రాజీనామా చేస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే
పులపర్తి, నామనల మధ్య విభేదాలు
రాంయపునకు అనుమతించకుంటే పదవికి
రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే
ఆ వ్యవహారంలో తన ప్రమేయం లేదని
పార్టీ నాయకులకు జెడ్పీ చైర్మన్ వివరణ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఇసుక రీచ్‌లపై ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీలో దుమారాన్ని రేపుతోంది. నిన్నగాక మొన్న రాజమండ్రి కుమారి టాకీస్ వద్ద గోదావరిలో ఇసుక తవ్వకాన్ని డ్వాక్రా మహిళలకు కేటాయించే విషయమై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ (బీజేపీ), రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మధ్య పరోక్షంగా అగ్గి రాజేసింది. ఇక్కడ ఇసుక తవ్వకాలపై టీడీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, అన్ని అర్హతలున్నా తమకు అప్పగించలేదని ఉల్లితోట మహిళా సమాఖ్య ఆందోళనకు దిగింది. తవ్వకాలను ప్రారంభించేందుకు వచ్చిన సిటీ ఎమ్మెల్యే ఆకులను మహిళలు నిలదీశారు. కావాలనే గోరంట్ల వర్గీయులకు ఇక్కడ తవ్వకాలు కట్టబెట్టారని మహిళా సంఘాలు, ఆకుల వర్గీయులు ఆరోపిస్తున్నారు.
రాజమండ్రిలో రాజుకున్న అగ్గి ఇంకా చల్లారకుండానే టీడీపీకి చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జెడ్పీ చైర్‌పర్సన్ నామన రాంబాబుల మధ్య ఇసుక జగడం మొదలైంది. కోనసీమలోని పి.గన్నవరం ఇసుక ర్యాంపునకు అనుమతి రాకపోవడమే వీరి మధ్య వివాదానికి కారణమైంది. పి.గన్నవరం అక్విడెక్టుకు ప్రమాదం సంభవిస్తుందని అధికారులు ఇక్కడ తవ్వకాలకు అనుమతి నిరాకరించారు. అయితే కావాలనే ర్యాంప్‌ను నిలిపివేశారంటూ ఎమ్మెల్యే పులపర్తి ర్యాంపునకు అనుమతి విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ర్యాంపునకు అనుమతి ఇవ్వకుంటే పదవికి రాజీనామా చేసేందుకు సైతం వెనుకాడేది లేదని పరోక్షంగా హెచ్చరించారని సమాచారం.
అధికారుల అభ్యంతరం మాటున..
కోనసీమలోని ఐదు నియోజకవర్గాల్లో కొత్తపేట పరిధిలోని రావులపాలెం తరువాత పి.గన్నవరం పరిధిలో ఇసుక తవ్వకాలు అత్యధికంగా ఉండే పి.గన్నవరం, లంకల గన్నవరం, ముంజువరం కలిపి ఒక ప్యాకేజీ. బోట్స్‌మెన్ సొసైటీ పేరున వేలంలో దక్కించుకుని ఇక్కడ ఇసుక తవ్వకాలు జరుపుతుంటారు. గత ఏడాది పడవలు వెళ్లే అవకాశం లేదని మొర పెట్టుకోవడంతో ర్యాంపు వేసేందుకు అనుమతి ఇచ్చారు. విజయవాడకు చెందిన బడా వ్యాపారులు బోట్స్‌మెన్ పేరున ఇక్కడ ఇసుక వ్యాపారం చేపట్టారు. అడ్డూఅదుపులేకుండా, నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక తవ్వకాలు చేపట్టడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
అక్విడెక్టుకు 500 మీటర్లలోపు ఇరువైపులా తవ్వకాలు చేయరాదనే నిబంధనలు ఉండగా, పాటదారులు 200 మీటర్ల సమీపంలో ఇసుక తవ్వారనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్.గన్నవరంలో డ్రెడ్జర్ తరహా మోటార్లతో ఇసుక తవ్వగా ఇరిగేషన్ హెడ్‌వర్క్స్ అధికారుల అభ్యంతరంతో తవ్వకాలు నిలిచిపోయాయి. ఇవే కారణాలతో ఈ ఏడాది తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు. అయితే అనుమతి ఇవ్వకుండా కొర్రీలు వేయడం వెనుక జెడ్పీ చైర్‌పర్సన్ నామన పాత్ర ఉందని ఎమ్మెల్యే పులపర్తి గట్టిగా నమ్ముతున్నారు. అధికారుల అభ్యంతరాలను సాకుగా చూపి నామన తవ్వకాలను అడ్డుకున్నారని పులపర్తి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, శనివారం కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి వచ్చిన పులపర్తి.. గన్నవరం రీచ్‌కు అనుమతి నిరాకరించడంపై మైన్‌స అధికారులను నిలదీశారు. దీనిపై పరిశీలనకు అధికారులను పంపుతానని కలెక్టర్ ఆయనకు హామీ ఇచ్చారు.
ఆధిపత్య పోరే అసలు కారణం..
ఇసుక రీచ్ వ్యవహారంలో వీరి వివాదం తెరపైకి వచ్చినా అసలు కారణం ఆధిపత్య పోరేనని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మామిడికుదురు మండలానికి చెందిన నామన టీడీపీ ఆవిర్భావం నుంచి పి.గన్నవరం నియోజకవర్గంలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాం నుంచి టీడీపీ ముఖ్యనేతలతో నామన మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు. నామనతో సమానంగానే పులపర్తి కూడా ఆ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూస్తూ వస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో పులపర్తికి మరోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది.
అదృష్టం కలిసివచ్చి నామన జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యారు. ఇక అప్పటి నుంచే వీరి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమై ఇప్పుడు ఇసుకరీచ్ వ్యవహారంలో బహిర్గతమైంది. పి.గన్నవరం కేంద్రంగా రెండు అధికార కేంద్రాలు ఏర్పడటంతో ఇవన్నీ సహజమేనని పార్టీ నేతలు తేలిగ్గా తీసుకుంటున్నా పార్టీ శ్రేణులు మాత్రం ‘అడకత్తెరలో పోక చెక్క’...సామెతగా నలిగిపోతున్నారు. ఒకపక్క ఎమ్మెల్యే, మరోపక్క జెడ్పీ చైర్‌పర్సన్ ఎవరి పక్కన నిలవాలనేది తేల్చుకోలేక తలలుపట్టుకుంటున్నారు. ఇసుకరీచ్‌లో తవ్వకాలకు అనుమతి రాకపోవడంలో తన ప్రమేయం లేదని నామన పార్టీ నేతలకు వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుంటానంటున్న ఎమ్మెల్యే ఆమరణ దీక్ష చేస్తానంటూ హెచ్చరించడం వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయనడానికి నిదర్శనం. పార్టీ నాయకత్వం ఈ వివాదాన్ని ఏరకంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.