మధిర, న్యూస్‌లైన్: సరైన వైద్యం అందక శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. మధిర పట్టణంలో సోమవారం చోటు చేసుక ున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన మెరుగు సంపత్, సౌజన్యలకు మూడు నెలల శిశువు ఉన్నాడు. అతనికి అనారోగ్యంగా ఉండడంతో ఆదివారం మధిరలోని ఓ ప్రైవేట్ పిల్లల ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స చేయించిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
ఆదివారం అర్ధరాత్రి సమయంలో శిశువు శ్వాస అందకపోవడంతో రాత్రి 12 గంటల సమయంలో తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చారు. కానీ అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కాంపౌండర్లే వైద్య సేవలు అందించారు. సోమవారం ఉదయం 10.30 నిమిషాల సమయంలో డాక్టర్ వచ్చే సరికి శిశువు పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్ వైద్యం ప్రారంభించేలోగానే మృతి చెందాడు.
దీంతో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వచ్చీరాని వైద్యం చేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని ఆరోపించారు. ఈ విషయంపై వైద్యుడిని వివరణ కోరగా తాము సక్రమంగానే వైద్యం అందించామని, వైద్యం చేస్తున్న సమయంలో శిశువుకు తల్లి పాలు ఇచ్చిందని, దీంతో అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస అందక మృతి చెందాడని పేర్కొన్నారు.
శిశువు మృతితో బంధువులు ఆందోళన
Published Tue, Oct 8 2013 7:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement