సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆదిలాబాద్ ఎంపీ, టీఆర్‌ఎస్ నేత రమేష్ రాథోడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా, జానారెడ్డి సమంక్షలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి రమేష్ రాథోడ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో ఎంపీగా పనిచేసిన రమేష్ రాథోడ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు.. రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం టీడీపీకి గుడ్‌బై చెప్పి కారెక్కిన రమేష్ రాథోడ్... టీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ టికెట్ ఆశించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఖానాపూర్ టికెట్ ఆయనకు దక్కకపోవడంతో... టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు..
కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలి
రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలం పెరిగి పదికి పది స్థానాలు గెలుస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు నియంతృత్వ పోకడలకు పోతున్న కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజల మధ్యనేనని తేల్చిచెప్పారు. దళిత గిరిజనులను అణచి వేస్తున్నారని, మొదటి నుంచి ఆ వర్గాలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. అమరుల త్యాగాలతో కుర్చీ ఎక్కిన కేసీఆర్ వారిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర కల్సిస్తామని హామీ ఇచ్చారు.
ఆ ముగ్గురు కుమ్మకయ్యారు..
నవంబర్ లేక డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్ కుమ్మక్కై హడావుడిగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని, ముగ్గురు కుమ్మక్కై 21 లక్షల ఓట్లు తగ్గించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment