పొన్నూరు, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనకు సహకరించిన పార్టీలకు ఓట్లేయొద్దని, అలా వేస్తే మీరూ విభజనకు సహకరించినట్టేనని మాజీ ముఖ్యమంత్రి జై సమైక్యంధ్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
నాడు తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే నేడు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అదే జాతిని చీల్చిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయారని ధ్వజమెత్తారు. వరంగల్ సభలో చంద్రబాబు జై తెలంగాణ నినాదమిచ్చారని, ఆయనను తెలుగు ప్రజలు తరిమి, తరిమి కొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆయన జిల్లాలోని తెనాలి, పొన్నూరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రి పొన్నూరులో ఏర్పాటు చేసిన జై సమైక్యంధ్ర పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినా సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తెలుగుజాతిని చీల్చిన పార్టీలకు ఓటు వేయవద్దని కోరారు. రాజకీయాల్లో అవకాశవాదానికి తావులేదని, అధికారం కోసం గడ్డితింటే ప్రజలు ఉరుకోరన్నారు. ముఖ్యమంత్రిగా తాను అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.
కాంగ్రెస్ అధిష్టానం దుర్మార్గంగా తెలుగు ప్రజలను విడదీయడం వల్లే ఆ పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీ తన కోసం కాదని తెలుగుజాతి కోసం పెట్టానని వివరించారు. పార్టీ గుర్తుగా పాదరక్షలు ఎంచుకున్నానని, ఢిల్లీ పెద్దలకు చెంపదెబ్బ కొట్టేలా తీర్పివ్వాలని ఓటర్లును కోరారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ అమలు చేయలేని హామీలు ఇస్తున్నాయని విమర్శించారు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజలు తరమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో జై సమైక్యంద్ర పార్టీ నాయకులు గంగాధర్, రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వెలవెలబోయిన రోడ్‌షో
తెనాలిలో కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌షోకు జన స్పందన అంతగా లభించలేదు. రోడ్డుపక్కనున్న జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగిపోవాల్సి వచ్చింది. సెంటర్‌లో నిర్వహించిన సభకు కూడా కొద్దిపాటి కార్యకర్తలే హాజరయ్యారు. పొన్నూరులో రాత్రి అయినప్పటికీ ఆశించిన జనస్పందన కనిపించలేదు.
చంద్రబాబును తరిమి కొట్టండి
Published Sat, Apr 5 2014 1:51 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement