సాక్షి, అనంతపురం : గృహ హింస నిరోధక చట్టం-2005పై మహిళలకు అవగాహన కల్పించడంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది. వాస్తవంగా హింస ఎక్కువ స్థాయిలో ఉన్నా.. చట్టంపై అవగాహన లేకపోవడంతో ఆ మేరకు ఫిర్యాదులు రావడంలేదని తెలుస్తోంది.
ఆరేళ్లలో 561 ఫిర్యాదులు మాత్రమే నమోదయ్యాయి. కానీ ఈ సంఖ్య రెండు వేలకు పైగానే ఉండవచ్చని అంచనా. మహిళలు, పిల్లల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై ఉంది.
అయితే.. మహిళా చైతన్యం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలు మచ్చుకైనా కన్పించడం లేదు. మహిళా చట్టాలపై జిల్లా స్థాయి సమావేశాల్లో ఐసీడీఎస్ అధికారులు, సూపర్‌వైజర్లు, కార్యకర్తలకు చెబుతున్న అంశాలు అక్కడే సమాధి అవుతున్నాయి. వాటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడం లేదు. ప్రత్యేకించి గృహ హింస నిరోధక చట్టంపై దశల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించడ ం లేదు. ఈ విషయంలో శ్రద్ధ చూపాల్సిన ప్రాజెక్టు డెరైక్టర్ జిల్లా వ్యాప్త సమావేశాలు, అంగన్‌వాడీల ఇంటర్వ్యూలు, సీడీపీఓలు నిర్వహించే సదస్సులకే పరిమితం అవుతున్నారన్న విమర్శలున్నాయి.
ఆరేళ్లలో 561 కేసులు
గృహహింస నిరోధక చట్టం కింద 2007 నుంచి 2012 వరకు అధికారులకు 561 ఫిర్యాదులందాయి. వీటిలో అధికారులు 177 పరిష్కరించారు. కోర్టుకు వెళ్లకముందే 45 కేసులను ఫిర్యాదుదారులు వాపసు తీసుకున్నారు. 21 కేసులు పోలీసుస్టేషన్లలో పెండింగ్ పడ్డాయి. మరికొన్ని ఫిర్యాదులపై ఇరువర్గాలు హాజరు కాకపోవడంతో తదుపరి చర్యలు చేపట్టడానికి వీలు కాలేదు. మొత్తమ్మీద నమోదైన 561 కేసుల్లో డీఐఆర్(కోర్టు దాకా వెళ్లినవి) 310 ఉన్నాయి. వీటిలో 109 కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకున్నారు. 115 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. 86 కేసులు విచారణలో దశలో ఉన్నాయి. గృహహింస నిరోధక చట్టంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంత మంది మహిళలు నేరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు సెక్షన్ 498ఏ కింద కేసులు నమోదు చేస్తున్నారు.
సదస్సులు నిర్వహిస్తున్నాం
గృహ హింస నిరోధక చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూనే ఉన్నాం. ఇందుకు ప్రత్యేక బడ్జెట్ లేకపోయినా.. ఆఫీసు ఖర్చుల నుంచి సర్దుబాటు చేస్తూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలపై ఆఘాయిత్యాలు జరిగిన వెంటనే స్పందిస్తున్నాం. వారికి మద్దతుగా నిలబడుతున్నాం. త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం.
- జుబేదాబేగం, స్త్రీ,శిశుసంక్షేమశాఖ
ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ), అనంతపురం
ఆగని హింస
Published Mon, Dec 2 2013 2:55 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement