మమ్మల్ని వివాదాల్లోకి లాగవద్దు: ప్రజాప్రతినిధుల సతీమణులు
ఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణులు, వారి కుటుంబ సభ్యులు తమ స్థాయిలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను మొదలుకొని దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు అందరినీ కలుస్తున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరుతున్నారు. వినతి పత్రాలు ఇస్తున్నారు. వారు నిన్న రాష్ట్రపతితోపాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్‌ను కూడా కలిశారు.
ఈ బృందంలో కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి భార్య కోట్ల సుజాతమ్మ, కావూరి సాంబశివరావు భార్య హేమలత, కూతురు శ్రీవాణి, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్ భార్య మోక్షప్రసూన, పార్థసారధి భార్య కమలాలక్ష్మి, తోట నర్సింహం భార్య వాణి, కన్నా లక్ష్మీనారాయణ భార్య విజయ, శత్రుచర్ల విజయరామరాజు భార్య శశికళ, పితాని సత్యనారాయణ భార్య అనంత లక్ష్మి, మాజీ మంత్రులు ఆర్.చెంగారెడ్డి భార్య ఇందిర, మారెప్ప భార్య వేదవాణి, మాజీ విప్ సామినేని ఉదయభాను భార్య విమలాభాను, మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోదరి సుచరిత, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి భార్య శ్రీదేవి తదితరులు ఉన్నారు.
వారు ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం తాము ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. తమను వివాదాల్లోకి లాగొవద్దని కోరారు. పార్టీలకు అతీతంగా మహిళలంతా సమైక్యాంధ్ర కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.