ఉల్లి..లొల్లి
కర్నూలు నుంచి దిగుమతులు రాని వైనం
10 రెతు బజార్లలో స్టాక్ నిల్ దిగిరాని ఉల్లి ధరలు
విజయవాడ : ఉల్లిపాయల కొరత మరింత తీవ్రమైంది. మహారాష్ట్ర నుంచి సరుకు రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా కర్నూల్ జిల్లా నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి కూడా రెండు రోజు లుగా దిగుమతులు స్తంభించాయి. కర్నూలు నుంచి సరుకు దిగుమతి తగ్గడంతో రైతు బజార్లలో సబ్సిడీ ధరకు ఇస్తున్న ఉల్లిపాయల స్టాల్స్‌లో కూడా నిండుకున్నాయి. జిల్లాలో 17 రైతు బజార్లలో ఏడింటిలో సోమవారం వరకు మాత్రమే ఉల్లిపాయల స్టాక్ ఉంది. రెండు రోజులుగా నగరంలోని సింగ్‌నగర్, పటమట, భవానీపురంతో పాటు జిల్లాలో జగ్గయ్యపేట, నూజివీడు తదితర 10 రైతు బజార్లకు ఉల్లిపాయల స్టాక్ వె ళ్లలేదు. ఆయా రైతు బజార్లలో ఉల్లి సబ్సిడీ అమ్మకాలు నిలిచిపోయాయి.
కొసరికొసరి సరఫరా
శుక్రవారం నుంచి కర్నూల్ జిల్లా నుంచి దిగుమతి అయ్యే లారీల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెపుతున్నారు. పైనుంచి స్టాక్ రాకపోవడంతో రైతు బజార్లలో ఉల్లిపాయల కౌంటర్లలో కొసరికొసరి సరఫరా చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి కర్నూల్ జిల్లా నుంచి సరుకు వస్తుందని మార్కెటింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక వేళ ఉల్లిపాయలు దిగుమతి కాకపోతే సోమవారం సాయంత్రం నుంచి జిల్లాలోని అన్ని రైతు బజార్లలో స్టాక్ ఉండే పరిస్థితి కనపడడం లేదు. ప్రత్నామ్నాయంగా దిగుమతి చేసుకునేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి. ప్రస్తుతం కొన్ని రైతు బజార్లలో అరకొరగా కేజి రూ. 20కి కర్నూల్ ఉల్లి సరఫరా చేస్తున్నారు.
లోకల్ సరుకు నిల్
నూతన రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం నుంచి ప్రతి ఏటా ఈ సీజన్‌లో ఉల్లిపాయలు దిగుమతి అయ్యేవి. అయితే నేటి వరకు గుంటూరు జిల్లా నుంచి లోకల్‌గా సరుకు రాకపోవడంతో కృష్ణాజిల్లాలో ఉల్లిపాయల కొరత ఇతర జిల్లాల కంటే జటిలంగా మారిందని వ్యాపారులు, అధికారులు చెపుతున్నారు.
బయటి మార్కెట్‌లో కేజీ రూ. 50పైనే
ప్రస్తుతం బయట మార్కెట్‌లో కేజి రూ. 50పైనే ఉంది. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు రెండు రకాలుగా విక్రయిస్తున్నారు. కర్నూల్ ఉల్లిని కేజీ రూ. 35కు, మహారాష్ట్ర ఉల్లిని రూ. 50కి పైనే విక్రయిస్తున్నారు. రానున్న కొన్ని రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెపుతున్నారు. ప్రతీ ఏటా ఈ సీజన్‌లో మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు నిలిచిపోగానే కర్నూల్ నుంచి వచ్చేవి.