కదిరి : ‘ఒసేయ్ సెంద్రకళ నాకు కోటి రూపాయలు లాటరీ తగిలిందని రాత్రి నిద్దరలో కల వచ్చిందే. నువ్వు నమ్ము నమ్మకపో.. ఆ డబ్బుతో కదిరిలో మనం పేద్ద ఇల్లు కట్టినట్లు, మన పాప ఆ ఇంటో ఆడుకుంటాన్నట్లు కల వచ్చింది. ఏదో ఒకరోజు తగలకుండా పోతుందా.. అబ్బుడు మనకు ఈ అడుక్కుతినే ఖర్మ తప్పుతుంది. నీకు రోజూ నా చేతిలో దెబ్బలూ తప్పుతాయి’ అన్నాడు సోమ్లానాయక్ తన భార్య చంద్రకళతో.
అందుకు ఆమె ‘మనం కేరళకు వచ్చినప్పటి నుండి నీకు ఇంతకన్నా ఇంగేంపనుంది. లాస్టుకు నా తాలిబొట్టు గూడా ఆ లాటరీ టికెట్లకే పెట్టేస్తివే. ఈ పొద్దు ఆదివారము. నాతో పాటు చర్చి దగ్గర కూచుందురా.. నీ చేతికీ కొంత చిక్కుతుంది.. బిడ్లు ఊరికాడ. మనం కేరళలో’ అని కోపగించుకుంది. ఇందుకు అతను ‘నువ్వు పోవే.. నేను రాను. అడుక్కోవడానికి సిగ్గులేదూ అని ఎవరైనా అంటే నాకు బాధైతుంది’ అని రోజూలాగానే బజారుకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నానికి లాటరీ ఫలితాలు వచ్చాయి. కారుణ్య లాటరీ రూ. కోటి ‘కేఈ 237343’ నెంబరుకు తగిలిందని చెప్పారు. సోమ్లానాయక్ తన జేబులో ఉన్న టికెట్ బయటకు తీసి చూసుకున్నాడు. అది తనదేనని తెలుసుకొని కేరళ లో ఓ చర్చి దగ్గర అడుక్కుంటున్న తన భార్య దగ్గరకు పరుగెత్తుకెళ్లి ఆమె చేతిలో ఉన్న తట్ట(ప్లేట్) చేతికి తీసుకొని దూరంగా విసిరి పారేస్తూ ‘రావే ఇంగ మనూరికెళ్లిపోదాం. రాత్రి వచ్చిన కల నిజమైంది. ఆ చర్చిలో ఉన్న దేవుడే మనల్ని కరుణించాడు’ అంటూ ఆనందం పట్టలేకపోయాడు. ఆమె మొదట నమ్మలేదు. తర్వాత అందరూ చెప్పాక నిజమని నమ్మింది. వివరాల్లోకి వెళితే..
కదిరి మండలం కారెడ్డిపల్లితండాకు చెందిన సోమ్లానాయక్ వరుస కరువులు కారణంగా ఊరిలో పనులు లేక తన భార్య చంద్రకళను వెంట బెట్టుకొని కేరళ రాష్ట్రం కొట్టాయంకు దగ్గర్లో ఉన్న కంజిరపల్లి అనే పట్టణానికి ఐదేళ్ల క్రితం వలస వెళ్లాడు. అక్కడ చర్చిలు, మసీదులు, ఆలయాల వద్ద బిక్షాటన మొదలెట్టారు.
డబ్బులు దానం చేస్తూ కొందరు సోమ్లానాయక్ వైపు చూసి ‘కష్టపడి పనులు చేసుకోవచ్చు కదా’ అని మళయాళంలో కోప్పడటం చూసి తనకు భాష అర్థం కాకపోయినా విషయం అర్థం చేసుకున్నాడు. ఆ మరుసటి దినం నుండి అడుక్కోవడం మానేసి ఓ రోజు ఊరు చూద్దామని ఊరంతా తిరగటం మొదలెట్టాడు. ఓ చోట లాటరీ టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతుంటే అతనూ రూ.150 ఇచ్చి రూ.30 విలువ చేసే 5 టికెట్లు కొనుక్కున్నాడు. ఆ రోజే అతనికి రూ. 20 వేలు లాటరీ తగిలింది.
ఇక అప్పటి నుండి ఐదేళ్లుగా ఇదే పనిలో మునిగిపోయాడు. అతని భార్య మాత్రం బిక్షాటన వదిలిపెట్టలేదు. ఆమె తెచ్చిన డబ్బు కోసం ప్రతి రోజూ ఇద్దరూ గొడవ పడేవారు. ఆఖరుకు భార్య తాలిబొట్టు సైతం లాక్కొని లాటరీలకే ఖర్చు చేసేశాడు. ఈ నెల 13వ తేదీ అతను తన భార్య దగ్గర బలవంతంగా రూ. 300 లాక్కెళ్లాడు. ఒక్కొక్కటి రూ. 50 చొప్పున కారుణ్య లాటరీ టికెట్లు 5 కొనుక్కున్నాడు. 14వ తేదీ కేఈ 237343 లాటరీ టికెట్‌కు రూ. 1 కోటి మొదటి బహుమతి తగిలింది. మిగిలిన ఆ 4 టికెట్లకు సైతం రూ.10 వేలు చొప్పున రూ.40 వేలు తగిలింది. రూ. 40 వేలు నగదు రూపంలో అతనికి లాటరీ టికెట్ల విక్రేతలు అక్కడికక్కడే అందజేశారు.
మిగిలిన రూ. కోటి బ్యాంకు ద్వారా తీసుకోవాలని చెప్పడంతో సోమ్లానాయక్ దంపతులు కేరళలోని స్థానికుల సాయంతో కంజిరపల్లి సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్‌ను కలిసి లాటరీ విషయం చెప్పి ఆ లాటరీ టికెట్ అందజేశారు. అతను కలెక్షన్ కోసం పంపుతానని, అయితే ఈ లోగా పాన్ కార్డు తెచ్చుకోండని సలహా ఇస్తూ లాటరీ టికెట్ తన చేతికిచ్చినట్లు రాతమూలకంగా ఇవ్వడంతో పాటు ఆ లాటరీ టికెట్ జిరాక్స్ ప్రతిని కూడా వారికి అందజేశాడు. పాన్ కార్డు కోసం అక్కడ దరఖాస్తు చేసిన సోమ్లా దంపతులు స్వగ్రామం తిరిగొచ్చారు. ఆ డబ్బుతో ఏం చేస్తావని సోమ్లాను అడిగితే ‘నాకు ఒక పెద్ద ఇల్లు కట్టినట్లు కల వచ్చింది. నా కల నిజం చేసుకుంటాను. నా ఇద్దరు పిల్లలను బాగా చదివించుకుంటాను. డబ్బు కోసం ఇక నా భార్యను కొట్టడం మానుకుంటాను. ఇక బాగా చూసుకుంటాను’ అన్నాడు. ఇకనైనా లాటరీ టికెట్లను కొనడం మానేస్తావా? అంటే ‘ఇంగ కేరళకు వెళ్లం కాబట్టి లాటరీ టికెట్లు కొనేది ఉండదు’ అన్నాడు. సోమ్లానాయక్ తండ్రి తావ్రేనాయక్ ఏడాదిన్నత క్రితం జరిగిన పంచారుుతీ ఎన్నికల్లో కే బ్రాహ్మణపల్లి పంచాయతీ నుండి టీడీపీ మద్దతుతో బరిలోకి దిగి వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన నారాయణనాయక్ చేతిలో ఓడిపోయాడు.
‘లాటరీతో కోటి రూపాయలు తగిలినాయంటే నాకైతే ఆనందం లేదు. ఆ లాటరీల వల్లే నా తాళి బొట్టుకూడా పోగొట్టుకున్నాను. లాటరీలకే ఇప్పటిదాకా రూ. 10 లక్షలు ఖర్చుపెట్టేసినాడు. మా ఆయనే కాదు ఎవ్వరూ ఆ లాటరీల జోలికి పోకపోతేనే మంచిది’ అని సోమ్లానాయక్ భార్య చంద్రకళ అమాయకంగానే మంచి సలహా ఇచ్చింది.
కల నిజమైంది!
Published Sat, Dec 20 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM
Advertisement
Advertisement