ఇదిగో పై ఫొటోలో కన్పిస్తున్నది మురికినీరు కాదు.. ‘అనంత’ కార్పొరేషన్ సరఫరా చేస్తోన్న తాగునీరు. నగరంలో దాదాపు 60శాతం ప్రాంతాల్లో ఇలా పురుగులు ఉన్న నీరే సరఫరా అవుతోంది. గత్యంతరం లేక వేలాది కుటుంబాల వారు ఈ నీటినే తాగుతూ రోగాలబారిన పడుతున్నారు. గత ఆర్నెళ్లుగా నగరంలో ఇలాంటి నీరు వస్తున్నా ఇటు మేయర్... అటు ఎమ్మెల్యే ఏ ఒక్కరూ సమస్యపై దృష్టి సారించలేదు. ఏడాది పాలనపై సంబరాలు చేసుకున్న అధికారపార్టీ నేతలు... తమ పాలనలో నగరవాసులకు కనీసం తాగేందుకు ‘స్వచ్ఛ’ జలాన్ని అందించలేకపోయూరు.
సాక్షిప్రతినిధి, అనంతపురం: అనంతపుర ం నగరంలో సుమారు 3 లక్షల జనాభా ఉంటుందని కార్పొరేషన్ అధికారుల అంచనా! వీరందరూ తాగునీటి కోసం ఏళ్లతరబడి ఇబ్బంది పడ్డారు. 2009లో అప్పటి ప్రభుత్వం ముద్దలాపురం వద్ద 60ఎంఎల్‌డీ సామర్థ్యంతో ‘వైఎస్ రాజశేఖరరెడ్డి అనంత తాగునీటి పథకాన్ని’ రూ.72కోట్ల వ్యయంతో నిర్మించారు. పీఏబీఆర్ నుంచి ముద్దలాపురానికి తుంగభద్ర జలాలు వస్తాయి. అక్కడి శుద్ధిచేసిన నీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు. రోజుకు 40మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో అందరూ కార్పొరేషన్ నీటినే తాగేవారు.
క్లోరినేషన్ నామమాత్రమే
గత ఏడాదిగా నీటిసరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. క్లోరినేషన్ నామమాత్రంగా చేస్తున్నారు. ప్లాంటు వద్ద 8.5-9కిలోల క్లోరిన్‌ను కలుపుతున్నారు. ముద్దలాపురం నుంచి ‘అనంత’కు 25 కిలోమీటర్లు ఉంది. నగరంలో నీటిని పరిశీలిస్తే క్లోరిన్ శాతం సున్నాగాా తేలుతోంది. క్లోరినేషన్ సున్నా ఉంటే అది శుద్ధజలం కాదు. నీటిశుద్ధిప్లాంటు- అనంతపురానికి మధ్య దూరం వల్లే క్లోరిన్ శాతం తగ్గిపోతుందని అధికారులు భావించారు. దీంతో కూడేరు వద్ద రూ.14 లక్షలతో ఆరేళ్ల కిందటే బూస్లర్‌పాయింట్‌ను ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ఇప్పటికీ పాలకవర్గం వినియోగించలేదు. ఎందుకు వినియోగించలేదని ఆరా తీస్తే కరెంటు కనెక్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి కార్పొరేషన్ నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. అలాగే నీటిశుద్ధిప్లాంటులో ‘ఆలం’ను కూడా మొక్కుబడిగా కలుపుతున్నారని తెలుస్తోంది. రోజుకు 300 కిలోల ఆలం కలపాల్సి ఉంది. అయితే కనీసం వంద కిలోలు కూడా కలపడం లేదని, ఒక్కోరోజు ఆలాన్ని కలపకుండానే నీటిని పంపుతున్నట్లు తెలుస్తోంది.
తాగునీళ్లు ఇవ్వలేకపోయారు
అనంత కార్పొరేషన్ ఏడాది పాలన సంతృప్తికరంగా సాగిందని పాలకవర్గం సంబరాలు చేసుకుంది. మేయర్ మదమంచి స్వరూప కేక్‌కట్ చేసి ఏడాదిపాలనలో ఎంతో చేశామని చెప్పకుంటూ వచ్చారు. అయితే ఏడాదిలో కనీసం నగరవాసులు తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేకపోయారు. నగరంలో చాలాచోట్ల మురుగుకాలువల్లో తాగునీటి పైపులు ఉన్నాయి. పైపులు లీకేజీ ఉన్నచోట మురికినీరు ఇందులో కలుస్తోంది. ఈ కారణంగా కూడా నీరు కలుషితం అవుతోంది.
2.5 కోట్ల తాగునీటి పన్ను వసూలు
నగరవాసుల నుంచి ఏడాదికి రూ.2.5కోట్ల తాగునీటి పన్నురూపంలో కార్పొరేషన్ వసూలు చేస్తోంది. ఇందులో 10శాతం నిధులు ఖర్చుపెట్టినా శుద్ధజలాన్ని అందించవచ్చు. అయితే ఈ దిశగా ప్రజాప్రతినిధులు ఆలోచించడం లేదు. మేయర్‌తో పాటు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి కూడా తాగునీటి సమస్య పరిష్కారంపై నిర్లప్తత ప్రదర్శించారు. నగరంలో నీటి నాణ్యత, తీసుకోవల్సిన చర్యలపై స్థానిక ఎమ్మెల్యేగా ఏడాదిలో తన బాధ్యతలను విస్మరించారని నగరవాసులు చెబుతున్నారు.
క్లోరిన్‌శాతం జీరో కావడంనిజమే
అనంతపురంలో నీటిలో క్లోరిన్ జీరోగా వస్తోంది. అందుకే లిక్విడ్ క్లోరిన్ ఓవర్‌హెడ్‌ట్యాంకుల్లో కలుపుతున్నాం. బూస్లర్‌పాయింట్‌కు 3రోజుల కిందటే కరెంటు కనెక్షన్ కోసం డబ్బులు చెల్లించాం. త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తాం. ఆలం కలపలేదనడంలో వాస్తవం లేదు. రోజూ కలుపుతున్నాం.
-సూర్యనారాయణ, కార్పొరేషన్ డీఈ
ఎవరైనా ఈ నీళ్లు తాగుతారా?
ఈ నీళ్లు చూడండయ్యా! ఎన్ని పురుగులు ఉన్నాయో! కార్పొరేషనోళ్లయితే ఈ నీళ్లు తాగుతారా చెప్పండి. ముందుగానే మా ఆరోగ్యాలు అంతంతమాత్రం. ఇట్టాటి నీళ్లు తాగితే రెండురోజులకే మూలన పడతాం. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేకపోతే ఎట్టా అయ్యా!
- సుందరమ్మ, మూడోరోడ్డు, అనంతపురం
డ్రింకిల్ వాటర్!
Published Sun, Jul 12 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement