సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యటించే తెలంగాణ రాష్ట్ర సమితి నేతల కార్యక్రమాల్లో టీడీపీ నేతలవెరూ పాల్గొనరాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. స్నేహాలు, బంధుత్వాలుంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని.. అలా కాకుండా ఎవరైనా వారి పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడంపై చంద్రబాబు గురువారం పార్టీ నేతలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవలి రాష్ట్ర పర్యటనలో తలసాని చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అంటూ సీఎం ప్రశ్నించారు. బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టరాదని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయరాదన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు స్పందన లేకపోవడంవల్లే బుధవారం హడావిడిగా జగన్‌తో కేటీఆర్ భేటీ అయ్యారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ భేటీతో టీఆర్‌ఎస్, వైసీపీ ముసుగు తొలగిపోయిందన్నారు.
బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా..
కాగా, బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా, ఆ ఓట్లను చీల్చాలని కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. దేశంలో పార్టీలను గందరగోళ పరచడం, ప్రజల్లో అయోమయం సృష్టించడమే వీరి లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన అప్రదిష్టపాలైందని, దానిని కప్పిపెట్టేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇస్తే మాకు ఇవ్వాలని కేసీఆర్ అన్నారని, షెడ్యూల్–9, షెడ్యూల్–10 సంస్థల విభజనకు అడ్డంకులు పెట్టారని, చివరికి సుప్రీంకోర్టు తీర్పునూ అమలు చేయనివ్వలేదన్నారు. విభజన చట్టంలోని అంశాలు అమలుచేస్తారా? “సుప్రీం’ తీర్పును అమలుచేయమని చెబుతారా? పోలవరం ప్రాజెక్టుకు అడ్డంపడకుండా ఉంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. టీడీపీపై షర్మిల ఫిర్యాదు చేయడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసింది వైసీపీయేనన్నారు. సోషల్ మీడియాలో సీబీఐ పూర్వపు జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీనే దుష్ప్రచారం చేసిందన్నారు. పవన్‌కళ్యాణ్ పెళ్లిళ్లపై అసభ్యంగా ప్రచారం చేశారని, టీడీపీ మహిళా నేతలపైన, నా కుటుంబ సభ్యులపైనా దుష్ప్రచారం చేశారని చంద్రబాబు చెప్పారు. సోషల్ మీడియాను ఎవరు దుర్వినియోగం చేసినా సహించేదిలేదని, పార్టీలకు అతీతంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐకు భూమి పూజ
కాగా, గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఐనవోలు గ్రామంలో జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భూమిపూజ చేశారు. ఈ సంస్థ కోర్సులన్నీ ఈ ఏడాది జూన్ నుంచే లయోలా కళాశాలలో ప్రారంభమవుతాయని, ఏడాదిన్నర కాలంలో భవనం పూర్తిచేస్తారని తెలిపారు. ఈ నెల 29న అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌లో తయారైన కారు రోడ్డు మీదకు రాబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ సర్కార్ కూడా ఏపీకి సహకరించకుండా గద్దల్లా మన మీద పడుతున్నాయని సీఎం ఆరోపించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగిన మరో కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీమంత్రి మహ్మద్ అహ్మదుల్లా, ఆయన కుమారుడు అర్షబ్‌లకు టీడీపీ కండువాలు కప్పి చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
టీఆర్‌ఎస్ నేతలతో తిరగొద్దు!
Published Fri, Jan 18 2019 2:44 AM | Last Updated on Fri, Jan 18 2019 3:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment