driange water
-
డ్రింకిల్ వాటర్!
ఇదిగో పై ఫొటోలో కన్పిస్తున్నది మురికినీరు కాదు.. ‘అనంత’ కార్పొరేషన్ సరఫరా చేస్తోన్న తాగునీరు. నగరంలో దాదాపు 60శాతం ప్రాంతాల్లో ఇలా పురుగులు ఉన్న నీరే సరఫరా అవుతోంది. గత్యంతరం లేక వేలాది కుటుంబాల వారు ఈ నీటినే తాగుతూ రోగాలబారిన పడుతున్నారు. గత ఆర్నెళ్లుగా నగరంలో ఇలాంటి నీరు వస్తున్నా ఇటు మేయర్... అటు ఎమ్మెల్యే ఏ ఒక్కరూ సమస్యపై దృష్టి సారించలేదు. ఏడాది పాలనపై సంబరాలు చేసుకున్న అధికారపార్టీ నేతలు... తమ పాలనలో నగరవాసులకు కనీసం తాగేందుకు ‘స్వచ్ఛ’ జలాన్ని అందించలేకపోయూరు. సాక్షిప్రతినిధి, అనంతపురం: అనంతపుర ం నగరంలో సుమారు 3 లక్షల జనాభా ఉంటుందని కార్పొరేషన్ అధికారుల అంచనా! వీరందరూ తాగునీటి కోసం ఏళ్లతరబడి ఇబ్బంది పడ్డారు. 2009లో అప్పటి ప్రభుత్వం ముద్దలాపురం వద్ద 60ఎంఎల్డీ సామర్థ్యంతో ‘వైఎస్ రాజశేఖరరెడ్డి అనంత తాగునీటి పథకాన్ని’ రూ.72కోట్ల వ్యయంతో నిర్మించారు. పీఏబీఆర్ నుంచి ముద్దలాపురానికి తుంగభద్ర జలాలు వస్తాయి. అక్కడి శుద్ధిచేసిన నీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు. రోజుకు 40మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో అందరూ కార్పొరేషన్ నీటినే తాగేవారు. క్లోరినేషన్ నామమాత్రమే గత ఏడాదిగా నీటిసరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. క్లోరినేషన్ నామమాత్రంగా చేస్తున్నారు. ప్లాంటు వద్ద 8.5-9కిలోల క్లోరిన్‌ను కలుపుతున్నారు. ముద్దలాపురం నుంచి ‘అనంత’కు 25 కిలోమీటర్లు ఉంది. నగరంలో నీటిని పరిశీలిస్తే క్లోరిన్ శాతం సున్నాగాా తేలుతోంది. క్లోరినేషన్ సున్నా ఉంటే అది శుద్ధజలం కాదు. నీటిశుద్ధిప్లాంటు- అనంతపురానికి మధ్య దూరం వల్లే క్లోరిన్ శాతం తగ్గిపోతుందని అధికారులు భావించారు. దీంతో కూడేరు వద్ద రూ.14 లక్షలతో ఆరేళ్ల కిందటే బూస్లర్పాయింట్ను ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ఇప్పటికీ పాలకవర్గం వినియోగించలేదు. ఎందుకు వినియోగించలేదని ఆరా తీస్తే కరెంటు కనెక్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి కార్పొరేషన్ నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. అలాగే నీటిశుద్ధిప్లాంటులో ‘ఆలం’ను కూడా మొక్కుబడిగా కలుపుతున్నారని తెలుస్తోంది. రోజుకు 300 కిలోల ఆలం కలపాల్సి ఉంది. అయితే కనీసం వంద కిలోలు కూడా కలపడం లేదని, ఒక్కోరోజు ఆలాన్ని కలపకుండానే నీటిని పంపుతున్నట్లు తెలుస్తోంది. తాగునీళ్లు ఇవ్వలేకపోయారు అనంత కార్పొరేషన్ ఏడాది పాలన సంతృప్తికరంగా సాగిందని పాలకవర్గం సంబరాలు చేసుకుంది. మేయర్ మదమంచి స్వరూప కేక్‌కట్ చేసి ఏడాదిపాలనలో ఎంతో చేశామని చెప్పకుంటూ వచ్చారు. అయితే ఏడాదిలో కనీసం నగరవాసులు తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేకపోయారు. నగరంలో చాలాచోట్ల మురుగుకాలువల్లో తాగునీటి పైపులు ఉన్నాయి. పైపులు లీకేజీ ఉన్నచోట మురికినీరు ఇందులో కలుస్తోంది. ఈ కారణంగా కూడా నీరు కలుషితం అవుతోంది. 2.5 కోట్ల తాగునీటి పన్ను వసూలు నగరవాసుల నుంచి ఏడాదికి రూ.2.5కోట్ల తాగునీటి పన్నురూపంలో కార్పొరేషన్ వసూలు చేస్తోంది. ఇందులో 10శాతం నిధులు ఖర్చుపెట్టినా శుద్ధజలాన్ని అందించవచ్చు. అయితే ఈ దిశగా ప్రజాప్రతినిధులు ఆలోచించడం లేదు. మేయర్‌తో పాటు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి కూడా తాగునీటి సమస్య పరిష్కారంపై నిర్లప్తత ప్రదర్శించారు. నగరంలో నీటి నాణ్యత, తీసుకోవల్సిన చర్యలపై స్థానిక ఎమ్మెల్యేగా ఏడాదిలో తన బాధ్యతలను విస్మరించారని నగరవాసులు చెబుతున్నారు. క్లోరిన్‌శాతం జీరో కావడంనిజమే అనంతపురంలో నీటిలో క్లోరిన్ జీరోగా వస్తోంది. అందుకే లిక్విడ్ క్లోరిన్ ఓవర్హెడ్ట్యాంకుల్లో కలుపుతున్నాం. బూస్లర్పాయింట్కు 3రోజుల కిందటే కరెంటు కనెక్షన్ కోసం డబ్బులు చెల్లించాం. త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తాం. ఆలం కలపలేదనడంలో వాస్తవం లేదు. రోజూ కలుపుతున్నాం. -సూర్యనారాయణ, కార్పొరేషన్ డీఈ ఎవరైనా ఈ నీళ్లు తాగుతారా? ఈ నీళ్లు చూడండయ్యా! ఎన్ని పురుగులు ఉన్నాయో! కార్పొరేషనోళ్లయితే ఈ నీళ్లు తాగుతారా చెప్పండి. ముందుగానే మా ఆరోగ్యాలు అంతంతమాత్రం. ఇట్టాటి నీళ్లు తాగితే రెండురోజులకే మూలన పడతాం. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేకపోతే ఎట్టా అయ్యా! - సుందరమ్మ, మూడోరోడ్డు, అనంతపురం -
వాగునీరు విషతుల్యం
చిలకలూరిపేటరూరల్ : ఆయిల్ కంపెనీల నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మిల్లుల్లోని వ్యర్థ రసాయనాలను వాగుల్లోకి విడుదల చేసి ఆ నీటిని విషతుల్యం చేస్తున్నారు. ఫలితంగా ఆనీటిని సాగుకు వినియోగించిన పొలాల్లోని పంటలు ఎండుముఖం పడుతుండగా.. రంగుమారి నురుగుతో కూడిన వాగు నీరు తాగి పశువులు మృత్యువాత పడుతున్నాయి. చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామ శివారులో రాష్ర్ట వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన ఆయిల్‌మిల్ ఉంది. ఈ మిల్లుతోపాటు ఎగువున ఉన్న మరికొన్ని కంపెనీల్లో అవసరాలకు వినియోగించిన కలుషిత నీటిని కుప్పగంజివాగులోకి తరలిస్తున్నారు. రసాయనాలు కలిసిన నీరు వాగులో చేరటంతో ఆనీరు రంగు మారి దుర్వాసన వెదజల్లుతోంది. మానుకొండవారిపాలెం - వేలూరు గ్రామాల మధ్య ప్రవహించే ఈ వాగు నీటిని ప్రజలు తాగేందుకు, పంటల సాగుకు వినియోగిస్తారు. కలుషిత నీటిని తాగిన ప్రజలు అనారోగ్యానికి గురౌతున్నారు. పశువులు మరణిస్తున్నాయి. వాగునీటిని సాగుకు వినియోగిస్తున్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. వేలూరు, మానుకొండవారిపాలెం, దండమూడి, గొట్టిపాడు, మిట్టపాలెం తదితర గ్రామాల ప్రజలు ఈ నీటిని ఎక్కువగా వినియోగిస్తారు. వాగునీరు చెరువుల్లోకి... చిలకలూరిపేట మండలంలోని వివిధ గ్రామాలు సాగర్ ఆయకట్టు టేల్పాండ్ (చివరి ప్రాంతంలో) ఉన్నాయి. కుడికాలువ నీరు పూర్తిస్థాయిలో ప్రవహించకపోవటంతో వాగు నీటిని తాగునీటి చెరువులకు పంపింగ్ చేస్తారు. రసాయనాలతో కలిసిన మురుగునీరు చెరువులకు చేరడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వేలూరులోని చెరువుకు నీటిని పంపింగ్ చేసేందుకు వాగు సమీపంలోనే పంపింగ్ హౌస్‌ను నిర్మించారు. ఈ నీటిని వినియోగించిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దండమూడి గ్రామంలో వాగు పరీవాహకంలో బోర్ నుంచి వస్తున్న నీరు కూడా కలుషితమైంది. పంటపొలాలకూ రసాయన నీరు... పరిశ్రమల్లో పత్తి విత్తనాల నుంచి నూనె తీసేందుకు, క్రూడ్ ఆయిల్‌ను వేరు చేసేందుకు అధికంగా కార్బన్-ఎస్, హైడ్రోసోడియం, కాస్టిక్ సోడా, కొన్ని సందర్భాల్లో యాసిడ్‌ను వినియోగిస్తారు. పరిశ్రమల ద్వారా నిత్యం వచ్చే వృథా నీటిని మిల్లులో చెరువులను ఏర్పాటు చేసి నిల్వ చేస్తారు. ఈ నీటిని వేసవి ప్రారంభంలోనే విడుదల చేయటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్ కుడికాలువకు ఈనెల 15వ తేదీ తర్వాత నీరు నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు సాగు నీటి కోసం ఎదురు చూశారు. ఆయకట్టు చివరిప్రాంతంలో ఉండటంతో సాగు నీరు వచ్చే అవకాశం లేకుండాపోయింది. ప్రత్యామ్నాయంగా వాగునీటిని ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కుప్పగంజి వాగు నీటిలో రసాయనాలు కలవటంతో ఇదే నీరు ఓగేరు వాగులో గొట్టిపాడు వద్ద కలిసిపోతోంది. దీనిపై అవగాహనలేని రైతులు పొగాకు, జొన్న, అపరాలు తదితర పంటలకు కలుషిత నీటిని పెడుతున్నారు. ఫలితంగా ఆ పంటలు దెబ్బతింటున్నాయి. రచ్చబండలో రచ్చ రచ్చ... వాగునీటిలోకి రసాయనాలు కలిసిన నీరు ప్రవహిస్తుందని వీటి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. మానుకొండవారిపాలెం గ్రామంలో గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వాగునీటి సమస్యపై ప్రత్తిపాటిని ప్రజలు ప్రశ్నించగా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ దీనిపై ఆయన దృష్టిసారించలేదు. కలుషిత నీటిని వాగులో కలువకుండా చూసి ప్రజా రోగ్యాన్ని పరిరక్షించాలని బాధిత గ్రామా ల ప్రజలు అధికారులను కోరుతున్నారు. -
అయ్యయ్యో!
సాక్షి, నెల్లూరు: పెన్నానది మురుగు కూపంగా మారుతోంది. నగరంలోని చెత్తా, చెదారం, డ్రైనేజీ నీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలకు పవిత్ర పెన్నానది నిలయంగా మారి నది నీళ్లు విషపూరితమౌతున్నాయి. దీంతో నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్న పెన్నాతాగునీరు విషమయం అవుతున్నాయి. ఈ నీటితో పండే పంటలు సైతం విషపూరితంగా మారుతున్నాయి. మరోవైపు మితిమీరిన ఆక్రమణలతో నది రోజురోజుకూ కుంచించుకు పోతోంది. సింహపురి నగరానికి సమీపంలో ఉన్న పవిత్ర పెన్నానది నెల్లూరు కార్పొరేషన్ వారికి చెత్తా చెదారం నింపుకునే డంపింగ్ యార్డుగా మారిపోయింది. ప్రతిరోజూ నగరంలోని టన్నుల కొద్దీ చెత్తను వారు బోడిగాడితోట ప్రాంతానికి ఆనుకొని ఉన్న నదిలోకి వదులుతున్నారు. మురిగిన చెత్త నదినీటిని విషపూరితం చేస్తోంది. దీంతో పాటు రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లు, చిన్నచిన్న పరిశ్రమల మురుగు, వ్యర్థాలు నేరుగా నదిలోకి వస్తుండటంతో నీరు విపరీతమైన కాలుష్యానికి గురవుతోంది. ఇక నగరానికి తాగునీటిని అందించే పాత పెద్దాస్పత్రి ప్రాంతంలోని నదిలో ఉన్న వాటర్ పంపింగ్ సిస్టమ్‌లు ఉన్న ప్రాంతంలో సైతం చెత్త, వ్యర్థాలతో పాటు మురుగు నీరు వదులుతున్నారు. దీంతో ఆ ప్రాంతం కలుషితమౌతోంది. తాగునీరు సైతం కలుషితం అవుతుండటంతో నగరవాసులు రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయమై ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, ఆందోళనలు నిర్వహించినా వారు ఏమాత్రం స్పందించిన పాపానపోలేదు. ఇక కలుషితమైన నది నీరు పంటపొలాలను నిర్వీర్యం చేయడమే కాక పంటలను విషపూరితం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఇదివరకే నిపుణులు నిర్ధారించారు. గతంలో ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం పెన్నా నీటిని పరీక్షించింది. నీటిలో అధిక మోతాదులో ప్రమాదకర స్థాయిలో కలుషిత పదార్థాలు ఉన్నాయని నిర్ధారించింది. నదినీరు కలుషితం కాకుండా బయటే శుద్ధి చేసేందుకు రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించిం ది. దీంతో పాటు వర్షపు, మురుగు నీరు సైతం నే రుగా నదిలో కలవకుండా ప్రత్యేక కాలువను నిర్మించడమే కాక పెన్నాలో పేరుకు పోయిన పూడికతీత పనులను చేపట్టాలని నాడు కమిటీ సూచిందింది. ఇందులో భాగంగా పెన్నా కలుషిత నివారణకు కేం ద్రం నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలు, నిధుల కేటాయింపులు అటకెక్కాయి. ప్రజల పుణ్యమాని పదవులు అనుభవిస్తున్న ఇక్కడి ప్రజాప్రతినిధులు, మంత్రి వారి బాగోగులు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. ఆక్రమణలతో రోజురోజుకూ పెన్నా కుంచించుకుపోతోంది. అధికార పార్టీ నేతల అండతో నేతలు నగర పరిధిలోని వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డి కాలనీ, రంగనాయకులపేట రైల్వేగేటు, జాఫర్ సాహెబ్ కాలువకట్ట, బోడిగాడితోట నుంచి మైపాడుగేటు వరకూ పెద్ద ఎత్తున నదిని ఆక్రమించి ఏకంగా పక్కా గృహాలనే నిర్మించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించడంతోపాటు పూడికతీత, నదీజలాల శుభ్రతపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
విషజ్వరంతో ఒకరి మృతి
పాండ్యానాయక్‌తండా (చివ్వెంల), న్యూస్‌లైన్ : మండల పరిధిలోని పాండ్యానాయక్‌తండాలో విషజ్వరంతో బుధవారం ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెంది న బానోతు శ్రీను(40) పదిహేను రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట, ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకువెళ్లి చికిత్స చేయించి మంగళవారం తండాకు తీసుకువచ్చారు. కాగా, అర్ధరాత్రి మళ్లీ జ్వరం రావడంతో తీవ్ర అస్వస్థతకు గురై శ్రీను మృతి చెందాడు. అదేవిధంగా తండాకు చెందిన ధరావత్ పంతు లు (65) ధరావత్ అంజాని(70) విషజ్వరంతో బాధపడుతూ మంచం పట్టారు. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం పాండ్యానాయక్ తండాలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. పం చాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో వీధుల్లోనే మురుగునీరు నిలుస్తోంది. దీంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీనికి తోడు తండాకు తాగునీరు అందించే స్కీంబోరు మరమ్మతుకు గురికావడంతో శివారులోని చేతిపంపు నీటినే తండావాసులు తాగుతున్నారు. వర్షం వచ్చినప్పుడు మురుగునీరు భూమిలోకి ఇంకి తాగునీరు కలుషితమవుతోం దని వాపోతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తండాను సందర్శించిన వైద్యసిబ్బంది పీహెచ్సీ సిబ్బంది బుధవారం తండాను సందర్శించారు. బానో తు శ్రీను మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి కరుణాకర్, సూపర్ వైజర్ లక్ష్మీ, ఎఎన్ఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.