
1987లో నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్‌బెన్ జోషి ఎదుట బోస్ మ్యాజిక్ ప్రదర్శన, భీమవరంలో కళ్లకు గంతలతో స్కూటర్ నడుపతున్న బోస్ (ఫైల్)
భీమవరం: ఇంద్రజాలంలో రాణిస్తూ.. అంతర్జాతీయస్థాయి కీర్తిని సొంతం చేసుకున్నారు డాక్టర్ బోస్. ఆయన పూర్తిపేరు దంతులూరి సత్యనారాయణరాజు. ఊరు భీమవరం. ఇంద్రజాల ప్రదర్శనలు, పుస్తక రచన, పరిశోధనలతో ఆయన మ్యాజిక్ స్టార్‌గా గుర్తింపు పొందారు. సుమారు 50 ఏళ్లుగా ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తూ.. అనేక అవార్డులు, బిరుదులు, సన్మానాలు, సత్కారాలు పొందారు. 1948లో జన్మించిన బోస్ కామర్స్‌లో డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ అకౌంట్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో పూర్తిచేశారు. పీపుల్స్ మ్యాజిక్ సర్కిల్(ఇండియా) అధ్యక్షునిగా, ఇంద్రజాలం, ఇంద్రజాల ప్రపంచం, మాయాదండం వంటి పత్రికలకు ఎడిటర్‌గా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మోడర్న్ మ్యాజిక్ డైరెక్టర్‌గా, నేషనల్ మ్యాజిక్ కళాశాల కర్సపాండెంట్‌గా పనిచేశారు.
16 మ్యాజిక్ పుస్తకాల రచన
డాక్టర్ బోస్ ఇంద్రజాలం, మ్యాజిక్ గైడ్, మాయా బజార్, మ్యాజిక్ షో, మహిమలు, మర్మాలు, బుద్ధ గాథ–బుద్ధ బోధ వంటి ఇంద్రజాలానికి సంబంధించిన 16 పుస్తకాలను రచించారు. వివిధ పత్రికల్లో వ్యాసాలూ రాశారు.
బిరుదులు, అవార్డుల పరంపర
ఆయన ఇంద్రజాల కళా సార్వభౌమ, మ్యాజిక్ చక్రవర్తి, మెగా మెజీషియన్, మ్యాజిక్ మాస్టర్ వంటి 11 బిరుదులు పొందారు. అలాగే మ్యాజిక్ రత్న, ఆంధ్ర రత్నం, విశిష్ట ఇంద్రజాలికుడు అవార్డు, నేతాజీ అవార్డు, శాంతి సామరస్యం వంటి దాదాపు 27 అవార్డులను కుబుద్‌బెన్‌జోషి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, బీష్మనారాయణసింగ్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు.
13 వరల్డ్ రికార్డులు ఆయన సొంతం
సత్యనారాయణరాజు మ్యాజిక్‌లో అద్భుతాలు సృష్టించి వరల్డ్ రికార్డులనూ సొంతం చేసుకున్నారు. యూనిక్ వరల్డ్ రికార్డు, ఎమేజింగ్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డు, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డు వంటి 13 రికార్డులను తన కీర్తిమకుటంలో పొందుపరుచుకున్నారు. అంతేనా.. బోస్ స్వయంగా వంద మ్యాజిక్ ట్రిక్కులను మరొక 100 మ్యాజిక్ పరికరాలను తయారు చేయడం విశేషం. గతంలో భీమవరం పట్టణంలో కళ్ళకు గంతులు కట్టుకుని మోటారు సైకిల్ నడిపి అబ్బురపర్చడమేగాక మ్యాజిక్‌కు సంబంధించి రాష్ట్ర, జాతీయస్థాయి సమావేశాలు, తరగతులు నిర్వహించారు. వేలాది ప్రదర్శనలిచ్చిన డాక్టర్ బోస్ సమాజంలోని మూఢ నమ్మకాలపై ప్రచారం చేయడంతోపాటు శాంతి, అహింసలను ప్రబోధించే బౌద్ధ పుస్తకాలను రచించి జైళ్లలోని ఖైదీలకు ఉచితంగా పంపిణీ చేశారు. వారిలో మానసిక పరివర్తన తీసుకురావడానికి కృషి చేశారు.
విదేశీ పర్యటనలు
సత్యనారాయణరాజు మ్యాజిక్‌ను ప్రదర్శించడానికి సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, ఇంగ్లాడ్, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, వాటికన్ సిటీ, ఇటలీ వంటి దేశాల్లో పర్యటించారు. తోటి మేజీషియన్లను గౌరవించాలనే సంకల్పంతో ఏటా బోస్ మ్యాజిక్ నగదు అవార్డును అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment