
ఓటమి భయంతో టీడీపీ నేతలు దౌర్జన్య ప్రచారానికి దిగజారారు. ఇప్పటికే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రభుత్వం పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. అంతకు ముందు నెల వరకు వెయ్యి రూపాయలే ఇస్తున్న పింఛన్‌ను రెండు వేలకు పెంచిన ప్రభుత్వం తాజాగా ఎన్నికల తేదీ దగ్గర పడే సమయంలో పింఛనర్లను భయభ్రాంతులకు గురి చేసింది. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామంటేనే పింఛన్ ఇస్తామంటూ బెదిరింపులకు దిగారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు చేరి వారి సమక్షంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రాజకీయ పార్టీల నేతలను దూరంగా ఉంచాల్సిన పంచాయతీ కార్యదర్శులు మౌన పాత్ర వహించారు. కొన్ని చోట్ల టీడీపీ నేతలే స్వయంగా పింఛన్లు పంపిణీ చేయడం కూడా కనిపించింది. పింఛన్ తీసుకునేందుకు ప్రతి లబ్ధిదారులతో ప్రమాణాలు చేయించిన ఘటనలు కూడా జరిగినట్లు చెబుతున్నారు.
నెల్లూరు(పొగతోట): ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో అధికార పార్టీ యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 46 మండల్లాలోని 940 పంచాయతీలు, నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో 261 డివిజన్లు, వార్డుల్లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ స్థానికంగా రాజకీయ పెత్తనం చేస్తున్న టీడీపీ నేతలు, మాజీ సర్పంచ్‌లు, జన్మభూమి సభ్యులు పింఛన్ల పంపిణీ కేంద్రాల్లో చేరి, లబ్ధిదారులకు తమ చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సమయంలో ఇంకో పది రోజుల్లో జరిగే ఎన్నికల్లో మీకు రూ.2 వేల పింఛన్ ఇస్తున్న చంద్రబాబు టీడీపీకి ఓటు వేయ్యాలని పింఛన్ల లబ్ధిదారులపై ఒత్తిడి చేశారు.
ఎవరు ఓటు వేయలేదో మాకు తెలిసిపోతుందని బెదిరింపులకు పాల్పడ్డారు. మాకు ఇష్టమొచ్చిన పార్టీకే ఓటేస్తామన్న కొందరు లబ్ధిదారులపై టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లు తీసుకుని ఎందుకు ఓటేయ్యరంటూ దురుసుగా ప్రవర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పింఛన్ల పంపిణీని పంచాయతీ కార్యదర్శులే చేపట్టాల్సి ఉండగా అందుకు భిన్నంగా టీడీపీ నేతలు పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పంచాయతీ కార్యదర్శులు సైతం వీరి దౌర్జన్యకర ప్రచారాన్ని కూడా అడ్డుకోకుండా టీడీపీ నేతలు చెప్పినట్లు ఓటేస్తేనే మీకు మళ్లీ పింఛన్లు ఇస్తారంటూ బెదిరించారని లబ్ధిదారులు బయటకు వాపోయారు.
3.15 లక్షల పింఛన్లు
జిల్లాలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతకా ర్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు తదితర పింఛన్లు 3.15 లక్షలు ఉన్నాయి. సోమవారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలల ముందు వరకు పింఛన్లు 5వ తేదీపై నుంచి పంపిణీ చేసేవారు. ఎన్నికలు రావడంతో పింఛనర్లను ప్రలోభ పెట్టేందుకు 1వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో టీడీపీ నేతలు పింఛన్ తీసుకున్న లబ్ధిదారులకు టీడీపీ కరపత్రం ఇచ్చి చంద్రబాబునాయుడు పింఛన్లు రెండు వేలు చేశాడు. ఓటర్ల జాబితా చూడడం మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి తప్పకుండా చంద్రబాబుకే వేయాలని హుకుం జారీ చేశారు. కావలి, ఉదయగిరి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో లభ్ధిదారులను అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేశారు. టీడీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు.
ఐదేళ్లుగా వెయ్యి రూపాయలే..
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా పింఛన్‌ను రూ.75లే ఇచ్చేది. అదీ ప్రతి ఆరు నెలలకొకసారి, పరిమిత సంఖ్యలో ఇస్తుండేది. వీరి కష్టాలు గుర్తించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి కాగానే పింఛన్ ఏకంగా రూ.200లకు పెంచారు. ప్రతి నెలా 1వ తేదీ లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు ఇచ్చే విధంగా అమలు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఇతర సీఎంలు కొనసాగించారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వస్తే వృద్ధులు, వింతవులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్లు ఇస్తానని ప్రకటించారు. ఇదే హామీని కాపీ కొట్టిన చంద్రబాబు తాను అంతే మొత్తంలో ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించారు. రాష్ట్రంలో పరిస్థితులను గమనించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అర్హత కలిగిన ప్రతి పేదకు రూ.2 వేలు పింఛన్ ఇస్తానని 2017 జూలై 8న జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ప్రకటించారు.
అయితే వెయ్యి రూపాయలే ఇస్తూ వచ్చిన చంద్రబాబు ఎన్నికలు దగ్గర పడడంతో వైఎస్ జగన్ హామీతో ఓటర్లు మారిపోతారని మరో సారి జగన్ హామీని కాపీ కొట్టి జనవరిలో పేదల పింఛన్ మొత్తాన్ని రూ.2వేలకు పెంచుతున్న ప్రకటించారు. రెండు నెలలుగా పెంచిన రూ.2 వేల పింఛన్ ఇస్తూ ఎప్పటి నుంచో ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ లబ్ధిదారులను ఉద్దరించినట్లు ప్రచారం చేసుకోవడంపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే రూ.3 వేలు ఇస్తారులే చెబుతుండడంతో టీడీపీ వారిని బెదిరించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment