
ఫైల్ ఫోటో
కంటికి కనిపించని కరోనా వైరస్ రక్త కణాల్లో అంతర్లీనంగా దాగి ఉంటుంది. ఈ వైరస్ మనిషిని అతలాకుతలం చేసే మహమ్మారిగా వైద్యులు గుర్తించారు. ఇలాంటి ప్రాణాంతకమైన కోవిడ్–19 వైరస్‌ను పసిగట్టడంలో ప్రధాన యోధులు ల్యాబ్ టెక్నీషియన్లు. అనుమానితుల ముక్కు, గొంతు నుంచి స్వాబ్‌ను సేకరించడం మొదలు వ్యాధిని నిర్ధారించే వరకు వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నెగిటివ్, పాజిటివ్‌గా తేల్చే పనిలో రెండు నెలలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.
సాక్షి, తిరుపతి : కరోనా పేరు వింటేనే ప్రతి ఒక్కరూ ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఎవరైనా దగ్గినా, తుమ్మినా, అనుమానం వచ్చినా ఆమడదూరం పారిపోవడం పరిపాటిగా మారింది. అయితే వారికి దగ్గరగా ఉంటూ స్వాబ్‌లు సేకరించి, వాటిని రెండు విధాలుగా పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేయడంలో ల్యాబ్ టెక్నీషియన్లు కీలకంగా పనిచేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ల్యాబ్‌లను ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విస్తరించారు. దూరదృష్టితో ప్రతి జిల్లాలోనూ 2 నుంచి 4 వైరాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. (కరోనా: ‘మహా’ భయం! )
సకాలంలో ల్యాబ్‌లను సమకూర్చడంతో పాటు అవసరమైన టెక్నీషియన్లను, మైక్రోబయా లజీ అసిస్టెంట్లను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించారు. స్విమ్స్ కేంద్రంగా కోవిడ్–19 స్టేట్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ రాష్ట్రంతో పాటు 20 రోజుల క్రితం వరకు తెలంగాణాకు చెందిన నమూనాల ఫైనల్ కరోనా ఫలితాలను నిర్వహించగలిగారు. రుయాలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఐసీఎంఆర్ అనుమతితో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ను జిల్లా యంత్రాంగం ఆగమేఘాలపై ఏర్పాటు చేసింది.
ఎక్కడికక్కడే నమూనాల సేకరణ
అనుమానితుల నమూనాల పరీక్షల కోసం మార్చి నెల వరకు పుణే ల్యాబ్‌కు పంపించేవారు. వైరస్ తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తొలి కరోనా ల్యాబ్‌ను స్విమ్స్‌లో నెలకొల్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నమూనాలను తిరుపతికి తీసుకొచ్చి పరీక్షించేవారు. మార్చి మూడో వారానికల్లా ప్రభుత్వం ల్యాబ్‌లను, అవసరమైన టెక్నీíÙయన్లను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడే అనుమానితుల నుంచి స్వాబ్‌ను సేకరించి ట్రూనాట్ ద్వారా పరీక్షలు జరుపుతున్నారు. వీటి నుంచి పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను మరొకసారి నిర్ధారించుకునేందుకు స్విమ్స్, రుయా కోవిడ్ – 19 ల్యాబ్‌కు తరలిస్తున్నారు. ఈ ల్యాబ్‌లో పరీక్షల అనంతరం ఫలితాలను ప్రకటిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషి యన్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్నారు.
హైరిస్క్ జోన్‌లో విధులు
జిల్లాలోని రెండు కోవిడ్ – 19 వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌లతో పాటు స్థానికంగా నమూనాలను సేకరిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, మైక్రో బయాలజీ అసిస్టెంట్లు హైరిస్క్ జోన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. రెండంచెల రక్షణ కవచాలను ధరించి, అనుమానితుల నుంచి నిర్భయంగా స్వాబ్‌ను సేకరిస్తున్నారు. ఆపై లేబరేటరీల్లో వ్యాధి నిర్ధారణ కోసం రెండు దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంటికి కనిపించని ఈ వైరస్ నుంచి ఎవరికి వారు రక్షణ పొందుతూ వృత్తి ధర్మాన్ని తప్పకుండా పాటిస్తున్నారు.
కుటుంబాలకు దూరంగా..
కరోనా వైరస్ బారినపడిన వారిని సంరక్షించేందుకు వైద్య సిబ్బంది, టెక్నీషియన్లు రెండు నెలలుగా కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు. ఇంకొందరు పూర్తిగా శానిటైజేషన్ చేసుకుని ఇంట్లోనే కుటుంబ సభ్యులకు భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక గదిలో గడుపుతున్నారు. ఇంకొందరు ఇంటిలోని సభ్యులను సొంత ఊర్లకు పంపి విధులు నిర్వహిస్తున్నారు. చంటిబిడ్డలకు దూరంగా ఉంటూ కరోనాతో పోరాటం చేస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రతతో..
తిరుపతి రుయాలో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా సంయుక్తంగా ల్యాబ్ నిర్వహిస్తున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ల సంరక్షణ కోసం రెండింతల భద్రత కోసం అమలు చేస్తున్నాం.
– డాక్టర్ మాధవి కొండేటి, ల్యాబ్ నోడల్ ఆఫీసర్
బిడ్డకు దూరంగా..
రెండు నెలలుగా నా బిడ్డకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నాను. తిరుపతి మధురానగర్‌లో ఉంటున్నాం. విధులు పూర్తి చేసుకున్న తర్వాత పీపీఈ కిట్లను తొలగించి శానిటైజేషన్ చేసుకున్న తర్వాతే ఇంటికి వెళుతున్నాం. బయటే స్నానం చేసి, తర్వాత ఇంట్లోకి వెళుతున్నాం. రెండేళ్ల నా బిడ్డను ఎత్తుకుని రెండు నెలలవుతోంది.
– అల్తాఫ్, రీసెర్చ్ అసిస్టెంట్
Comments
Please login to add a commentAdd a comment