ప్రభుత్వ పథకాల అమలు తీరు, పరిశీలన కోసం మంగళవారం మందమర్రిలోని ఇల్లందు క్లబ్‌లో నిర్వహించిన జిల్లా సమీక్ష మండలి (డీఆర్‌సీ) సమావేశం ఆద్యంతం మొక్కుబడిగా సాగింది. ఉదయం 11.10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.40 గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో కీలకమైన పది శాఖల పరిధిలోని 23 అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా కేవలం విద్యా, వ్యవసాయంపైనే విస్తృతస్థాయి సమీక్ష జరిగింది. హౌసింగ్, పంచాయతీరాజ్, వైద్యం, ఉపాధిహామీ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
కాగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కాతలేని పత్తి, మొలకొచ్చిన సోయా మొక్కలతో సమావేశానికి వచ్చారు. తక్షణమే అతివృష్టితో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో నాన్ ట్రైబల్స్‌కు పహాణీతోపాటు పంటలకు నష్టపరిహారం ఇప్పించాలని ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ కలెక్టర్ అహ్మద్ బాబుతో వాగ్వాదానికి దిగారు. ఏజెన్సీలో గిరిజనేతరులకు భూముల పట్టాలు, పరిహారం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎంపీ రాథోడ్ రమేశ్ వాగ్వాదం
జిల్లా సమీక్ష సమావేశం ప్రారంభించే ముందు ఇన్‌చార్జి మంత్రి సారయ్య సమావేశాన్ని ప్రారంభిద్దామా? అంటూ సభ్యుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ముందుగా తెలంగాణ అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అంటూ ఎమ్మెల్యే రామన్న ప్రతిపాదించారు. మౌనం పాటించిన అనంతరం ప్రధాన అంశాలపై చర్చిద్దామని మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు వ్యవసాయశాఖ నుంచి సమీక్ష మొదలు పెట్టారు. డీఆర్‌సీకి ఆలస్యంగా వచ్చిన ఎంపీ రాథోడ్ రమేశ్ ఏజెన్సీ ప్రాంతంలో వరదల కారణంగా నష్టపోయిన గిరిజనేతరులకు పంట నష్ట పరిహారం ఎందుకివ్వడం లేదని వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ రోజ్‌లీలను ప్రశ్నించాడు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గిరిజనేతరులకు నష్టపరిహారం ఇవ్వడం కుదరని చెప్పడంతో గతంలో ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు ఎందుకు ఇవ్వరంటూ నిలదీశారు. ఎంపీ వాదనపై స్పందించిన కలెక్టర్ బాబు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు సాగు చేస్తున్నా వారికి పట్టాలు, పహాణీలు, నష్టపరిహారం ఇవ్వడం చట్టపరంగా కుదరదన్నారు. ఈ విషయమై కలెక్టర్ అహ్మద్‌బాబు ఎంపీకి న చ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది.
దీంతో ఎమ్మెల్యేలు అరవిందరెడ్డి, జోగు రామన్న ఎంపీకి అసలు విషయం చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఎంపీ ఇరువురు ఎమ్మెల్యేల పైనా మండిపడ్డారు. ఎమ్మెల్యే రామన్న స్పందిస్తూ డీఆర్‌సీ పరిధిలోని అంశాలు ప్రస్తావించి సమయం వృథా కాకుండా చూడాలే తప్ప మరొకటి కాదని, అవసరమైతే తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుదామని పేర్కొన్నారు. దీంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు. మంత్రి, కలెక్టర్ వెళ్లొద్దని చెప్పినా వినిపించుకోలేదు.
విద్య, వ్యవసాయంపై విస్తృత చర్చ
డీఆర్‌సీలో విద్య, వ్యవసాయంపై విస్తృత చర్చ జరిగింది. మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు వ్యవసాయశాఖ నుంచి సమీక్ష మొదలు పెట్టాలన్నారు. జిల్లాలో అతివృష్టి వల్ల దెబ్బతిన్న పంటలపై వెంటనే సర్వే జరిపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మెజార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. మొదటగా ఎమ్మె ల్సీ బి.వెంకట్రావు మాట్లాడుతూ మూడు నెలలకోసారి జరగాల్సిన డీఆర్‌సీ ఏడాదిన్నర తర్వాత నిర్వహించడం బాధాకరమన్నారు. కనీసం ఆరు నెలలకోసారైనా డీఆర్‌సీ జరిగేలా చూడాలని కోరారు.
క్యాతనపల్లి శివారులో 40 ఎకరాల్లో అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందేలా చూడాలని, మంత్రి సారయ్య సీఎంతో మాట్లాడి జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి విద్యాశాఖకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. మేలో ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ జరిగినా వారిని రిలీవ్ చేయడం లేదని, 1,141 పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీకి నోచుకోవడం లేదన్నారు. డీఎస్సీ జరగక, విద్యావలంటీర్ల నియామకం లేక విద్యావ్యవస్థ కుంటుపడుతోందన్నారు.
ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఎస్.వేణుగోపాలాచారి, గోడం నగేశ్, గడ్డం అరవిందరెడ్డి, సుమన్ రాథోడ్, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య తదితరులు విద్యాశాఖ సమస్యలపై స్పందించారు. నాణ్యత లోపించిన పాఠశాల భవనాల నిర్మాణం, నాసిరకం పనులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయశాఖ, పంటరుణాలు, యాంత్రీకరణ, రైతుల ఆత్మహత్యల నివారణపై స్పందించాలని కోరారు.
67,987 హెక్టార్లలో రూ.61.88 కోట్ల నష్టం జరిగినట్లు ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక పంపామని, రీసర్వే కూడా చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంకా సమావేశంలో జేసీ సుజాత శర్మ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉమా మహేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌రావు, కె.పోచయ్య, వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, షేక్ మీరా, హంసారెడ్డి, అంకం శంకర్, యాదయ్య, సుధాకర్‌రావు, డీఎఫ్‌వో శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
తీర్మానాలు ఇవే..
తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరుల ఆత్మశాంతి కలగాలని పేర్కొన్నారు.
జిల్లాలో కలెక్టర్ నాయకత్వంలో అధికార యంత్రాంగం ఒక్క టీమ్‌గా చేస్తున్న అభివృద్ధి ప్రశంసనీయమంటూ అభినందన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
జిల్లాలో జరిగిన పంటల నష్టంపై రీ సర్వే చేసి సుమారు 3 లక్షల ఎకరాల్లో పత్తి, సోయా, ఇతర పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందేలా చూడాలి.
పంట నష్టం, అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడిన ఒక్కో రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. తక్షణమే ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపించాలి.
రాజీవ్ విద్యామిషన్‌లో రూ.118 కోట్లతో నిర్మించిన భవనాల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై క్వాలిటీ కంట్రోల్ ద్వారా విచారణ జరపాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
కలెక్టర్, ఎమ్మెల్యేలతో ఎంపీ రాథోడ్ రమేశ్ వాగ్వాదం
Published Wed, Oct 9 2013 6:53 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement
Advertisement