చిలకలూరిపేటరూరల్ : ఆయిల్ కంపెనీల నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మిల్లుల్లోని వ్యర్థ రసాయనాలను వాగుల్లోకి విడుదల చేసి ఆ నీటిని విషతుల్యం చేస్తున్నారు. ఫలితంగా ఆనీటిని సాగుకు వినియోగించిన పొలాల్లోని పంటలు ఎండుముఖం పడుతుండగా.. రంగుమారి నురుగుతో కూడిన వాగు నీరు తాగి పశువులు మృత్యువాత పడుతున్నాయి.
చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామ శివారులో రాష్ర్ట వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన ఆయిల్‌మిల్ ఉంది. ఈ మిల్లుతోపాటు ఎగువున ఉన్న మరికొన్ని కంపెనీల్లో అవసరాలకు వినియోగించిన కలుషిత నీటిని కుప్పగంజివాగులోకి తరలిస్తున్నారు. రసాయనాలు కలిసిన నీరు వాగులో చేరటంతో ఆనీరు రంగు మారి దుర్వాసన వెదజల్లుతోంది. మానుకొండవారిపాలెం - వేలూరు గ్రామాల మధ్య ప్రవహించే ఈ వాగు నీటిని ప్రజలు తాగేందుకు, పంటల సాగుకు వినియోగిస్తారు. కలుషిత నీటిని తాగిన ప్రజలు అనారోగ్యానికి గురౌతున్నారు. పశువులు మరణిస్తున్నాయి. వాగునీటిని సాగుకు వినియోగిస్తున్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. వేలూరు, మానుకొండవారిపాలెం, దండమూడి, గొట్టిపాడు, మిట్టపాలెం తదితర గ్రామాల ప్రజలు ఈ నీటిని ఎక్కువగా వినియోగిస్తారు.
వాగునీరు చెరువుల్లోకి...
చిలకలూరిపేట మండలంలోని వివిధ గ్రామాలు సాగర్ ఆయకట్టు టేల్‌పాండ్ (చివరి ప్రాంతంలో) ఉన్నాయి. కుడికాలువ నీరు పూర్తిస్థాయిలో ప్రవహించకపోవటంతో వాగు నీటిని తాగునీటి చెరువులకు పంపింగ్ చేస్తారు. రసాయనాలతో కలిసిన మురుగునీరు చెరువులకు చేరడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వేలూరులోని చెరువుకు నీటిని పంపింగ్ చేసేందుకు వాగు సమీపంలోనే పంపింగ్ హౌస్‌ను నిర్మించారు. ఈ నీటిని వినియోగించిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దండమూడి గ్రామంలో వాగు పరీవాహకంలో బోర్ నుంచి వస్తున్న నీరు కూడా కలుషితమైంది.
పంటపొలాలకూ రసాయన నీరు...
పరిశ్రమల్లో పత్తి విత్తనాల నుంచి నూనె తీసేందుకు, క్రూడ్ ఆయిల్‌ను వేరు చేసేందుకు అధికంగా కార్బన్-ఎస్, హైడ్రోసోడియం, కాస్టిక్ సోడా, కొన్ని సందర్భాల్లో యాసిడ్‌ను వినియోగిస్తారు. పరిశ్రమల ద్వారా నిత్యం వచ్చే వృథా నీటిని మిల్లులో చెరువులను ఏర్పాటు చేసి నిల్వ చేస్తారు. ఈ నీటిని వేసవి ప్రారంభంలోనే విడుదల చేయటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్ కుడికాలువకు ఈనెల 15వ తేదీ తర్వాత నీరు నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు సాగు నీటి కోసం ఎదురు చూశారు. ఆయకట్టు చివరిప్రాంతంలో ఉండటంతో సాగు నీరు వచ్చే అవకాశం లేకుండాపోయింది. ప్రత్యామ్నాయంగా వాగునీటిని ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కుప్పగంజి వాగు నీటిలో రసాయనాలు కలవటంతో ఇదే నీరు ఓగేరు వాగులో గొట్టిపాడు వద్ద కలిసిపోతోంది. దీనిపై అవగాహనలేని రైతులు పొగాకు, జొన్న, అపరాలు తదితర పంటలకు కలుషిత నీటిని పెడుతున్నారు. ఫలితంగా ఆ పంటలు దెబ్బతింటున్నాయి.
రచ్చబండలో రచ్చ రచ్చ...
వాగునీటిలోకి రసాయనాలు కలిసిన నీరు ప్రవహిస్తుందని వీటి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. మానుకొండవారిపాలెం గ్రామంలో గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వాగునీటి సమస్యపై ప్రత్తిపాటిని ప్రజలు ప్రశ్నించగా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ దీనిపై ఆయన దృష్టిసారించలేదు. కలుషిత నీటిని వాగులో కలువకుండా చూసి ప్రజా రోగ్యాన్ని పరిరక్షించాలని బాధిత గ్రామా ల ప్రజలు అధికారులను కోరుతున్నారు.
వాగునీరు విషతుల్యం
Published Sun, Mar 8 2015 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement