ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పెద్దాపురం రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం పెద్దాపురంలో మున్సిపల్ ఎన్నికల సంద ర్భంగా అత్యంత సమస్యాత్మకమైన బూత్‌లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొండయ్యపేటలో మున్సిపల్ స్కూల్, పద్మనాభ కాలనీలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను ఆయన పరిశీలించారు. పోలింగు రోజున తీసుకోవాల్సిన భద్రత చర్యలపై ఆయన డీఎస్పీకి పలు సూచనలు చేశారు.
అనంతరం డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు రూ. 32,00, 650 నగదును సీజ్ చేశామన్నారు. అలాగే రూ. 3 లక్షల విలువ చేసే లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 500 మంది పోలీసు అధికారులను నియమించామన్నారు. జిల్లాల్లో నాలుగు బెటాలియన్ స్పెషల్ ఫోర్స్ ఉందన్నారు. వీరి సేవలను వినియోగించుకుంటున్నామన్నారు.
జిల్లాలో ప్రధాన ప్రాంతాల్లో 13 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే చిన్న చిన్న పట్టణాల్లో కూడా 58 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం ఎన్నికలపై నిఘా పెట్టామన్నారు. సమావేశంలో డీఎస్పీ ఓలేటి అరవిందబాబు, సీఐ నాగేశ్వరరావు, ఎస్సై బి.శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.