రైతులంటే చులకనా..?
సింహాద్రిపురం : వాతావరణ బీమా ప్రీమియం, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు గడువు విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని రైతులు మండిపడ్డారు.
సింహాద్రిపురం : వాతావరణ బీమా ప్రీమియం, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు గడువు విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని రైతులు మండిపడ్డారు. ఈనెల 15వ తేదీవరకు గడువు ఉందని చెప్పి.. ఇప్పుడు శనివారంతో గడువు ముగిసిందని చెప్పడం ఎంతవరకు సబబు అని రైతులు ధ్వజమెత్తారు. సింహాద్రిపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అధికారులు శుక్రవారం మండలంలోని బ్యాంకు పరిధిలోని రైతులకు సెల్ ద్వారా రుణాలు రెన్యువల్ చేసుకోమంటూ మెసేజ్‌లు పంపారు. శుక్రవారం కొందరు రైతులు మాత్రమే వచ్చారు. శనివారం వందల సంఖ్యలో రైతులు బ్యాంకుకు తరలి వచ్చారు. దీంతో బ్యాంకు అధికారులు తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏటా ప్రకృతి వైపరీత్యాలవల్ల పంట పండకపోయినా బీమా ఉంటుందన్న దీమాతో వ్యవసాయాన్ని నెట్టుకొస్తున్నామన్నారు. ఇప్పుడు ఆ బీమా లేకుండా చేస్తే తామెలా బతకాలి.. రైతులంటే ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. దీంతో ఎస్‌ఐ రాజేశ్వరరెడ్డి ఫోన్ ద్వారా ఆర్‌ఎంతో చర్చించారు. శనివారం బ్యాంకుకుకు వచ్చిన రైతులందరికి రాత్రి పొద్దుపోయేవరకు రుణాలు రెన్యువల్ పూర్తి చేసేలా ఒప్పించారు. దీంతో రైతులు శాంతించారు.