్నాయి. అయితే వీటిలో చాలావరకు అనుమతి లేకుండానే కొనసాగుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. అయితే ప్రతి స్కానింగ్ కేంద్రంలో నిర్వహించే స్కానింగ్, గర్భిణులకు చేపట్టే పరీక్షలకు సంబంధించి వివరాలను క్రమం తప్పకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు నివేదిక రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఈ తంతు మచ్చుకు కూడా కన్పించదు. మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వివరాలు ఇస్తున్నారంటూ అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లా కార్యాలయానికి మాత్రం ఇప్పటివరకు నివేదికలు రాలేదని డీఎంహెచ్‌ఓ సుధాకర్ నాయుడు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
నిద్రపోతున్న తనిఖీ బృందం!
లింగనిర్ధారణ నిరోదక చట్టం (పీఎన్‌డీటీ) అమలు జిల్లాలో అటకెక్కింది. సాధారణంగా ఈ చట్టం అమలులో భాగంగా ఎప్పటికప్పుడు స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. అదే విధంగా ప్రత్యేక అధికారులతో కూడిన తనిఖీ బృందంతో డెకాయ్ ఆపరేషన్ చేయాలి. అయితే జిల్లాలో ఈ డెకాయ్ ఆపరేషన్లు చేపట్టిన దాఖలాలు లేవు. పనిఒత్తిడి నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించే తీరికలేదంటూ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమర్థించుకుంటున్నారు.
నాకు సంబంధం లేదు
నేను రెండ్రోజుల క్రితం కీసరలోని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు సందర్శించి పరిశీలించిన మాట వాస్తవమే. అయితే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వ్యాక్సిన్ల నిల్వ, ఇతర అంశాలపై తనిఖీ చేశా. జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తున్నా. కానీ ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ల్యాబ్ సిబ్బంది నుంచి డబ్బులు తీసుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు సరికావు. నేను సీమాంధ్రవాడిని కావడంతో కొందరు గిట్టని వాళ్లు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు.
- సుధాకర్ నాయుడు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి
తనిఖీల లోగుట్టు!
Published Sat, Dec 21 2013 12:15 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement