'ఆరు నెలల్లో రూ. 10 వేల కోట్లు సంపాదించాడు'
మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు కొత్త పార్టీ అంటూ డ్రామా లాడుతున్నారని మాజీ మంత్రి డొక్కా మణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. కిరణ్ అవినీతిపై విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం గవర్నర్కు మాణిక్యవర ప్రసాద్ లేఖ రాశారు. ఆరు నెలలుగా అవినీతి ఫైళ్లపై కిరణ్ రెండు చేతులతో సంతకాలు చేశారని విమర్శించారు. ఆరు నెలల కాల వ్యవధిలో రూ. 5 నుంచి 10 వేల కోట్లు కిరణ్ సంపాదించారన్నారు.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను కూడా వదిలిపెట్టకుండా సీఎంగా కిరణ్ మాముళ్లు వసూళ్లు చేశారన్నారు. కిరణ్ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారన్నారు. కిరణ్ బ్యాక్ అఫీస్ ద్వారా ఆయన తమ్ముడు వసూళ్లు చేశారని డొక్కా మణిక్యవర ప్రసాద్ ఆరోపించారు.
కిరణ్కు డొక్యా మాణిక్యవరప్రసాద్ అత్యంత సన్నిహితుడు. ఆయన మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే కిరణ్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే డొక్యా మణిక్యవర ప్రసాద్ సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. ప్రముఖ రచయిత గోపిచంద్ వ్రాసిన అసమర్థుని జీవ యాత్ర నవలలోని సీతారామరావు పాత్రకు కిరణ్ అచ్చుగుద్దినట్లు సరిపోతారని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.