ఆదివారం.. అంతటా ప్రశాంతంగా ఉంది.. అంతలోనే గావుకేకలాంటి చావుకేక.. తండ్రీకొడుకుల దారుణ హత్యతో అందరూ ఉలిక్కిపడ్డారు. పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హతమవ్వడం సంచలనం సృష్టించింది. ప్రత్యర్థులు మారణాయుధాలతో చెలరేగిపోవడంతో వారి బారి నుంచి తమ తండ్రిని కాపాడే ప్రయత్నంలో అక్కడికి వెళ్లిన కుమారుడ్నీ కిరాతకంగా హతమార్చడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
- కౌతాళం
డీలర్ పదవి కోసమేనా..
ఉరుకుంద సమీపంలో జరిగిన జంట హత్యలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన తిమ్మారెడ్డి ఇరవై ఏళ్లుగా చౌక ధాన్యపు డిపో డీలర్‌గా కొనసాగుతున్నారు. దీనికి తోడు భూస్వామి కూడా. ప్రభుత్వం మారడంతో ఎలాగైనా అతని డీలర్‌షిప్‌ను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యర్థులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని గ్రామస్తులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి తిమ్మారెడ్డిని తొలగించాలంటూ అధికారులపై ఒత్తిళ్లు అధికం కావడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
కౌతాళం మండలం ఉరుకుంద గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం 10.30-11 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన తిమ్మరెడ్డి(49), అతని దత్త కుమారుడు రాఘవరెడ్డి(29) తమ ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. డీఎస్పీ శ్రీనివాసులు, గ్రామస్తుల కథనం ప్రకారం...
మాటువేసి మట్టుబెట్టారు
చెరుకు తోటకు తుంగభద్ర దిగువ కాలు వ సాగు నీటి విషయంలో గ్రామానికి చెందిన నాగిరెడ్డి, తిమ్మరెడ్డి మధ్య వారం కిందట వాగ్వాదం చెలరేగింది. అప్పటి నుంచి ప్రత్యర్థులు హత్యలకు కుట్రపన్నారు. అదను కోసం వేచి చూస్తున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు తిమ్మరెడ్డి తమ కూలి మనిషి నీలకంఠతో కలసి బైక్‌లో చెరుకు తోట వద్దకు బయలుదేరారు. అప్పటికే అక్కడ తన అనుచరులతో కలసి మారణాయుధాలతో మాటువేసి ఉన్న నాగిరెడ్డి ఒక్కసారిగా తిమ్మరెడ్డిపై దాడికి దిగారు.
అదే సమ్యంలో మరో మనిషి దేవేంద్రతో కలసి అక్కడికి వచ్చిన రాఘవరెడ్డి ప్రత్యర్థుల నుంచి తమ తండ్రిని కాపాడేందుకు వెళ్లాడు. అయినా పట్టువదలని ప్రత్యర్థులు తిమ్మారెడ్డిపై విచక్షణారహితంగా వేటకోడవళ్లతో దాడికి తెగబడటంతో అతని మెదడు బయటికి వచ్చేసింది. ఆ తరువాత రాఘవరెడ్డినీ వారు వదల్లేదు. విషయం తెలిసిన వెంటనే హతుల కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడి కి చేరుకున్నారు. రక్తపు మడుగులో విగతజీవులైన తమ వారిని చూసి వారు గుం డెలు పగిలేలా రోదించారు. వారిని ఓదార్చాడం కష్టంగా మారింది.
రంగంలోకి పోలీసులు
జంట హత్యల సమాచారం అందిన వెం టనే పోలీసులు రంగంలోకి దిగారు. సం ఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసులు, కోసిగి, ఆదోని రెండో పట్టణం, కంట్రోల్ రూం సీఐలు రాముడు, లక్ష్మయ్య, శ్రీధర్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నాగిరెడ్డి తన అనుచరులతో కలసి జంట హత్యలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గ్రామంలో అలజడి
జంట హత్యల సంఘటనతో ఉరుకుంద లో అలజడి నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోం ది. హత్యల సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులందరూ హతుల ఇంటి వద్దకు చేరుకున్నారు. తండ్రీకొడుకులను చంపిన తీరు చూసి పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఉరుకుందలో జంట హత్యలు
Published Mon, Dec 22 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement
Advertisement