సాక్షి, హైదరాబాద్: తాము కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నామంటూ వస్తున్న కథనాలను టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌లో పనిచేయడం, ప్రజలకు సేవ చేయ డాన్ని తాము గర్వంగా భావిస్తామని, అయితే పార్టీలో కీలక హోదాలో ఉన్న ఓ నాయకుడే తమపై దుష్ప్రచారం చేస్తున్నా రని ఆరోపించారు.
ఈ మేరకు శనివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. తమకు పిల్లలు కూడా లేరని, తమ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశామన్న ఉత్తమ్ దంపతులు తమకు ఎలాంటి వ్యాపారాలు, కాంట్రాక్టులు, భూలావాదేవీలు లేవని చెప్పారు. ప్రజాజీవితంలో తప్ప వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్‌ను ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని స్పష్టం చేశారు.
ప్రకటనలో ఏముందంటే...: ‘నేను కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు వస్తున్న కథనాలు అసత్యాలు. ప్రజల్లో నా ప్రతిష్టను దిగజార్చేందుకు, పార్టీలో నా స్థానాన్ని తగ్గించేందుకు పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఒక నాయకుడే ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తున్నాడు. కాంగ్రెస్‌కు 30 ఏళ్లుగా సేవ చేస్తున్నందుకు గర్వపడుతున్నా. నా సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వందల ఓట్ల తేడాతో ఓడినప్పటికీ కోదాడలోనే నివాసముంటూ అక్కడి ప్రజలకు సేవలందిస్తున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు.
కానీ, రెండేళ్ల నుంచి మమ్మల్ని టార్గెట్ చేసి పరువు నష్టం కలిగించే కథనాలు రావడం తీవ్రంగా బాధిస్తోంది. పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాల పట్ల నాకు అసంతృప్తి ఉన్నప్పటికీ ఎక్కడా ఈ విషయాలను పంచుకోలేదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా రాజ్‌భవన్‌లో, తెలంగాణ ఏర్పాటు విషయంలో చిదంబరం నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తప్ప నేనెప్పుడూ సీఎం కేసీఆర్‌ను కలవలేదు. ఎప్పుడూ మాట్లాడలేదు.
చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ విమాన పైలట్‌గా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయడం గర్వంగా భావిస్తాను. రాష్ట్రపతి భవన్‌లోనూ సీనియర్ ఆఫీసర్‌గా వెంకట్రామన్, శంకర్‌దయాళ్‌శర్మ వద్ద పనిచేశాను. ఉన్నత స్థాయి ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రజాసేవ కోసం కాంగ్రెస్‌లో చేరాను. కాంగ్రెస్ నాయకుడికి సన్నిహితంగా ఉండే రెండు యూట్యూబ్ చానళ్లు, కొన్ని మీడియా సంస్థలు నాపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయి’ అని ఉత్తమ్‌తోపాటు ఆయన సతీమణి పద్మావతి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment