
తుపాన్ల సమయంలో రాజకీయాలా?
సీఎంపై చంద్రబాబు ధ్వజం
‘హెలెన్’ బాధిత ప్రాంతాల్లో పర్యటన
సాక్షి, రాజమండ్రి, కాకినాడ: రాష్ట్రాన్ని తుపాన్లు కుదిపేస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం రచ్చబండ రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. హెలెన్ తుపాను బాధిత ప్రాంతాలలో పర్యటించేందుకు సోమవారం తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన చంద్రబాబు రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి కూడా వర్షాల వల్ల వాటిల్లిన నష్టం, కావాల్సిన సహాయంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వలేక పోయిందని చంద్రబాబు విమర్శించారు. తుపాను నష్టం రూ.1630 కోట్లని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, నష్టం అంతకు రెట్టింపు ఉంటుందన్నారు. వరికి ఎకరాకు రూ.10 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ. 20 వేలు, మత్స్యకారులకు రూ.20 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.5 వేలు పరిహారంగా ఇవ్వాలని, తుపాను మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు వాటిల్లిన పంటనష్టాన్ని పూర్తిగా చెల్లించాలని, కుటుంబానికి 50 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కి రోసిన్ తక్షణ సహాయంగా అంద చేయాలని కోరారు. తుపాను బాధిత ప్రాంతాల పర్యటనను కోనసీమలోని కొత్తపేట మండలం నుంచి చంద్రబాబు ప్రారంభించారు. రాకుర్తివారిపాలెం, సీహెచ్ గన్నేపల్లి, పల్లాం, చెయ్యేరు అగ్రహారం తదితర గ్రామాల్లో పర్యటించి, అరటి, కొబ్బరి, వరి రైతులను పరామర్శించారు. కురుక్షేత్ర యుద్ధంలాంటి ఎన్నికలు మరో నాలుగు నెలల్లో రానున్నాయని, ఆ తరువాత అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. చెయ్యేరు అగ్రహారంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శిస్తూ రెండు కుటుంబాలకు రెండువేల రూపాయల చొప్పున అందించారు.
రాజ్యాంగ విరుద్ధంగా విభజిస్తే ఊరుకోం..
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఈ ప్రక్రియరాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల వారితో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా, సమన్యాయాన్ని పాటిస్తూ విభజన జరగాలని ముందు నుంచీ తమ పార్టీ స్పష్టంగా చెబుతోందన్నారు. ఆర్టికల్ 3కి సవరణలు చేయడం ద్వారా రాష్ట్ర విభజన జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. విభజన ప్రక్రియ అంతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా డెరైక్షన్‌లో సాగుతోందని విమర్శించారు.