
ఏ. చంద్రశేఖర్, రమేశ్‌రాథోడ్
లోక్‌సభ ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా రమేశ్‌రాథోడ్, పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ఏ.చంద్రశేఖర్‌ను ప్రకటించింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనప్పటికీ ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ నగేశ్‌కే స్థానం దక్కనుంది. పెద్దపల్లిలో ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉండడంతో వివేక్‌కు స్థానం దక్కుతుందా.. లేదా.. అన్న సందిగ్ధం నెలకొంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీయే ఇప్పటికీ తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించలేదు. ఆదిలాబాద్ స్థానం కోసం సోయం బాపూరావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అసమ్మతికి ఆజ్యం పోసింది. ఆ పార్టీకి సీనియర్ నాయకుడు నరేశ్‌జాదవ్ రాజీనామా చేశారు.
సాక్షి, మంచిర్యాల: లోకసభలో బరిలో తలపడే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. రాష్ట్రానికి సంబంధించి వెలువరిచిన తొలి జాబితాలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. సామాజిక సమీకరణలే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ లోకసభ అభ్యర్థిగా రమేష్ రాథోడ్, పెద్దపల్లి స్థానానికి ఎ.చంద్రశేఖర్‌ల అభ్యర్థిత్వాలకు పార్టీ ఓకే చెప్పింది. ఈ రెండు స్థానా లకు అభ్యర్థుల ప్రకటనతో ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి.
ఆదిలాబాద్ టికెట్‌ను ఆశించిన నరేశ్‌జాదవ్ కాంగ్రెస్ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. అదేబాటలో సోయం బాపురావులు పార్టీని వీడనున్నట్లు సమాచారం. ఇక పెద్దపల్లి నియోజకవర్గానికి అంతగా పరిచయం లేని చంద్రశేఖర్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
రమేష్ రాథోడ్‌కే ఆదిలాబాద్
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన విపరీత జాప్యం కూడా ఓటమికి కారణమని బలంగా విశ్వసిస్తున్న కాంగ్రెస్ పార్టీ, లోకసభ ఎన్నికల్లో ఆ పొరపాటుకు తావివ్వకుండా ముందుగానే అభ్యర్థులను వెల్లడించింది. రాష్ట్రానికి సంబంధించి ఎనిమిది మందితో కూడిన జాబితాను వెల్లడించగా, అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాలు ఉండడం విశేషం. ఆదిలాబా ద్ నియోజకవర్గం నుంచి రమేష్ రాథోడ్‌కు పార్టీ టికెట్ దక్కింది. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ నుంచి సోయం బాపురావు, లంబాడ నుంచి రమేష్ రాథోడ్, నరేష్ జాదవ్‌లు పోటీపడ్డారు.
రాష్ట్రవ్యా ప్త సమీకరణలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల ను బేరీజు వేసుకొని లంబాడ తెగకు చెందిన రమేష్‌రాథోడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. ఉట్నూరుకు చెందిన రమేష్ రాథోడ్ టీడీపీ నుంచి 1995లో నార్నూర్ జెడ్పీటీసీగా ఎన్నిక, 1999 నుంచి 2004 వరకు ఖానాపూర్ ఎమ్మెల్యేగా, 2006 నుంచి 2009 వరకు ఆదిలాబా ద్ జెడ్పీ చైర్మన్‌గా, 2009 నుంచి 2014 వరకు ఆది లాబాద్ ఎంపీగా ఉన్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చవి చూశారు. 2018లో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు.
టీడీపీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మ న్‌గా గెలిచినా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఖానా పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖానాయక్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లోకసభ స్థానం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఎవరీ చంద్రశేఖర్..?
పెద్దపల్లి నియోజకవర్గానికి అసలు పరిచయం లేని చంద్రశేఖర్‌కు పార్టీ టికెట్ ఇవ్వడం ఇప్పుడు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్‌కు టికెట్ ఇచ్చారని మీడియాలో చూసిన ఆ పార్టీ శ్రేణులే... ఎవరీ చంద్రశేఖర్ అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు. ముఖ్యనేతలకు తప్ప, ముఖపరిచయం కూడా లే ని చంద్రశేఖర్‌కు ఎలా టికెట్ ఇస్తారంటూ మండిపడుతున్నారు.
ఈ స్థానం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ విప్ ఆరెపల్లి మోహన్, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఊట్ల వరప్రసాద్ టికెట్ ఆశించారు. వీరిని కాద ని వికారాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌కు ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కాంగ్రెస్‌లో ముసలం
అధికార టీఆర్‌ఎస్ కన్నా ముందే లోకసభకు అభ్యర్థులను ప్రకటించామన్న ఉత్సాహం కాంగ్రెస్‌కు మిగలడంలేదు. టికెట్ ప్రకటించిన వెంటనే ఆ పార్టీలో ముసలం పుట్టింది. ఆదిలాబాద్ స్థానం నుంచి టికెట్ ఆశించిన నరేష్ జాదవ్, సోయం బాపూరావులు పార్టీపై తిరుగుబాటు చేశారు. రమేష్ రాథోడ్‌కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నరేష్ జాదవ్ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే తీవ్ర అసంతృప్తితో ఉన్న సోయం బాపూరావు ఎట్టిపరిస్థితుల్లోనూ లోకసభకు పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.
బీజేపీ నుంచి బరిలోకి దిగే అంశాన్ని కూడా ఆయన అనుచరులు కొట్టిపారేయడం లేదు. ఇక పెద్దపల్లి స్థానంలో చంద్రశేఖర్‌కు ఇవ్వడాన్ని స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్‌ఎస్ నుంచి బలమైన అభ్యర్థి పోటీలో ఉండనున్న క్రమంలో, ఎక్కడో వికారాబాద్ నుంచి తీసుకొచ్చిన నాయకుడిని పోటీకి పెట్టడాన్ని పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి. టికెట్ ఆశించిన ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్‌లో నెలకొన్న ముసలం సమసిపోతుందో, ఎన్నికల్లో పుట్టి ముంచుతుందో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment